డీసీపీ సీతారామ్‌కు విజ్ఞప్తి చేస్తున్న గద్దర్
జనగామ: జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం మండలగూడెం బాలసాయిబాబా ట్రస్ట్ భూములను రక్షించే క్రమంలో తనకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని ప్రజా గాయకుడు గద్దర్ కోరారు. ఈ మేరకు శనివారం వెస్ట్‌జోన్ డీసీపీ సీతారాంను జిల్లా కేంద్రంలోని కార్యాలయంలో కలిసి వినతిపత్రం అందజేశారు. రెండు షిఫ్టులు పని చేసేలా నలుగురు గన్‌మెన్లను రక్షణగా కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.
అనంతరం గద్దర్ మాట్లాడుతూ బాలసాయిబాబా ట్రస్ట్ భూములను ప్రభుత్వానికి అప్పగించాలని కొంతకాలంగా పోరాటం చేస్తున్నానని చెప్పారు. భూముల పరిరక్షణకు తరుచూ ఈ ప్రాంతానికి వస్తున్నానని, పలువురు ప్రజాప్రతినిధులు, రియల్టర్లతో తనకు ప్రాణహాని ఉన్నట్లు తెలిసిందన్నారు. మండలగూడెం రియల్టర్ల చేతిలో ఉన్న 59 ఎకరాల బాలసాయిబాబా ట్రస్ట్ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని పోరాట యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న పేరుతో అక్కడే విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని గద్దర్ డిమాండ్ చేశారు.
బాలసాయిబాబా కుటుంబ సభ్యులు ఆ భూములను హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తికి విక్రయించినట్లు సమాచారం ఉందని, భూముల వివరాలు కావాలని మూడు రోజుల కిందట సమాచార హక్కు చట్టం కింద రఘునాథపల్లి రెవెన్యూ అధికారులను కోరినట్లు వెల్లడించారు. ఇప్పటికే ఓసారి తనపై హత్యాయత్నం జరిగిందని, బాలసాయిబాబా భూములను కాపాడేందుకు చేస్తున్న పోరాటంలో రక్షణ కల్పించాలని కలెక్టర్ శివలింగయ్య, డీసీపీ సీతారాంకు గద్దర్ విన్నవించారు.
Comments
Please login to add a commentAdd a comment