సైబర్ నేరగాళ్లతో జాగ్రత్త..! | Beware of cyber criminals ..! | Sakshi
Sakshi News home page

సైబర్ నేరగాళ్లతో జాగ్రత్త..!

Published Sat, Aug 16 2014 12:10 AM | Last Updated on Thu, Jul 26 2018 5:21 PM

సైబర్ నేరగాళ్లతో జాగ్రత్త..! - Sakshi

సైబర్ నేరగాళ్లతో జాగ్రత్త..!

కంటికి కనపడరు.. కన్నమేస్తారు మారుతున్న కాలానుగుణంగా  ఆధునిక పరిజ్ఞానం కూడా కొంత పుంతలు తొక్కుతోంది. అదేస్థాయిలో నేరాలు కూడా దడ పుట్టిస్తున్నాయి. బ్యాంకు ఏటీఎం కార్డు మన దగ్గరే ఉంటుంది.. కానీ ఖాతాలో నగదు ఖాళీ అవుతుంది. ఫేస్‌బుక్ మనం వాడకపోయినా.. మన అకౌంట్ పేరిట వాళ్లు వాడుతుంటారు. మెయిల్ పాస్‌వర్డ్‌లు, అన్నీ హ్యాక్ చేస్తుంటారు వారే సైబర్ నేరగాళ్లు. మనం ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా ఇబ్బందులు తప్పవు.
 
న్యూఢిల్లీ: ఏడాది కిందట ఓ వ్యక్తి  ఆధునిక పరిజ్ఞానంతో ఇతరుల ఏటీఎం కార్డులకు నకిలీలను త యారుచేసి సొమ్ము డ్రా చేసి పోలీసులకు పట్టుబడ్డాడు. నగరంలో పలు ప్రాంతాల్లో ఫేస్‌బుక్‌ను వినియోగిస్తున్న వారికి తెలియకుండానే వారి ఫేస్‌బుక్ అకౌంట్‌నుంచి ఇతరులకు అసభ్యకర సందేశాలు, అసభ్యకర ఫొటోలు అప్‌లోడ్ చేయడంతో ఈ ఘటనలపై సైతం పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇలా కొంతకాలంగా నగరంలో సైబర్ నేరాలు పెరుగుతున్నాయి. 

ఏవైనా పొరపాటు జరిగితే కటకటాలు లెక్కించేది మనమే. మీ నంబర్ బంపర్ లాటరీకి సెలెక్ట్ అయిందనీ, కోట్లు వచ్చాయని... వెంటనే సొమ్ము డ్రా చేసుకొమ్మని లోకల్ నంబర్ నుంచి సెల్‌కు ఓ మెసేజ్ వస్తుంది. ఈ మెయిల్‌కు కూడా ఇలాంటి మెసేజ్‌లే వస్తుంటాయి. కోట్లు డ్రా తగిలిందిగా... అనే సంబరంలో వారడిగిన వివరాలు ఇచ్చామా.. అంతే... ఇక మన పనిగోవిందా.. ఇలాంటి సైబర్ నేరాలు తరచూ విని ఆశ్చర్యపోతుంటాం. సైబర్ నేరాలకు శిక్ష, వాటి బారినుంచి రక్షణ పొందడంపై ఈ ప్రత్యేక కథనం.
 
నిజజీవితంలో ప్రతి ఒక్కరికి ఇంటర్నెట్ నిత్యావసరంగా మారింది. ఇంటర్నెట్ లేకుండా ఒక్క నిమిషం కూడా ఉండలేని పరిస్థితి నెలకొంది. ఉదయం నిద్రలేచినప్పటి నుంచి రాత్రి పడుకొనేంతవరకు ప్రతి సందర్భంలోనూ నెట్ వాడుతుంటాము. స్మార్ట్‌ఫోన్లు వచ్చాక ప్రపంచమే మారిపోయింది. సెల్‌లో నెట్ అందుబాటులోకి రావడంతో ఇంటర్నెట్ వాడకం పెరిగిపోయింది. దీంతో నేరాలు సైతం ఎక్కువగా నమోదువుతున్నాయి. సైబర్ నేరగాళ్లు ఇతరుల సాఫ్ట్‌వేర్లు, మెయిల్స్‌ను హ్యాక్‌చేసి వాటిని వినియోగించుకుని తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు. పలు అంతర్జాతీయ సంస్థలు, వ్యక్తులు, క్రీడాకారులు, బ్యాంకులు సైబర్ నేరగాళ్లకు చిక్కకుండా పలు జాగ్రత్తలు తీసుకుంటూ ప్రత్యేక వ్యవస్థలను ఏర్పాటు చేసుకుంటున్నారు.
 
ఈ మెయిల్ ఫిషింగ్
ఈ మెయిల్ హ్యాకింగ్ రెండురకాలు. మనం మెయిల్ ఉపయోగించే ముందుగానే నకిలీ పేజీ ఒకటి సృష్టించి ఉంచుతారు. అందులో మన చిరునామా, ఈ మెయిల్ అడ్రస్, పాస్‌వర్డ్ నమోదుచేసి చూస్తే పేజీ కెనాట్ బీ ఓపెన్ అని వస్తుంది. దీంతో మనం నెట్‌వర్క్ సమస్య ఉందని వదిలేస్తాం. కానీ ఈలోపే మన వివరాలు, ఈ మెయిల్ అడ్రస్, పాస్‌వర్డ్ హ్యాకర్ల కంప్యూటర్‌లో నమోదవుతాయి. మనం మళ్లీ ఈమెయిల్ ట్రైచేస్తే ఎప్పటిలాగానే ఓపెన్ అవుతుంది.
 
ఆ తరువాత మెయిల్స్ చెక్ చేసుకుని సైన్ అవుట్ చేసేస్తాం. కానీ మన వివరాలు సేకరించిన హ్యాకర్లు మన పనిని నిశితంగా గమనిస్తుంటారు. మనం ఏం చేస్తున్నామో ఎప్పటికప్పుడు వారికి తెలిసిపోతూ ఉంటుంది. దీని ద్వారా విలువైన సమాచారం, పాస్‌వర్డ్స్, బ్యాంకు ఖాతాల వివరాలు వారి చేతుల్లోకి వెళ్లే ప్రమాదముంది. మనకు తెలియకుండానే మెయిళ్లు వెళుతుంటాయి. మనం ఉపయోగించినట్టే సులభంగా లాగిన్ అవుతారు. తీవ్రంగా నష్టపోవడంతో పాటు మనం ఇబ్బందులు పడాల్సి వస్తుంది.
 
ఫేస్‌బుక్ అవుతారు
ఫేస్‌బుక్ వినియోగం కొత్తపుంతలు తొక్కుతోంది. ఈ తరుణంలో మనం ఏ మాత్రం ఏమరపాటుగా ఉన్న బుక్ అవడం ఖాయం. ఇటీవల ఫేస్‌బుక్ పాస్‌వర్డ్‌లను తెలుసుకొని కొందరు అపరిచితులు అసభ్యచిత్రాలను అప్‌లోడ్ చేస్తున్న సంఘటనలు జిల్లాలో వెలుగుచేశాయి.  ఇటీవల ఫేస్‌బుక్‌లో ఎలాంటి అడ్డూ లేకుండా పలు చిత్రాలు, మెస్‌జేలు వస్తుండేవి. వీటికి అడ్డుకట్టవేసేందుకు ప్రభుత్వం ఐటీ యాక్టును బలోపేతం చేసింది.
 
ఏటీఎం క్లోనింగ్: ఈ మధ్యకాలంలో ఏటీఎం కార్డులు విచ్చలవిడిగా క్లోనింగ్‌కు గురవుతున్నాయి. ఏటీఎం మాదిరిగానే మరో  ఏటీఎం కార్డును హ్యాకర్లు తయారుచేసి డబ్బులు డ్రా చేస్తున్నారు. ఇదెలాగంటే... మొదట నేరగాళ్లు వారు ఎంచుకున్న వ్యక్తి కదిలకలపై నిఘా ఉంచుతారు. ఆ వ్యక్తి ఏటీఎంలో డబ్బు డ్రాచేసే సమయాన్ని గమనిస్తారు. స్కిమ్మర్ అనే పల్చని పొర ఉన్న పేపర్‌ను ముందుగానే ఏటీఎం మెషీన్‌లో ఉంచుతారు. ఆ వ్యక్తి ఏటీఎం ఉపయోగించి డబ్బు డ్రా చేసినప్పుడు కార్డు వివరాలు, ముద్రలు ఆ పొరమీద అచ్చుగుద్దినట్లు కనపడుతాయి. స్కిమ్మర్‌తోపాటు అక్కడ రహస్యంగా ఏర్పాటుచేసిన కెమేరా ఆ వ్యక్తి కీబోర్డును ఉపయోగించిన ఫొటోలు తీస్తుంది.
 
దీని ద్వారా పిన్‌నంబర్‌ను నేరగాళ్లు ఈజీగా తెలుసుకుంటున్నారు. స్కిమ్మర్‌లో నమోదైన వివరాలతో మరో ఏటీఎం కార్డును తయారు చేసి దానికి ఉన్న ప్రత్యేకమైన, రహస్య అంకెలను బ్రూట్‌ఫోర్సు విధానంతో తెలుసుకుంటారు. దీంతో యథేచ్ఛగా నగదు డ్రా చేస్తారు. ఇటీవల కాలంలో ఇలాంటి ఘటనలు చోటుచే సుకుంటున్నాయి.  బ్యాంకు అకౌంట్ నుంచి మనకు తెలియకుండానే డబ్డు డ్రా అయినట్లు భావిస్తే వెంటనే సంబంధిత బ్యాంకు అధికారికి తెలియజేయాలి. వారు మన ఫిర్యాదును ఆన్‌లైన్ ద్వారా ఏజీఎంకు పంపుతారు. ఫిర్యాదుపై స్పందించిన సైబర్ పోలీసులు నిందితులపై కేసు నమోదుచేస్తారు. వారి నుంచి ఎఫ్‌ఐ ఆర్ నకలును తీసుకోవాలి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement