ఏటీఎం నుంచి రూ.43వేలు డ్రా
పోలీసులను ఆశ్రయించిన బాధితుడు
సిరిసిల్ల : బ్యాంకు అధికారినంటూ ఫోన్ చేసి ఆధార్ నంబర్ చెప్పాలి.. లేదంటే మీ ఏటీఎం కార్డు పనిచేయదని బెదిరించి రూ.43వేలు డ్రా చేసిన సంఘటన ఎల్లారెడ్డిపేటలో శనివారం జరిగింది. ఎల్లారెడ్డిపేటకు చెందిన రాగుల దేవయ్యకు ఎస్‌బీహెచ్ సిరిసిల్ల శాఖలో ఖాతా ఉంది. ఆయనకు బ్యాంకు అధికారులు ఏటీఎం ఇచ్చారు. రెండురోజుల క్రితం దేవయ్యకు ఒకరు ఫోన్ చేసి ‘ఎస్‌బీహెచ్ బ్యాంకు నుంచి మాట్లాడుతున్నాం.. నీ బ్యాంకు ఖాతాకు ఆధార్ నంబర్ అనుసంధానం కాలేదు.. నంబర్ చెప్పాలి.. లేదంటే నీ ఏటీఎం కార్డు పనిచేయదు’ అని అన్నాడు. దీంతో ఆందోళన చెందిన దేవయ్య ఆధార్ నంబర్ చెప్పాడు.
బ్యాంకు ఏటీఎం కార్డుపై ఉన్న సీరియల్ నంబర్ సైతం చెప్పాలనగా అదికూడా చెప్పేశాడు. మీ సెల్‌ఫోన్‌కు మరో మెసేజ్ వస్తుంది.. మళ్లీ ఫోన్ చేస్తానంటూ పెట్టేశాడు. అరగంట తర్వాత మళ్లీ ఫోన్ చేసి నీ ఫోన్‌కు వచ్చిన మెసేజ్‌లో ఉన్న నంబర్ చెప్పమనగా బ్యాంకు అధికారే మళ్లీ ఫోన్ చేశాడని భావించి మెసేజ్ నంబర్, ఏటీఎం పిన్ నంబర్ చెప్పాడు. తర్వాత దేవయ్య ఏటీఎం కార్డుతో బ్యాంకు ఖాతాను పరిశీలించగా రూ.43 వేలను డ్రా అయినట్లు ఉంది. దీంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించగా అపరిచిత వ్యక్తిపై అటు బ్యాంకు అధికారులు, ఇటు పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇలాంటి మోసాలు జిల్లా వ్యాప్తం గా ఇటీవల పెరిగిపోయాయి. జాగ్రత్తగా ఉండాలని, పిన్ నంబర్ ఎట్టి పరిస్థితుల్లో ఎవరికీ చెప్పవద్దని అధికారులు సూచిస్తున్నారు.
బ్యాంకు అధికారినంటూ టోకరా
Published Mon, Sep 7 2015 4:46 AM | Last Updated on Tue, Aug 21 2018 5:51 PM
Advertisement
Advertisement