హైదరాబాద్: అనారోగ్యంతో మృతి చెందిన తమ్ముడి బ్యాంక్ అకౌంట్‌లోంచి అన్న భారీ మొత్తంలో డబ్బు స్వాహా చేశాడు. మృతుడి భార్యకు రావాల్సిన ఇన్సూరెన్స్ డబ్బులు, ఇతర సేవింగ్స్‌ను సైతం కాజేసి జల్సాలు చేయడంతో బంధువులకు అనుమానం వచ్చి.. నిలదీయగా పొంతన లేని సమాధానాలు చెప్పాడు.
మృతుడి భార్య, బంధువులు బ్యాంకుకు వెళ్లి ఆరా తీయగా రూ. 3 కోట్లు అతడు తన అకౌంట్‌కు బదిలీ చేసుకున్నట్లు వారు స్పష్టం చేశారు. దీంతో కొద్దిరోజుల క్రితం మృతుడి భార్య ఆసిఫ్‌నగర్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. అనంతరం ఈ కేసు ప్రాధాన్యత దృష్ట్యా సీసీఎస్‌కు బదిలీ చేయడంతో ఇక్కడ కేసును రీ రిజిష్టర్ చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వివరాలు ఇలా ఉన్నాయి..
మెహిదీపట్నానికి చెందిన పటాన్ తబసుమ్ బాజీ భర్త సయ్యద్ నజీర్ అహ్మద్ కోవిడ్‌తో 2020లో మరణించాడు. అతను బతికున్నప్పుడు భార్య, పిల్లలపై ఇన్సూరెన్స్ చేశాడు. దీంతో పాటు తన బ్యాంక్ అకౌంట్‌లో కూడా కొంత డబ్బు ఉంచాడు. ఇవన్నీ తన మరణం అనంతరం భార్య పటాన్ తబసుమ్‌కు చెందేలా నామినీగా తనని చేర్చాడు. సయ్యద్ నజీర్ అహ్మద్ మృతి చెందిన తర్వాత ఇతని అన్న షేక్ జాన్ షాహీదా బాగోగులు చూసుకుంటానంటూ మృతుడి భార్య, పిల్లలకు దగ్గరయ్యాడు.
తమ్ముడి పేరుపై ఉన్న బ్యాంకు లావాదేవీలన్నీ నీ పేరిట ట్రాన్స్‌ఫర్ చేస్తానంటూ పటాన్ తబసుమ్‌ను నమ్మించి ఆమె సంతకాలు తీసుకున్నాడు. ఆ తర్వాత రెండు ఖాతాల నుంచి దాదాపు రూ. 3 కోట్ల నగదును షేక్ జాన్ షాహీదా తన అకౌంట్‌కు బదిలీ చేసుకున్నాడు. ఆ డబ్బుతో కొత్త ఇన్నోవా కారు, బంగారు, వజ్రాల ఆభరణాలను కొనుగోలు చేశాడు. ఇదే సమయంలో యూఎస్ వెళ్లేందుకు ప్రయత్నాలు కూడా ముమ్మరం చేశాడు. ఈ క్రమంలో పటాన్ తబసుమ్‌ను చూసేందుకు బంధువులు ఇంటికి వచ్చినప్పుడు బ్యాంకు వివరాలు, పిల్లల బాగోగులు అడిగి తెలుసుకున్నారు. ఆర్థికపరమైన లావాదేవీలు, మా భారం అంతా కూడా బావ షేక్ జాన్ షాహీదా చూసుకుంటున్నాడని వారికి తెలిపింది.
ఈ విషయంపై అనుమానం వ్యక్తం చేసిన బంధువులు పటాన్ తబసుమ్‌ను బ్యాంకుకు తీసుకెళ్లి ఖాతాలను చూపించగా.. మృతుడి భార్య సంతకాలు చేయడంతో ఆ డబ్బు మృతుడి అన్న షేక్ జాన్ షాహీదా ఖాతాలకు క్రెడిట్ అయినట్లు నిర్ధారించారు. ఆసిఫ్‌నగర్ పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేయగా కేసు నమోదయ్యింది. తాజాగా ఈ కేసుకు ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా సీసీఎస్‌కు బదిలీ చేశారు, ఇక్కడ రీ–రిజిష్టర్ చేసి దర్యాప్తును వేగవంతం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment