ఒకే అకౌంట్‌లో వందల కోట్లు మార్పిడి! | Cyber ​​crime in the name of stock market | Sakshi
Sakshi News home page

ఒకే అకౌంట్‌లో వందల కోట్లు మార్పిడి!

Published Thu, Nov 14 2024 8:39 AM | Last Updated on Thu, Nov 14 2024 8:39 AM

Cyber ​​crime in the name of stock market

స్టాక్‌మార్కెట్‌ పేరిట సైబర్‌ క్రైం

రెండు నెలల క్రితం మెట్‌పల్లి వైద్యుడి ఫిర్యాదు

పోలీసుల విచారణలోనివ్వెరపోయే నిజాలు

 అదుపులో పంజాబ్‌కు చెందిన ముగ్గురు నిందితులు

కోరుట్ల:  ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా వందలాది కోట్ల మార్పిడి. మూడేళ్లలో ఓ వ్యక్తి ఖాతాలోకి మళ్లిన నగదు గురించి తెలిస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే. స్టాక్‌ మార్కెట్‌ పేరిట ఓ ముఠా చేసిన సైబర్‌నేరం ఇది. మెట్‌పల్లికి చెందిన వైద్యుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు తీగ లాగితే డొంగ కదిలింది. రెండు నెలల క్రితం జగిత్యాల జిల్లాలోని మెట్‌పల్లికి చెందిన ఓ వైద్యుడిని స్టాక్‌మార్కెట్‌ యాప్‌ పేరిట ట్రాప్‌లోకి దించిన నిందితులు ఆయన ఖాతా నుంచి రూ.72లక్షలు కాజేశారు. తాను మోసపోయిన విషయం తెలుసుకున్న వైద్యుడు సైబర్‌క్రైం పోలీసులను ఆశ్రయించారు. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన జిల్లా పోలీస్‌ ఉన్నతధికారులు ఓ పోలీస్‌ బృందాన్ని ప్రత్యేకంగా ఏర్పాటుచేసి లోతైన విచారణ కోసం రంగంలోకి దించారు.

దుబాయి కేంద్రంగా..
మెట్‌పల్లి వైద్యుడి కేసును చాలెంజ్‌గా తీసుకున్న పోలీసులు విచారణ మొదలుపెట్టిన క్రమంలో స్టాక్‌మార్కెట్‌ యాప్‌ పేరిట సైబర్‌ క్రైంకు పాల్పడిన నిందితులకు చెందిన బ్యాంక్‌ ఖాతాలను గుర్తించారు. ఈ నిందితులు పంజాబ్‌లోని జలంధర్‌లో ఉన్నట్లు గుర్తించి వారం క్రితం అక్కడికి వెళ్లి మకాం వేశారు. పక్క ప్రణాళికతో ముగ్గురిని పట్టుకున్నారు. ఒక్కొక్కరి ఖాతాలను పరిశీలించి స్టాక్‌మార్కెట్‌ పేరిట సాగుతున్న సైబర్‌క్రైం వివరాలు విచారించారు. ఈక్రమంలో ఒకరి అకౌంట్‌లో 2021 సంవత్సరం నుంచి దాదాపుగా రూ.50వేలు కోట్ల డబ్బుల మార్పిడి జరిగినట్లుగా గుర్తించి నివ్వెరపోయారు. ఈ ముగ్గురు నిందితులకు దుబాయిలోని ఓ ముఠా ద్వారా ట్రాన్‌జాక్షన్‌ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

పోలీసుల అదుపులో నిందితులు..
మెట్‌పల్లి వైద్యుడిని స్టాక్‌మార్కెట్‌ యాప్‌ పేరిట సైబర్‌ ఉచ్చులోకి లాగిన ముగ్గురు నిందితులను జగిత్యాల జిల్లా ప్రత్యేక పోలీస్‌ బృందం అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. వీరిని పూర్తిస్థాయిలో విచారించేందుకు జలంధర్‌ నుంచి జగిత్యాలకు తీసుకొచి్చనట్లు తెలిసింది. దుబాయి కేంద్రంగా సాగుతున్న సైబర్‌ ముఠా తీరుతెన్నులు. వారితో భాగస్వామ్యులుగా ఉన్న వ్యక్తుల వివరాలు, హవాలా మార్కెట్‌తో ఏమైనా సంబంధాలున్నాయా? అన్న దిశలో పోలీస్‌ విచారణ కొనసాగుతోంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement