పిల్లలతో నంజుండేశ్వర (ఫైల్)
సాక్షి, బళ్లారి రూరల్: అతనో చిరుద్యోగి. స్టాక్ మార్కెట్‌లో షేర్లు కొనే అమ్మే అలవాటు వ్యసనంగా మారింది. నష్టాల పాలవుతున్నా ఏదో ఒకనాటికి లాభాలు రాకపోతాయా అనే ఆశతో ట్రేడింగ్ సుడిగుండంలో మునిగి నష్టాల్లో కూరుకుపోయాడు. ఫలితంగా ఘోరమైన నిర్ణయం తీసుకున్నాడు. ఇద్దరు పసికందుల్ని చంపి, భార్యతో కలిసి ఉరివేసుకున్నాడు. ఈ హృదయవిదారక ఘటన బళ్లారి జిల్లా గాదిగనూరలో బుధవారం చోటుచేసుకుంది.
వివరాలు.. గాదిగనూరుకు చెందిన నంజుండేశ్వర (32) జిందాల్‌లో పనిచేస్తుండేవాడు. ఇతడు షేర్లు కొనడం, అమ్మడం చేస్తుండేవాడు. అయితే కరోనా వైరస్ వల్ల షేర్ మార్కెట్ తీవ్ర ఒడిదుడుకులకు గురికావడంతో నంజుండేశ్వర పెద్దమొత్తంలో నష్టపోయాడు. సొంత డబ్బు పోగొట్టుకోవడంతో పాటు రూ.15 లక్షల వరకు అప్పుల పాలయ్యాడు. ఈ సమయంలో బంధువులు కొంత సాయం చేశారు. అయితే బుధవారం తెల్లవారుజామున నంజుండేశ్వర పిల్లలు గౌతమి (3), స్వరూప్ (2)లకు పురుగుల మందు తాగించడంతో వారు మృత్యువాత పడ్డారు. తర్వాత భార్య పార్వతి(27), తాను ఉరేసుకొని ఆత్మహత్య చేసుకొన్నారు.
డెత్‌నోట్ స్వాధీనం
ఇరుగుపొరుగు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసునమోదు చేసుకొని మృతదేహాలను విమ్స్‌కు తరలించారు. తన మరణానికి ఎవరూ కారణం కాదని రాసిపెట్టిన డెత్‌నోట్ పక్కన ఉంది. కాగా మృతుని సోదరుడు గంగాధర్ మీడియాతో మాట్లాడుతూ షేర్‌మార్కెట్‌లో నష్టాలే ఘోరానికి కారణమని తెలిపాడు.
Comments
Please login to add a commentAdd a comment