ఏటీఎం కార్డు మార్చిన యువకుడు
రూ. 40 వేలు డ్రా చేసుకున్న వైనం
మోసం ఆలస్యంగా గ్రహించిన ఖాతాదారుడు
అద్దంకి(ప్రకాశం): బ్యాంకు డిపాజిట్ మిషన్‌లో డబ్బును ఎలా డిపాజిట్ చేయాలో తెలియని ఖాతాదారుకు ఓ కుర్రాడు సహాయం చేశాడు. డిపాజిట్ చేసే సమయంలోనే, ఖాతాదారు కార్డును చాకచక్యంగా మార్చి తన కార్డును వారికిచ్చాడు. ఆ కార్డుతో దర్జాగా అదే బ్యాంకు ఏటీఎం నుంచి రూ. 40 వేల నగదును డ్రా చేసుకుని, అంకుల్ మీ కార్డు మారిందటూ వారి కార్డును వారికిచ్చి, తన కార్డును తీసుకుని ఏమీ ఎరగనట్టు వెళ్లిన కుర్రాడి ఘరానా మోసం పట్టణంలోని ఎస్‌బీఐ ఏటీఎం వద్ద మంగళవారం చోటుచేసుకుంది.
వివరాలు.. స్థానిక నగర పంచాయతీలో కాంట్రాక్టు వర్కర్‌గా పనిచేస్తున్న వెంకటస్వామి తన వద్ద ఉన్న రూ. 1లక్ష నగదును ఎస్‌బీఐ ఏటీఎం ప్రక్కనే డిపాజిట్ మిషన్‌లో జమ చేసేందుకు భార్యతో కలిసి వెళ్లాడు. నగదును ఎలా డిపాజిట్టు చేయాలో తెలియక చూస్తున్న సమయంలో ఓ కుర్రాడు తాను సహాయం చేస్తానన్నాడు. నమ్మిన వెంకట స్వామి దపంతులు తమ వద్ద ఉన్న నగదును, ఏటీఎం కార్డును ఆ కుర్రాడికివ్వగా అతను రూ. 1లక్ష డబ్బును రెండు విడతలుగా రూ. 30 వేల చొప్పున, మరోసారి రూ. 40 వేలను డిపాజిట్టు మిషన్‌లో జమ చేశాడు.
ఇదిగో మీ కార్డు అంటూ ఇచ్చాడు. మరలా కొంతసేపటికి వచ్చి అయ్యా మీ కార్డు నా కార్డు మారిపోయిందంటూ వారి కార్డు వారికిచ్చి అంతకు ముందు వారికిచ్చిన తన కార్డును తీసుకుని వెళ్లిపోయాడు. అనుమానం వచ్చిన ఖాతాదారు బ్యాంకుకు వెళ్లి నగదును సరిచూసుకోగా ఖాతాలో రూ. 40 వేలు లేకపోవడాన్ని తెలుసుకుని లబో దిబోమన్నారు. సీసీ టీవీ పుటేజీల్లో చూడగా తమకు సహాయం చేసిన కుర్రాడు అంతకు ముందు బ్యాంకులో తచ్చాడినట్లు తెలుసుకున్నాడు. ఈ విషయమై నిందితుడ్ని గుర్తించేందుకు తాము పోలీసులను ఆశ్రయించనున్నట్లు బాధితుడు తెలిపారు.
ఏటీఎం కార్డు చాకచక్యంగా మార్చి..
Published Wed, Aug 10 2016 7:07 PM | Last Updated on Mon, Sep 4 2017 8:43 AM
Advertisement
Advertisement