money draw
-
యాప్ డౌన్లోడ్ చేయగానే.. తగిలిన బిగ్‌షాక్..!
హైదరాబాద్: సైబర్ నేరగాళ్లు వైద్యురాలికి 95 వేల రూపాయలు టోకరా వేశారు. బంజారాహిల్స్ రోడ్డు నెంబరు 3 శ్రీనికేతన కాలనీలో నివసించే లక్ష్మి వైద్యురాలు. గత నెల 15న ఆమెకు ఓ వ్యక్తి ఫోన్ చేసి తాను ఎస్బీఐ క్రెడిట్ కార్డు విభాగం నుంచి ఫోన్ చేస్తున్నట్టు చెప్పాడు. ఏదైనా ఫిర్యాదు ఉందా అని అడిగాడు. తాను చేసిన 41,955 రూపాయలకు సంబంధించి ఆన్లైన్ షాపింగ్‌పై అనుమానాలు ఉన్నాయని ఆమె తెలిపారు. దీంతో ఫోన్ చేసిన వ్యక్తి కొన్ని వివరాలు అడగగా ఫోన్లో ఇవ్వలేనని నిరాకరించారు. అయితే ఓ యాప్ డౌన్లోడ్ చేసుకొని అందులో వివరాలు పొందుపరిస్తే సమస్య పరిష్కరిస్తామని చెప్పాడు. ఈ మేరకు లక్ష్మి యాప్ డౌన్లోడ్ చేసి సమాచారం నమోదు చేసిన వెంటనే ఆమె బ్యాంకు ఖాతా నుంచి రూ.95వేలు డ్రా అయినట్టు మెస్సేజ్ వచ్చింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
నమ్మించి ఏటీఎం కార్డు మార్చాడు..
సాక్షి, కేసముద్రం(వరంగల్): ఓ వ్యక్తి ఏటీఎం కార్డును నమ్మించి తీసుకున్న గుర్తుతెలియని వ్యక్తి రూ.24వేలను అపహరించిన సంఘటన మహబూబాబాద్ జిల్లా కేసముద్రంలో సోమవారం వెలుగుచూసింది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. కేసముద్రం విలేజ్‌కి చెందిన బొల్లోజు జనార్దనాచారి శనివారం మండల కేంద్రంలోని ఏటీఎంలో డబ్బు డ్రా చేసుకోవడానికి వెళ్లాడు. అప్పటికే ఓ గుర్తుతెలియని వ్యక్తి మాస్క్ ధరించి లోపలికి వచ్చాడు. డబ్బులు రావడం లేదా అంటూ జనార్దనాచారిని ఆరా తీశాక ఏటీఎం కార్డు తీసుకుని పిన్ నంబర్‌ను తెలుసుకున్నాడు. ఆ తర్వాత గుర్తుతెలియని వ్యక్తి తనవద్ద ఉన్న ఏటీఎంకార్డుతో డబ్బులు వస్తాయో చూస్తానని నమ్మించి, మరోసారి ప్రయత్నం చేశాడు. అప్పటికి డబ్బు రాలేదు. తన కార్డు తనకు ఇవ్వమని జనార్దనాచారి అడగగా మరో కార్డు ఇచ్చేసి వెళ్లిపోయాడు. తీరా జనార్దనాచారి ఇంటికి వెళ్లాక సెల్‌ఫోన్‌కు డబ్బు డ్రా అవుతున్నట్లుగా మెసేజ్‌లు వస్తుండటంతో, పరీక్షించగా కార్డు మారినట్లు గుర్తించాడు. అప్పటికే ఆయన ఖాతా నుంచి 6సార్లు మొత్తం రూ.24వేలు డ్రా అయ్యాయి. దీంతో ఏటీఎం కార్డును బ్లాక్ చేయించి బ్యాంకు అధికారులతో పాటు సోమవారం కేసముద్రం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు ఎస్సై రమేష్‌బాబును వివరణ కోరగా విచారణ చేస్తున్నట్లు తెలిపారు. చదవండి: విషాదం: తమ్ముడిని కాల్చి చంపి.. తను ఆత్మహత్య -
ఏటీఎం కార్డు చాకచక్యంగా మార్చి..
ఏటీఎం కార్డు మార్చిన యువకుడు రూ. 40 వేలు డ్రా చేసుకున్న వైనం మోసం ఆలస్యంగా గ్రహించిన ఖాతాదారుడు అద్దంకి(ప్రకాశం): బ్యాంకు డిపాజిట్ మిషన్‌లో డబ్బును ఎలా డిపాజిట్ చేయాలో తెలియని ఖాతాదారుకు ఓ కుర్రాడు సహాయం చేశాడు. డిపాజిట్ చేసే సమయంలోనే, ఖాతాదారు కార్డును చాకచక్యంగా మార్చి తన కార్డును వారికిచ్చాడు. ఆ కార్డుతో దర్జాగా అదే బ్యాంకు ఏటీఎం నుంచి రూ. 40 వేల నగదును డ్రా చేసుకుని, అంకుల్ మీ కార్డు మారిందటూ వారి కార్డును వారికిచ్చి, తన కార్డును తీసుకుని ఏమీ ఎరగనట్టు వెళ్లిన కుర్రాడి ఘరానా మోసం పట్టణంలోని ఎస్బీఐ ఏటీఎం వద్ద మంగళవారం చోటుచేసుకుంది. వివరాలు.. స్థానిక నగర పంచాయతీలో కాంట్రాక్టు వర్కర్‌గా పనిచేస్తున్న వెంకటస్వామి తన వద్ద ఉన్న రూ. 1లక్ష నగదును ఎస్బీఐ ఏటీఎం ప్రక్కనే డిపాజిట్ మిషన్‌లో జమ చేసేందుకు భార్యతో కలిసి వెళ్లాడు. నగదును ఎలా డిపాజిట్టు చేయాలో తెలియక చూస్తున్న సమయంలో ఓ కుర్రాడు తాను సహాయం చేస్తానన్నాడు. నమ్మిన వెంకట స్వామి దపంతులు తమ వద్ద ఉన్న నగదును, ఏటీఎం కార్డును ఆ కుర్రాడికివ్వగా అతను రూ. 1లక్ష డబ్బును రెండు విడతలుగా రూ. 30 వేల చొప్పున, మరోసారి రూ. 40 వేలను డిపాజిట్టు మిషన్‌లో జమ చేశాడు. ఇదిగో మీ కార్డు అంటూ ఇచ్చాడు. మరలా కొంతసేపటికి వచ్చి అయ్యా మీ కార్డు నా కార్డు మారిపోయిందంటూ వారి కార్డు వారికిచ్చి అంతకు ముందు వారికిచ్చిన తన కార్డును తీసుకుని వెళ్లిపోయాడు. అనుమానం వచ్చిన ఖాతాదారు బ్యాంకుకు వెళ్లి నగదును సరిచూసుకోగా ఖాతాలో రూ. 40 వేలు లేకపోవడాన్ని తెలుసుకుని లబో దిబోమన్నారు. సీసీ టీవీ పుటేజీల్లో చూడగా తమకు సహాయం చేసిన కుర్రాడు అంతకు ముందు బ్యాంకులో తచ్చాడినట్లు తెలుసుకున్నాడు. ఈ విషయమై నిందితుడ్ని గుర్తించేందుకు తాము పోలీసులను ఆశ్రయించనున్నట్లు బాధితుడు తెలిపారు. -
పొదుపు సంఘం ఖాతాలో రూ. 40 వేలు స్వాహా
సంతకాలు ఫోర్జరీ చేసి డ్రా చేశారు బ్యాంక్ మేనేజరు, ఏపీఎందే బాధ్యతంటున్న సభ్యులు కలువాయి : మండలంలోని తెలుగురాయపురం వైష్ణవి పొదుపు సంఘం ఖాతా నుంచి రూ.40 వేల స్వాహా అయ్యాయి. బుధవారం పొదుపు గ్రూపు సభ్యులు బ్యాంక్‌కు రావడంతో ఈ విషయం వెలుగుచూసింది. అయితే సంఘం లీడర్, సెకండ్ లీడర్, సభ్యులకు ఎవరికీ తెలియకుండా తమ అకౌంట్ నుంచి నగదు డ్రా చేసినట్లు విషయం తెలుసుకుని ఖంగుతిన్న సభ్యులు భారతీయ స్టేట్ బ్యాంక్ కలువాయి శాఖ మేనేజరును, వెలుగు ఏపీఎంను ప్రశ్నించారు. వారు పొంతన లేని సమాధానాలు చెబుతున్నారని గ్రూపు సభ్యులు పేర్కొన్నారు. తొలుత ఎస్బీఐ కలువాయి శాఖ మేనేజరు రూ.20వేలు మీ అకౌంట్లో వేయిస్తానని చెప్పారని, మిగిలిన రూ. 20 వేలు సంగతి ఏమిటని ప్రశ్నిస్తే మీరు కేసు పెట్టుకోమని సమాధానం చెప్పారన్నారు. ఏపీఎంను ప్రశ్నిస్తే మీ గ్రూపులో మరో సభ్యురాలికి డ్రా చేసి ఇచ్చామని తెలిపారన్నారు. గ్రూపు లీడర్, సెకండ్ లీడర్ సంతకాలు లేకుండా ఎలా డ్రా చేశారని ప్రశ్నిస్తే పొంతన లేని సమాధానం చెప్పారన్నారు. దీంతో మా సంతకాలు ఫోర్జరీ చేసినట్లు అనుమానాలు తలెత్తున్నాయన్నారు. తమ గ్రూపు నుంచి తొమ్మిది నెలల క్రితం తొలగించిన సభ్యురాలికి ఎలా ఇస్తారని ఆమెను ప్రశ్నిస్తే అధికారులు ఆమెను పిలిపించి మాట్లాడుతామన్నారు. ఈ విషయమై మీడియా వారికి చెబితే మీకు విష్యత్‌లో ఇబ్బందులు తప్పవని బెదిరించారని గ్రూపు లీడర్, సభ్యులు విలేకరుల ముందు వాపోయారు. ఈ విషయమై తాము పీడీకి, బ్యాంక్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామన్నారు. -
బ్యాంకు ఖాతా నుంచి రూ.23 వేలు మాయం
బ్యాంకు వివరాలు చెప్పాలంటూ అపరిచిత వ్యక్తి ఫోన్ ఒంగోలు: ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణానికి చెందిన విశ్రాంత జూనియర్ వెటర్నరీ ఆఫీసర్ ఒ.వెంకటయ్య ఖాతా నుంచి గుర్తు తెలియని వ్యక్తులు నగదు మాయం చేసిన సంఘటన గురువారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితుడు వెంకటయ్య తెలిపిన వివరాల ప్రకారం గత నెల 27వ తేదీన గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి మీ బ్యాంకు అకౌంట్ బ్లాక్ అయ్యిందంటూ పేరు, వివరాలు చెప్పాలని అడిగాడు. అతను హిందీలో మాట్లాడటంతో వెంకటయ్యకు అర్ధం కాక పక్కనే ఉన్న హిందీ తెలిసిన ఓ వ్యక్తి సహాయం తీసుకున్నాడు. అతను చెప్పిన విధంగా ఏటీఎం కార్డుపైన ఉన్న నెంబరును, పూర్తి వివరాలను తెలియజేశాడు. కొద్దిసేపటి తర్వాత ఆ అపరిచిత వ్యక్తి మళ్లీ ఫోన్ చేసి మీ ఫోన్‌కు ఓటీపీ నెంబర్ మెసేజ్ రూపంలో వచ్చిందని, ఆ నెంబరును తనకు చెప్పాలన్నాడు. వెంకటయ్య తన ఫోన్‌కు వచ్చిన ఓటీపీ నెంబరును ఆ అజ్ఞాత వ్యక్తికి తెలిపాడు. ఇలా ఆ రోజు మొత్తం ఆరుసార్లు ఓటీపీ నెంబరును వెంకటయ్య ద్వారా తెలుసుకుంటూ దర్జాగా ఢిల్లీలోని పలు దుకాణాల్లో ఆరుసార్లు షాపింగ్ చేశాడు. గురువారం ఉదయం ఓ పత్రికలో ఏటీఎం నెంబరు తెలుసుకుని నగదు మాయం చేశాడని వచ్చిన కథనాన్ని చూసిన వెంకటయ్య తనకు కూడా ఇదే విధంగా ఫోన్ వచ్చిన విషయాన్ని గుర్తు చేసుకుని బ్యాంకుకు వెళ్లి పరిశీలించగా అతని అకౌంట్లో నుంచి రూ.23,500 లు ఆరు దఫాలుగా విత్‌డ్రా అయి ఉండటాన్ని గమనించి లబోదిబోమంటూ స్థానిక ఎస్బీఐ శాఖలో, పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదులు చేశాడు. అకౌంట్ వివరాలు చెప్పాలని అపరిచితుల వద్ద నుంచి వచ్చే ఫోన్లకు స్పందించి వివరాలు చెప్పి మోసపోవద్దని బాధితుడు చెబుతున్నాడు. -
నమ్మితే నట్టేట ముంచాడు!
వర్ని: ఏటీఎం లోంచి డబ్బు తీసి ఇవ్వమంటే, కార్డును మార్చేసి రూ.25 వేలు డ్రా చేసుకొని ఉడాయించాడో దుండగుడు. ఈ ఘటన వర్ని మండల కేంద్రంలో చేసుకుంది. బాధితుడి కథనం మేర కు.. అక్బర్‌నగర్‌కు చెందిన సత్యనారాయణకు ఆంధ్రాబ్యాంకులో ఖాతా ఉంది. డబ్బు అవసరం కావడంతో గురువారం ఎస్బీఐ ఏటీఎం కేంద్రం వద్దకు వచ్చాడు. డ్రా చేయడం తెలియని ఆయన, పక్కనే ఉన్న అపరిచిత వ్యక్తిని సెక్యూరిటీ గార్డుగా భావించి సాయం కోరాడు. సదరు వ్యక్తి కొంతసేపు ప్రయత్నించి డబ్బు రావడం లేదని ఏటీఎం కార్డు ఇచ్చి వెళ్లిపోయాడు. బటయ కు వచ్చిన కొద్దిసేపటికే సత్యనారాయణ ఫోన్‌కు డబ్బు డ్రా చేసినట్టు మెసేజ్ రావడంతో ఉలిక్కిపడ్డాడు. ఏటీఎం వద్దకు వెళ్లగా అప్పటికే అపరిచితుడు అక్కడి నుంచి ఉడాయించాడు. ఏటీఎం కార్డును బదిలీ చేసి డబ్బు డ్రా చేసినట్టు గుర్తించిన బాధితుడు లబోదిబోమంటూ.. ఆంద్రాబ్యాంక్ మేనేజర్‌ను కలిసి వివరించాడు. ఏటీఎం కార్డును బ్లాక్ చేయాలని కోరాడు. -
బ్యాంకు అధికారినంటూ టోకరా
వనపర్తిటౌన్ : తాము బ్యాంకు నుంచి మాట్లాడుతున్నామని ఓ వ్యక్తి వనపర్తిలో ఇద్దరికి టోకరా వేశాడు. పిన్ నెంబర్ సాయంతో వారి బ్యాంకు ఖాతాల నుంచి డబ్బులు లేగేశాడు. పోలీసుల కథనం ప్రకారం కొద్దిరోజులు క్రితం వల్లభ్ నగర్‌కు చెందిన విజయ్ కుమార్ కు ఓ వ్యక్తి ఫోన్ చేసి..తాము వనపర్తి ఐసీఐసీఐ బ్యాంకు నుంచ మాట్లాడుతున్నామని, మీ ఎటీఎం కార్డుపిన్, అకౌంట్ నెంబర్ చెప్పమని అడగటంతో విజయ్ కుమార్ చెప్పేశాడు. క్షణాల్లోనే అతని ఖాతా నుంచి రూ. 20 వేలు డ్రా చేసినట్లు మెసేజ్ వచ్చింది. అదేకాలనీకి చెందిన మరో వ్యక్తి కృష్ణయ్యకు ఫోన్ రావడంతో పిన్ నెంబర్ చుప్పేశాడు. వెంటనే రూ.50 వేలు డ్రా అయినట్టు అతనికి మెసేజ్ వచ్చింది. ఈ ఘటనలపై బాధితులు బ్యాంకు అధికారులను సంప్రదించారు. తమ సిబ్బంది అలాంటి కాల్స్ చేయలేదని వారు స్పష్టం చేయటంతో పోలీసులను ఆశ్రయించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సీతారామిరెడ్డి మంగళవారం తెలిపారు.