పొదుపు సంఘం ఖాతాలో రూ. 40 వేలు స్వాహా
-
సంతకాలు ఫోర్జరీ చేసి డ్రా చేశారు
-
బ్యాంక్ మేనేజరు, ఏపీఎందే బాధ్యతంటున్న సభ్యులు
కలువాయి : మండలంలోని తెలుగురాయపురం వైష్ణవి పొదుపు సంఘం ఖాతా నుంచి రూ.40 వేల స్వాహా అయ్యాయి. బుధవారం పొదుపు గ్రూపు సభ్యులు బ్యాంక్‌కు రావడంతో ఈ విషయం వెలుగుచూసింది. అయితే సంఘం లీడర్, సెకండ్ లీడర్, సభ్యులకు ఎవరికీ తెలియకుండా తమ అకౌంట్ నుంచి నగదు డ్రా చేసినట్లు విషయం తెలుసుకుని ఖంగుతిన్న సభ్యులు భారతీయ స్టేట్ బ్యాంక్ కలువాయి శాఖ మేనేజరును, వెలుగు ఏపీఎంను ప్రశ్నించారు. వారు పొంతన లేని సమాధానాలు చెబుతున్నారని గ్రూపు సభ్యులు పేర్కొన్నారు. తొలుత ఎస్‌బీఐ కలువాయి శాఖ మేనేజరు రూ.20వేలు మీ అకౌంట్‌లో వేయిస్తానని చెప్పారని, మిగిలిన రూ. 20 వేలు సంగతి ఏమిటని ప్రశ్నిస్తే మీరు కేసు పెట్టుకోమని సమాధానం చెప్పారన్నారు. ఏపీఎంను ప్రశ్నిస్తే మీ గ్రూపులో మరో సభ్యురాలికి డ్రా చేసి ఇచ్చామని తెలిపారన్నారు. గ్రూపు లీడర్, సెకండ్ లీడర్ సంతకాలు లేకుండా ఎలా డ్రా చేశారని ప్రశ్నిస్తే పొంతన లేని సమాధానం చెప్పారన్నారు. దీంతో మా సంతకాలు ఫోర్జరీ చేసినట్లు అనుమానాలు తలెత్తున్నాయన్నారు. తమ గ్రూపు నుంచి తొమ్మిది నెలల క్రితం తొలగించిన సభ్యురాలికి ఎలా ఇస్తారని ఆమెను ప్రశ్నిస్తే అధికారులు ఆమెను పిలిపించి మాట్లాడుతామన్నారు. ఈ విషయమై మీడియా వారికి చెబితే మీకు విష్యత్‌లో ఇబ్బందులు తప్పవని బెదిరించారని గ్రూపు లీడర్, సభ్యులు విలేకరుల ముందు వాపోయారు. ఈ విషయమై తాము పీడీకి, బ్యాంక్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామన్నారు.