బ్యాంకు ఖాతా నుంచి రూ.23 వేలు మాయం | money-missing-in bank account | Sakshi
Sakshi News home page

బ్యాంకు ఖాతా నుంచి రూ.23,500 మాయం

Published Fri, Jun 10 2016 11:42 AM | Last Updated on Tue, Aug 28 2018 8:04 PM

money-missing-in bank account

 బ్యాంకు వివరాలు చెప్పాలంటూ అపరిచిత వ్యక్తి ఫోన్

ఒంగోలు: ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణానికి చెందిన విశ్రాంత జూనియర్ వెటర్నరీ ఆఫీసర్ ఒ.వెంకటయ్య ఖాతా నుంచి గుర్తు తెలియని వ్యక్తులు నగదు మాయం చేసిన సంఘటన గురువారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితుడు వెంకటయ్య తెలిపిన వివరాల ప్రకారం గత నెల 27వ తేదీన గుర్తు తెలియని వ్యక్తి ఫోన్‌ చేసి మీ బ్యాంకు అకౌంట్ బ్లాక్ అయ్యిందంటూ పేరు, వివరాలు చెప్పాలని అడిగాడు. అతను హిందీలో మాట్లాడటంతో వెంకటయ్యకు అర్ధం కాక పక్కనే ఉన్న హిందీ తెలిసిన ఓ వ్యక్తి సహాయం తీసుకున్నాడు. అతను చెప్పిన విధంగా ఏటీఎం కార్డుపైన ఉన్న నెంబరును, పూర్తి వివరాలను తెలియజేశాడు. కొద్దిసేపటి తర్వాత ఆ అపరిచిత వ్యక్తి మళ్లీ ఫోన్‌ చేసి మీ ఫోన్‌కు ఓటీపీ నెంబర్ మెసేజ్ రూపంలో వచ్చిందని, ఆ నెంబరును తనకు చెప్పాలన్నాడు. వెంకటయ్య తన ఫోన్‌కు వచ్చిన ఓటీపీ నెంబరును ఆ అజ్ఞాత వ్యక్తికి తెలిపాడు.

ఇలా ఆ రోజు మొత్తం ఆరుసార్లు ఓటీపీ నెంబరును వెంకటయ్య ద్వారా తెలుసుకుంటూ దర్జాగా ఢిల్లీలోని పలు దుకాణాల్లో ఆరుసార్లు షాపింగ్ చేశాడు. గురువారం ఉదయం ఓ పత్రికలో ఏటీఎం నెంబరు తెలుసుకుని నగదు మాయం చేశాడని వచ్చిన కథనాన్ని చూసిన వెంకటయ్య తనకు కూడా ఇదే విధంగా ఫోన్ వచ్చిన విషయాన్ని గుర్తు చేసుకుని బ్యాంకుకు వెళ్లి పరిశీలించగా అతని అకౌంట్‌లో నుంచి రూ.23,500 లు ఆరు దఫాలుగా విత్‌డ్రా అయి ఉండటాన్ని గమనించి లబోదిబోమంటూ స్థానిక ఎస్‌బీఐ శాఖలో, పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదులు చేశాడు. అకౌంట్ వివరాలు చెప్పాలని అపరిచితుల వద్ద నుంచి వచ్చే ఫోన్‌లకు స్పందించి వివరాలు చెప్పి మోసపోవద్దని బాధితుడు చెబుతున్నాడు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement