డబ్బు డ్రా చేశారు.. దొరికిపోయారు
కరీంనగర్ టౌన్: నిండా పాతికేళ్లు లేని ముగ్గురు దొంగలు పోలీసులకు కంటిమీద కునుకులేకుండా చేశారు. దొంగతనాల్లో ఆ ముగ్గురు యువకులు రాటుదేలిపోయారు. కరీంనగర్‌లోని పలుప్రాంతాల్లో ఇప్పటికే 17 చోట్ల చోరీలకు పాల్పడ్డారు. యధావిధిగా ఓ ఇంట్లో దొంగతనానికి వెళ్లి ఏమీ లేకపోవడంతో ఏటీఎం కార్డు దోచుకెళ్లారు. చోరీ చేసిన ఏటీఎం కార్డునుపయోగించి డబ్బు డ్రా చేయడంతో పోలీసులకు దొరికిపోయారు. వివరాలు..కరీంనగర్ పట్టణంలోని రాంనగర్ ప్రాంతానికి చెందిన ఇస్లావత్ శ్రీకాంత్(22), లోకిని శ్రీకాంత్(20) లు మరో మిత్రుడితో కలిసి, తమ జల్సాలు తీర్చుకోవడానికి పట్టణంలో చోరీలు చేసేవారు.
ఇలా దొంగతనాలకు అలవాటు పడ్డ మిత్రులు ముగ్గురూ తమ అలవాటులో భాగంగా శ్రీనగర్ కాలనీలోని ఓ తాళం వేసి ఇంట్లో దొంగతనానికి వెళ్లారు. అక్కడ ఇంటిలో ఏమీ లభించకపోవడంతో ఏటీఎం కార్డు దొంగిలించి పక్కనే ఉన్న యాక్సిస్ బ్యాంక్‌లో డబ్బు డ్రా చేశారు. ఏటీఎం కార్డు ఎవరో దొంగిలించి డబ్బులు డ్రా చేశారని బాధితులు ఫిర్యాదు ఇవ్వడంతో పోలీసులు ఆ దిశగా దర్యాప్తు ప్రారంభించారు. డబ్బులు డ్రా చేసిన ఏటీఎం సెంటర్ వద్ద నున్న సీసీ కెమెరా పుటేజీ ద్వారా నిందితులను గుర్తించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి రూ. 8లక్షల విలువ చేసే బంగారు, వెండి ఆభరణాలు, రెండు బైక్‌లు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.