ఏటీఎం పిన్ నెంబర్ అడిగి...
నల్లగొండ : బ్యాంకు అధికారినంటూ ఓ వ్యక్తి ఫోన్ చేసి వివరాలు అడగటంతో ఓ వ్యక్తి ఏటీఎం కార్డు పిన్ నంబర్ చెప్పేశాడు. దీంతో అతని ఖాతా నుంచి రూ.5 లక్షలు మాయమయ్యాయి. వెంటనే బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. ఆ విషయాన్ని సదరు మోసగాడు తెలుసుకుని... మాయం చేసిన నగదును తిరిగి సదరు ఖాతాదారుడి ఖాతాకు బదిలీ చేశాడు. నల్లగొండ పోలీసులు కథనం ప్రకారం... పట్టణంలోని మాన్యంచెల్కకు చెందిన దాదాబాషా బత్తాయి వ్యాపారి.
అతనికి గురువారం ఓ వ్యక్తి బ్యాంకు అధికారినంటూ ఫోన్ చేశాడు. సాంకేతిక కారణాలతో ఏటీఎం కార్డు బ్లాక్ అయిందని...పిన్ నంబర్ చెబితే సరి చేస్తానని నమ్మబలికాడు. దీంతో దాదాబాషా తన ఏటీఎం కార్డు నంబర్ చెప్పాడు. ఆ వెంటనే సదరు వ్యక్తి అతని ఖాతాలో ఉన్న రూ.5 లక్షలను తన ఖాతాలోకి నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్‌ఫర్ సిస్టం ద్వారా మార్చేసుకున్నాడు. కొద్దిసేపటి తర్వాత దాదాబాషా బ్యాంకుకు వెళ్లి... డబ్బు డ్రా చేయబోగా నగదు లేదని సమాచారం వచ్చింది.
దీంతో అతడు వెంటనే అప్రమత్తమై బ్యాంకు మేనేజర్‌కు ఫిర్యాదు చేశాడు. ఆయన సూచన మేరకు డీఎస్పీని కలిసి విషయం వివరించాడు. దాంతో ఆయన వెంటనే స్పందించి పోలీసులను అప్రమత్తం చేసి... నగదు మాయం చేసిన ఆగంతకుడి ఖాతాను బ్లాక్ చేయించారు. దీంతో ప్రమాదం శంకించిన మోసగాడు రూ.5 లక్షలను తిరిగి దాదాబాషా ఖాతాకు జమ చేశాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.