క్యూఆర్‌ కార్డులంటే ఏమిటి ? | QR Cards Has High Security Features Than Debit Cards | Sakshi
Sakshi News home page

ఏమిటీ క్యూఆర్‌ కార్డులు

Published Wed, Sep 5 2018 11:00 PM | Last Updated on Thu, Sep 6 2018 8:42 AM

QR Cards Has High Security Features Than Debit Cards - Sakshi

గ్రామీణ ప్రాంత ప్రజలకి కూడా ఇంటి ముంగిట్లో బ్యాంకింగ్‌ సేవలను అందించే ఉద్దేశంతో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభించిన తపాలా బ్యాంకులు (ఐపీపీబీ) పనితీరుని సులభం చేసే దిశగా అడుగులు వేస్తున్నాయి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూనే సులభతరంగా అన్ని పనులు పూర్తి అయ్యే చర్యలు చేపడుతున్నాయి. ఇందులో బాగంగానే తపాలా బ్యాంకు ఖాతాదారులకు ఏటీఎం, డెబిట్‌ కార్డులకి బదులుగా క్యూఆర్‌ కార్డులు ఇవ్వాలని నిర్ణయించాయి. అసలు క్యూఆర్‌ కార్డులంటే ఏమిటి ? అవెలా పని చేస్తాయి ? 

క్యూఆర్‌ కార్డులంటే ...
క్విక్‌ రెస్సాన్స్‌కు సంక్షిప్త నామమే క్యూఆర్‌.. ఈ కార్డులకి సాధారణ ఏటీఎంల మాదిరిగా పిన్‌ నెంబర్లు, పాస్‌వర్డ్‌లు ఉండవు. బయోమెట్రిక్‌ నిర్ధారణ ద్వారా ఈ కార్డులు పనిచేస్తాయి. తపాలా బ్యాంకులు మంజూరు చేసిన ఈ కార్డుల్లో క్యూఆర్‌ కోడ్‌ లేదా బార్‌ కోడ్‌ ప్రింట్‌ చేసి ఉంటుంది. ఈ కోడ్‌ ద్వారా ఐపీపీబీ ఖాతాదారుల్ని గుర్తించవచ్చు. స్మార్ట్‌ఫోన్‌లు, మైక్రో ఏటీఎం, పోస్ట్‌మ్యాన్‌లు ఇంటికి తీసుకువచ్చే పరికరాల ద్వారా కూడా క్యూఆర్‌ కోడ్‌ని వినియోగించి ఖాతాదారుల్ని గుర్తించవచ్చు. క్యూఆర్‌ కోడ్‌ ద్వారా ఒకసారి ఖాతాదారుడిని గుర్తించే పని పూర్తవగానే బయోమెట్రిక్‌ డేటా ద్వారా పోస్టుమ్యాన్‌లు మిగిలిన తనిఖీ పూర్తి చేస్తారు. రెండు అంచెల తనిఖీ ప్రక్రియ పూర్తి అయిన తర్వాత ఈ క్యూఆర్‌ కార్డుల్ని వినియోగించుకోవచ్చు. బయోమెట్రిక్‌ విధానం ద్వారా తనిఖీ పూర్తయితే ఖాతాదారులు తమ లావాదేవీలను సులభంగా పూర్తి చేసుకోవచ్చు. 

వినియోగం సులభం..
క్యూఆర్‌ కార్డులని వినియోగించుకోవడం అత్యంత సులభం మీ అకౌంట్‌ నెంబర్‌ తెలీకపోయినా ఈ కార్డుని వాడుకునే సౌలభ్యం ఉంది. ఈ కార్డుల్ని దేశవ్యాప్తంగా ఉన్న తపాలా బ్యాంకు కేంద్రాల్లోనూ, ఇతర వాణిజ్య కేంద్రాల్లోనూ వాడుకోవచ్చు. ఐపీపీబీ మొబైల్‌ యాప్స్‌ద్వారా కూడా వీటిని వినియోగించుకోవచ్చు. అంతేకాదు వీటిని వాడడానికి ఏమంత ఖరీదైన మౌలిక సదుపాయాలు ఉండాల్సిన పనిలేదు. చిన్న చిన్న దుకాణాల్లో కూడా ఈ క్యూఆర్‌ కార్డులు వినియోగించుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. విద్యుత్, టెలిఫోన్‌ బిల్లులు కూడా క్యూఆర్‌ కోడ్‌ని స్కాన్‌ చేసి చెల్లించుకోవచ్చు. ఆన్‌లైన్‌ బిల్లు చెల్లింపులకి రూ.15, నగదు డిపాజిట్, ఉపసంహరణ వంటి లావాదేవీలు ప్రతీ ఒక్కదానికి రూ.25 చార్జీలు వసూలు చేస్తారు. 

భద్రత ఎక్కువ 
ఏటీఎం కార్డు ఉండి, పిన్‌ నెంబర్‌ తెలిస్తే ఒకరి కార్డుని మరొకరైనా వినియోగించుకోవచ్చు. కానీ క్యూఆర్‌ కార్డు విషయానికి వచ్చేసరికి అలా కుదరదు. బయోమెట్రిక్‌ తనిఖీ ఉంటుంది కాబట్టి భద్రత ఎక్కువ. మీ పిన్‌ నెంబర్‌ని ఎవరైనా గుర్తిస్తారేమో, పాస్‌వర్డ్‌ ఎవరికైనా తెలిసిపోతుందేమోనన్న ఆందోళన అక్కర్లేదు. కార్డు పోగొట్టుకున్నా మీ నగదుకు భద్రత ఉంటుంది. 
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement