నిందితుల వివరాలు వెల్లడిస్తున్న ఎస్పీ రస్తోగి
నెల్లూరు (క్రైమ్): ఏటీఎం కార్డులు క్లోనింగ్ చేసి నగదు కాజేస్తున్న అంతర్ రాష్ట్ర ముఠాను నెల్లూరు పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి స్కిమ్మింగ్ మెషిన్, కార్డ్ రీడర్, ల్యాప్‌టాప్, కారుతోపాటు రూ.7.04 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించి ఎస్పీ ఐశ్వర్య రస్తోగి శుక్రవారం వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి. హర్యానా రాష్ట్రంలోని భివానీ జిల్లా భవానీకేడ తాలూకా బార్శి గ్రామానికి చెందిన సందీప్‌కుమార్ 8వ తరగతి వరకు చదువుకున్నాడు. అతనికి సాంకేతిక పరిజ్ఞానంపై పట్టు ఉంది. ఏటీఎం కేంద్రాల వద్ద వృద్ధులు, నిరక్షరాస్యులతో మాటలు కలిపి వారి డెబిట్ కార్డులను తీసుకుని స్కిమ్మింగ్ మెషిన్ ద్వారా స్కాన్ చేసి కార్డులో ఉండే డేటాను బ్లూటూత్ ద్వారా తన ఫోన్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకునేవాడు.
అనంతరం కార్డ్ రీడర్ ద్వారా నకిలీ కార్డులోకి ఆ డేటాను ట్రాన్స్‌ఫర్ చేసి దాని సాయంతో ఏటీఎం కేంద్రాల్లో నగదును డ్రా చేసేవాడు. తన సోదరుడు మంజీత్, బంధువైన జగ్జీత్ కలిసి ఏడాదిన్నర కాలంగా తమిళనాడు, కర్ణాటక, గోవా, ఒడిశా, పశ్చిమ బెంగాల్, బీహార్, రాజస్థాన్, హిమాచల్‌ప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో సుమారు వెయ్యికి పైగా నేరాలకు పాల్పడ్డాడు. నెల్లూరు, శ్రీకాకుళం, విశాఖపట్నం, అనంతపురం, గుంటూరు, కర్నూలు, ప్రకాశం, వనపర్తి, హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో 49 చోట్ల ఇతరుల కార్డుల్ని క్లోన్ చేసి ఏటీఎంల నుంచి నగదు డ్రా చేశాడు. ఈ ముఠా ఒక్క నెల్లూరులోనే 16 నేరాలు చేయడంతో టాస్క్‌ఫోర్స్ బృందం, దర్గామిట్ట పోలీసులు నిఘా పెట్టారు. నిందితులు నెల్లూరు ప్రధాన రైల్వేస్టేషన్ పడమర వైపున గల ఏటీఎం కేంద్రం వద్ద ఉన్నారనే సమాచారం అందుకున్న పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment