
ఏటీఎం కార్డుతో మోసగాడి ఉడాయింపు
రూ.38 వేల నగదు డ్రా
విశాఖపట్నం: ఏటీఏంలో డబ్బు తీసేందుకు వచ్చిన రిటైర్డ్ ప్రధానోపాధ్యాయుడికి సహాయపడుతున్నట్టు నటించి టోకరా వేసి పరారయ్యాడో మాయగాడు. దువ్వాడ జోన్ పోలీస్టేషన్ పరిధిలోని కూర్మన్నపాలెంలో శుక్రవారం ఈ సంఘటన జరిగింది.
పోలీసులకు బాధితుడు అందించిన ఫిర్యాదు మేరకు వివరాలివి. విజయనగరం జిల్లాకు చెందిన రిటైర్ట్ ప్రధానోపాధ్యాయుడు ఎ.హరినారాయణ కూర్మన్నపాలెం వుడా ఫేజ్-7లో నివసిస్తున్న కుమారుని ఇంటికి వచ్చారు. రాజీవ్‌నగర్ వైఎస్సార్ కూడలిలోని ఎస్‌బీహెచ్ ఏటీఎంలో శుక్రవారం ఉదయం డబ్బులు తీసేందుకు వెళ్లారు. ఏటీఎంలో సాంకేతిక లోపం తలెత్తడంతో డబ్బులు రాలేదు. ఈ సమయంలో పక్కనే ఉన్న ఘరానా మోసగాడు హరినారాయణ ఏటీఎం కార్డుతో డబ్బులు తీయడానికి ప్రయత్నిస్తున్నట్టు నటించాడు.
అనంతరం తన చేతిలోని అలాంటి కార్డు హరినారాయణకు అప్పగించి పరారయ్యాడు. వెళ్లిన పది నిమిషాల్లోనే కూర్మన్నపాలెం ముస్తాఫా జంక్షన్‌లోని ఏటీఎంలో రూ.38 వేలు విత్‌డ్రా చేశాడు. నగదు ఏటీఎం ద్వారా డ్రా కాకపోవడంతో సమీపంలోని బ్యాంక్ మేనేజర్‌కు ఫిర్యాదు చేసిన బాధితుడు పాస్‌పుస్తకాన్ని అప్‌డేట్ చేయించగా, నగదు వేరే ఏటీఎంలో విత్‌డ్రా అయినట్టు గుర్తించారు. కార్డును మార్చేసి మోసగించినట్టు గుర్తించిన బాధితులు దువ్వాడ జోన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దువ్వాడ సీఐ ఈశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఫుటేజ్‌లో నిందితుని గుర్తింపు
రాజీవ్‌నగర్, కూర్మన్నపాలెం ముస్తాఫా జంక్షన్లలోని ఏటీఎంల్లోని ఫుటేజ్ ద్వారా నిందితుడిని గుర్తించామని ఎస్‌బీహెచ్ మేనేజర్ సమిత బాగ్ తెలిపారు. బాధితునికి చేతిలో పెట్టిన ఏటీఎం కార్డు వాస్తవానికి నిందితునిది కాదన్నారు.