
ఏమార్చి... ఏటీఎం కార్డు మార్చి...
లంగర్హౌస్(హైదరాబాద్): ఏటీఎం కేంద్రంలో దృష్టి మరల్చి ఓ వ్యక్తి ఏటీఎంను కొట్టేశారు.. దానిని వాడుకుని రూ.61 వేలు డ్రా చేసుకున్నారు. ఈ సంఘటన లంగర్‌హౌస్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాలివీ... లంగర్‌హౌస్ బాగ్దాద్ కాలనీ నివాసి సుభాన్ ప్రై వేట్ ఉద్యోగి. సోమవారం అతడు నానల్‌నగర్ వద్ద ఉన్న ఎస్‌బీఐ ఏటీఎం కేంద్రానికి వెళ్లాడు. కార్డుతో డబ్బు డ్రా చేయడంలో కొద్దిగా ఇబ్బంది పడ్డాడు. అదే సమయంలో వరుస క్రమంలో ఉన్నట్లుగా వెనక కొందరు ఉండగా ఇద్దరు వ్యక్తులు అతనికి చెరో వైపు చేరారు. తాము సహకరిస్తామంటూ వారిద్దరూ అతని చేతిలో ఏటీఎం కార్డును యంత్రంలోకి పెట్టి తీసి, పిన్ నంబర్ కొట్టమన్నారు. అనంతరం 3 వేల నగదు సుభాన్ డ్రా చేశాడు. ఆపై వారి వద్ద నుంచి తన ఏటీఎం కార్డు తీసుకొని వెళ్లిపోయాడు.
మంగళవారం మధ్యాహ్నం డబ్బులు డ్రా చేయడానికి సుభాన్ ఏటీఎంకు వెళ్లాడు. అక్కడ కార్డు పని చేయడం లేదని తెలిసింది. అప్పటికీ గమనించని అతను తన కార్డు పని చేయడంలేదని బ్యాంకును సంప్రదించాడు. బ్యాంకు సిబ్బంది చూసి... డబ్బు డ్రా అయినట్లు చెప్పటంతో లంగర్‌హౌస్ పోలీసులను ఆశ్రయించాడు. ఏటీఎం కేంద్రంలో సాయం చేస్తామంటూ ఇద్దరు వ్యక్తులు వచ్చి..పనికిరాని కార్డును తనకు అంటగట్టి వెళ్లిపోయారని, తన కార్డును వాడుకుని ఖాతాలోని రూ.61 వేలు డ్రా చేసుకున్నారని పేర్కొన్నాడు.