ఎస్‌బీఐకి కన్జ్యూమర్ కోర్టు మొట్టి కాయలు వేసింది. కస్టమర్ మోసపోయిన రూ.80వేల నగదును వెంటనే బ్యాంక్ చెల్లించాలని, లేదంటే కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని ఆదేశాలు జారీ చేసింది.
జూలై 4, 2015న ఉత్తరాఖండ్ రాష్ట్రం రూర్కి నగర నివాసీ పార్థసారథి ముఖర్జీ ఎస్‌బీఐ బ్యాంక్ అకౌంట్ నుంచి నేరస్తులు న్యూఢిల్లీలోని ఎస్‌బీఐ బ్యాంక్ ఏటీఎంల నుంచి రూ.80,000 విత్‌డ్రా చేశారు. విత్ డ్రా అయినట్లు ముఖర్జీ ఫోన్‌కు మెసేజ్ వెళ్లింది. వెంటనే సదరు బ్యాంక్‌కు మెయిల్ పంపాడు. గుర్తుతెలియని వ్యక‍్తులు ఎస్‌బీఐ ఏటీఎం నుంచి ఒక్కొక్కరు రూ.10వేలు చొప్పున మొత్తం ఎనిమిది సార్లు విత్ డ్రా చేసినట్లు మెయిల్ ద్వారా సమాచారం అందించారు.
తనకు న‍్యాయం చేయాలని కోరారు. వెంటనే ఉత్తరాఖండ్ కన్జ్యూమర్ కోర్టునూ ఆశ్రయించారు. బాధితుడి ఫిర్యాదుతో కన్జ్యూమర్ కోర్టు సమస్యను పరిష్కరించి, బాధితుడికి న్యాయం చేయాలని ఢిల్లీ ఎస్‌బీఐకు ఉత్తర్వులు జారీ చేసింది.
కోర్టు ఆదేశాలతో స్థానిక పోలీసులు విచారణ చేపట్టేందుకు ఎస్‌బీఐ బ్యాంక్‌ను సీసీటీవీ పుటేజీ ఇవ్వాలని కోరారు. అందుకు ఎస్‌బీఐ అధికారులు తిరస్కరించారు. ఎస్‌బీఐ అధికారుల తీరుపై బాధితుడు కన్జ్యూమర్ కోర్టుకు తన గోడును వెళ్లబోసుకున్నాడు.
అయితే, అగంతకులు విత్ డ్రాపై బ్యాంక్ సత్వరమే చర్యలు తీసుకుందని, తన బ్యాంక్ బ్రాంచ్‌తో పాటు ఇతర బ్యాంక్ బ్రాంచీలకు సమాచారం ఇచ్చామని బ్యాంక్ అధికారులు కన్జ్యూమర్ కోర్టుకు తెలిపారు.
తమ (ఎస్‌బీఐ) సేవల్లో ఎలాంటి లోపాలు లేవని, బ్యాంక్ ఖాతాదారుడు అగంతకులకు కార్డ్ వివరాలు, బ్యాంక్ డీటెయిల్స్ అందించారని స్పష్టం చేసింది. ఎస్‌బీఐ బ్యాంక్ తీరును ప్రశ్నించిన కన్జ్యూమర్ కోర్టు బాధితుడు నష్టపోయిన రూ.80వేల మొత్తాన్ని చెల్లించాలని సూచించింది.
వివాదాస్పద లావాదేవీలకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ లేకపోవడంతో పోలీసు విచారణను ముగించలేమని రాష్ట్ర కమిషన్ గమనించింది. రికార్డులో ఉన్న సాక్ష్యాధారాల ఆధారంగా బ్యాంక్ సేవల్లో లోపాలు ఉన్నాయని భావించామనే, కాబట్టే ఈ తీర్పు ఇచ్చినట్లు ఉత్తరా ఖండ్ కన్జ్యూమర్ కోర్టు వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment