ఢిల్లీ, సాక్షి: ఎలక్టోరల్ బాండ్స్ కేసులో.. భారతీయ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాపై సుప్రీం కోర్టు కన్నెర్ర జేసింది. బాండ్ల వివరాలను కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించేందుకు గడువు పొడిగింపు విజ్ఞప్తిని తోసిపుచ్చుతూ.. మంగళవారానికి డెడ్‌లైన విధించింది. ఒకవేళ అలా సమర్పించని పక్షంలో కోర్టు ధిక్కరణ కింద చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. అలాగే.. ఆ వివరాలను మార్చి 15వ తేదీ సాయంత్రం 5గం.లోగా వెబ్‌సైట్‌లో ఉంచాలని ఈసీని ఆదేశించింది.
ఫిబ్రవరి 15వ తేదీన ఎన్నికల బాండ్లకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై సుప్రీం కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. ఎన్నికల బాండ్లు చెల్లవని.. అవి రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంది. అలాగే.. ఇప్పటివరకు బాండ్ల రూపంలో విరాళాలు ఇచ్చిన దాతల వివరాలను మార్చి 13వ తేదీలోగా బహిర్గత పర్చాలని ఎస్‌బీఐ, కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. అయితే.. ఆ గడువును జూన్ 30 వరకూ పొడిగించాలంటూ ఎస్‌బీఐ రిక్వెస్ట్ పిటిషన్ వేసింది.
ఆలోపు ఈ వ్యవహారం రాజకీయ మలుపు తిరిగింది. ఎన్నికలు ముగిశాకే.. బాండ్ల వివరాలను ఎస్‌బీఐ సమర్పిస్తాననడం వెనుక రాజకీయ దురుద్దేశం కనిపిస్తోందని విమర్శలు గుప్పించింది కాంగ్రెస్. మరోవైపు ఎన్నికల బాండ్ల విషయంలో ఎస్‌బీఐ గడువు పొడిగించాలని కోరడం కోర్టు ధిక్కారం కిందకే అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) ఓ పిటిషన్ వేసింది. ఈ రెండు పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఇవాళ విచారణ జరిపింది. ఈ క్రమంలో ఎస్‌బీఐ వాదనలకు సుప్రీం గట్టిగానే అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ.. ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఎస్‌బీఐ తరఫున సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే .. కోర్టు ఆదేశాలను పాటించడానికి మాకు కొంత సమయం కావాలి. పూర్తి సమాచారాన్ని పునఃపరిశీలించుకునేందుకు ఆ గడువు(జూన్ 30వ తేదీ) కచ్చితంగా అవసరం. బ్యాంక్ కాబట్టి సమాచారాన్ని గోప్యంగా ఉంచాలనే కోరుకుంటున్నాం.
చీఫ్‌జస్టిస్ డీవై చంద్రచూడ్ .. దాతల వివరాలను సీల్డ్ కవర్‌లో ముంబై బ్రాంచ్ బ్యాంక్‌లో సమర్పించండి
జస్టిస్ సంజీవ్ ఖన్నా.. ఆ సీల్డ్ కవర్‌ను మీరే తెరిచి సమాచారం అందించండి
లాయర్ హరీష్ సాల్వే.. బాండ్లు ఎవరు కొన్నారు? ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది?.. ఇలా పూర్తి సమాచారం మా దగ్గర ఉంది. అలాగే వాటిని కొనుగోలు చేసిన వాళ్ల వివరాలు సైతం ఉన్నాయి. ఆ వివరాలను పునఃపరిశీలించుకోవడమే మిగిలి ఉంది.
సీజేఐ చంద్రచూడ్.. ఈ విషయంలో ఎలాంటి ఎగస్ట్రా కసరత్తులు చేయనక్కర్లేదు. అలా చేయమని కూడా మేం చెప్పలేదు. కోర్టు ఇచ్చిన ఆదేశాలను పాటించండి చాలూ.
సీజేఐ చంద్రచూడ్.. తీర్పు ఇచ్చి చాలా రోజులే అయ్యింది.. గత 26 రోజులుగా ఏం చేశారు? అసలు ఇప్పటివరకు స్టేట్‌బ్యాంక్ తీసుకున్న చర్యల వివరాలు పిటిషన్ లో లేవు
సీజేఐ చంద్రచూడ్.. ఇన్నిరోజులు బాండ్ల విషయంలో ఏం సరిపోల్చుకోవాలని మీరు ప్రయత్నిస్తున్నారు? బాండ్ల వివరాలు వెల్లడించాలని తీర్పులోనే స్పష్టంగా చెప్పాం.
హరీష్ సాల్వే.. ఈ విషయంలో మేం తప్పులు చేయాలని అనుకోవడం లేదు. ఒకవేళ అదే జరిగితే దాతలు కోర్టులకెక్కి దావాలు వేసే అవకాశం ఉంది. అలాగే.. మేం చేస్తున్న పద్ధతిలో ఎలాంటి సమాచారం బయటకు పొక్కే అవకాశం లేదు.
సీజేఐ చంద్రచూడ్.. రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పులోనే మార్పులు చేయమని అడుగుతున్నారా?(ఎస్‌బీఐ అఫిడవిట్‌ను ప్రస్తావిస్తూ). ఇది తీవ్రంగా పరిగణించాల్సిన విషయం. రేపు సాయంత్రం లోగా ఎన్నికల బాండ్లకు సంబంధించిన వివరాలను కేంద్ర ఎన్నికల సంఘానికి అందించండి. ఆ వివరాలను మార్చి 15వ తేదీ సాయంత్రం ఐదు గంటలలోపు తమ వెబ్‌సైట్‌లో ఈసీ ప్రచురించాల్సిందే. ఎన్నికల బాండ్ల విషయంలో ఎలాంటి పొడిగింపు లేదు. సీల్డ్ కవర్ తెరిచి వివరాలు సేకరించి ఈసీకి ఇస్తే చాలు. పొడిగింపు కోరుతూ మీరు వేసిన పిటిషన్‌ను తిరస్కరిస్తున్నాం.
కోర్టు తీర్పుపై హర్షం
ఏడీఆర్ తరఫున న్యాయవాది ప్రశాంత్ భూషణ్ సుప్రీం కోర్టు ఆదేశాలను స్వాగతించారు. ‘‘ఎస్‌బీఐ అభ్యర్థనను కోర్టు కొట్టేసింది. కోర్టు కోరిన వివరాలన్నీ తమ ఉన్నట్లు అఫిడవిట్‌లో ఎస్‌బీఐ పేర్కొంది. అలాంటప్పుడు ఆలస్యం చేయకుండా సమర్పించాల్సిందేనని.. గడువు పొడిగింపు ఉండదని బెంచ్ స్పష్టం చేసింది. క్రాస్ చెకింగ్ పేరుతో బ్యాంక్ చేసిన అభ్యర్థనను కోర్టు అంగీకరించలేదు. అలాంటివేం అక్కర్లేదని తేల్చి చెప్పింది. ఆ వివరాలను రేపు సాయంత్రం లోగా ఈసీకి ఇవ్వమని చెప్పింది’’ అని ప్రశాంత్ భూషణ్ మీడియాకు తెలిపారు.
రాజకీయ పార్టీలకు రహస్యంగా నిధులు అందించడానికి వీలు కల్పించే ఎన్నికల బాండ్ల పథకాన్ని గత నెల తీర్పుతో సుప్రీం కోర్టు రద్దు చేసేసింది. ఎలక్టోరల్ బాండ్‌లు రాజ్యాంగ విరుద్ధంగా తీర్పు ఇచ్చిన సర్వోన్నత న్యాయస్థానం.. బాండ్ల జారీని తక్షణమే ఆపేయాలంటూ ఎస్‌బీఐని ఆదేశించింది. అదే సమయంలో.. వాటి ద్వారా పార్టీలకు అందిన సొమ్ము, ఇచ్చిన దాతల వివరాలను బహిర్గత పర్చాలని ఎస్‌బీఐ, కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది.
Comments
Please login to add a commentAdd a comment