ఢిల్లీ: ఎన్నికల బాండ్ల కేసులో సుప్రీం కోర్టు ఆగ్రహానికి గురైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. ఎట్టకేలకు ఆ బాండ్ల వివరాలను కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించింది. మంగళవారం సాయంత్రమే కోర్టు ఆదేశాల మేరకు వివరాలు ఇవ్వగా.. ఇవాళ సమ్మతి అఫిడవిట్(compliance affidavit) సమర్పించింది. అందులో..
ఈసీకి ఇచ్చిన పెన్ డ్రైవ్ వివరాలను అఫిడవిట్‌లో ప్రస్తావించింది. పెన్‌డ్రైవ్‌లో రెండు పీడీఎఫ్ ఫైల్స్ ఉన్నాయని.. వాటికి పాస్‌వర్డ్ ఉన్నాయని పేర్కొంది. అలాగే.. ఏప్రిల్ 2019 నుంచి.. ఈ ఏడాది 2024 ఫిబ్రవరి 15వ తేదీ దాకా(అంటే.. ఎన్నికల బాండ్లు చెల్లవని కోర్టు తీర్పు ఇచ్చేదాకా ) మొత్తం 22, 217 ఎన్నికల బాండ్లను జారీ చేసినట్లు ఎస్‌బీఐ పేర్కొంది.
ఈ మొత్తంలో రాజకీయ పార్టీలు 22, 030 బాండ్లను తీసుకున్నాయని తెలిపింది. అలాగే.. మిగిలిన 187 తాలుకా బాండ్ల నగదు ప్రధాని రిలీఫ్ ఫండ్‌కు జమ అయినట్లు ఎస్‌బీఐ పేర్కొంది.
ఎన్నికల బాండ్ల పథకం కింద.. దాతలు తమ ఇష్టపూర్వకంగా విరాళాలను ఎస్‌బీఐ నుంచి ఎన్నికల బాండ్ల రూపేణా కొనుగోలు చేసి ఆయా పార్టీలకు ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ.. 15 రోజుల్లో గనుక పార్టీలు ఆ బాండ్లను స్వీకరించకపోతే ఆ డబ్బు ప్రధాని రిలీఫ్ ఫండ్‌కు వెళ్తుంది. కానీ, ఈ పథకం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ రద్దు చేస్తూ ఫిబ్రవరి 15వ తేదీన సుప్రీం కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది.
ఇదీ చదవండి: 26 రోజులేం చేశారు?.. ఎస్‌బీఐపై సుప్రీం కన్నెర్ర
Comments
Please login to add a commentAdd a comment