పెద్దవడుగూరు: కలిసి మెలిసి తిరిగే యువకుడే తన స్నేహితుడి వద్ద ఏటీఎం కార్డు తస్కరించి రూ.40వేల నగదు డ్రా చేసిన ఘటన బుధవారం వెలుగు చూసింది. మండల కేంద్రం పెద్దవడుగూరుకు చెందిన సాయిచంద్, కాయల నారాయణస్వామి అనే యువకులు స్నేహితులు. సాయిచంద్ మంగళవారం తన తల్లి జయమ్మకు చెందిన ఏటీఎం కార్డు తీసుకుని రూ.1000 నగదు కోసం ఏటీఎం కేంద్రానికి వెళ్లాడు. ఆ సమయంలో స్నేహితుడు కూడా వెంట ఉన్నాడు. అనంతరం ఇద్దరూ బయటకు వెళ్లి మద్యం తాగారు. మత్తులో పడి ఉన్న సాయిచంద్ జేబులోంచి ఏటీఎం కార్డును తస్కరించి.. గుర్తు పెట్టుకున్న పిన్ నంబర్ ద్వారా రూ.40వేలు డ్రా చేసేశాడు.
ఆ తర్వాత తనకేమీ తెలియనట్టు కార్డు తీసుకొచ్చి స్నేహితుడి జేబులో పెట్టేశాడు. బుధవారం జయమ్మ డబ్బు డ్రా చేయడానికని కుమారుడితో కలిసి ఆంధ్రాబ్యాంకుకు వెళ్లింది. అయితే ఖాతాలో డబ్బు లేదని బ్యాంకు సిబ్బంది చెప్పారు. ఖాతాలోని డబ్బు ఎక్కడికెళ్లిందని ఆరా తీయగా.. ఏటీఎం ద్వారా రూ.40వేలు డ్రా చేసినట్లు చెప్పడంతో అవాక్కయ్యింది. వెంటనే ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎస్‌ఐ రమణారెడ్డి అనుమానితుడిగా భావిస్తున్న కాయల నారాయణస్వామిని అదుపులోకి తీసుకుని విచారించగా తానే డబ్బు డ్రా చేసినట్లు ఒప్పుకున్నాడు. దీంతో అతని వద్ద నుంచి ఆ డబ్బును తిరిగి బాధితురాలికి ఇప్పించారు.
Comments
Please login to add a commentAdd a comment