వేసవి డిమాండ్‌కు సరిపడా విద్యుత్ లభ్యత ఉంది..
నిరంతర సరఫరాకు సన్నద్ధంగా ఉండాలి
తాగునీటి కొరత రాకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలి
విద్యుత్, తాగునీటి సరఫరాపై అధికారులకు సీఎం రేవంత్ సూచనలు
సాక్షి, హైదరాబాద్: వేసవిలో పెరిగిన డిమాండ్‌కు సరిపడా విద్యుత్ లభ్యత ఉందని.. ఎక్కడా విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉండరాదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులకు సూచించారు. తాగునీటి కొరత లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. వేసవి తీవ్రతతో పెరిగిన డిమాండ్‌కు సరిపడా విద్యుత్ సరఫరా చేసేందుకు సన్నద్ధంగా ఉండాలని అన్నారు. కరెంట్ పోయిందనే ఫిర్యాదులు రాకుండా అప్రమత్తంగా ఉండాలని, ఎక్కడైనా సమస్య తలెత్తినా వెంటనే పరిష్కరించాలని చెప్పారు.
వేసవిలో విద్యుత్, తాగునీటి సరఫరాకు తీసుకోవాల్సిన చర్యలపై శనివారం అధికారులకు సీఎం రేవంత్‌రెడ్డి సూచనలు జారీ చేశారు. అత్యవసర సేవలైన విద్యుత్, తాగునీటి సరఫరాలపై తొలుత సమీక్ష నిర్వహించాలని సీఎం భావించినా, ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో కేవలం సూచనలు జారీ చేశారని సీఎంఓ కార్యాలయ వర్గాలు తెలిపాయి. వేసవి అవసరాలకు అనుగుణంగా విద్యుత్ సరఫరా చేసే కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలని ముఖ్యమంత్రి కోరారు.
తాగునీటికి ఇబ్బంది లేకుండా, పంటలు ఎండిపోకుండా, పరీక్షలకు ప్రిపేరయ్యే విద్యార్థులకు ఇబ్బంది తలెత్తకుండా చూడాలని చెప్పారు. గత ఏడాది కంటే రాష్ట్రంలో ఈ ఏడాది అత్యధికంగా విద్యుత్ సరఫరా చేయటం కొత్త రికార్డును నమోదు చేసిందని సీఎం రేవంత్‌రెడ్డి గుర్తు చేశారు. మార్చిలో డిమాండ్ గణనీయంగా పెరిగిందని, పీక్ డిమాండ్ ఉన్నా, కోత లేకుండా విద్యుత్‌ను అందించటంలో డిస్కంలు సమర్థవంతమైన పాత్ర పోషించాయని ప్రశంసించారు. ఆ శాఖ మంత్రి భట్టి విక్రమార్కని అభినందించారు.
తాగునీటి సరఫరాకు యాక్షన్‌ప్లాన్
అన్ని ప్రాంతాల్లో ప్రజలకు తాగునీటి కొరత లేకుండా యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. ఏప్రిల్, మే, జూన్ వరకు స్థానికంగా ఉన్న నీటి వనరులను ఉపయోగించుకోవాలని సూచించారు. బోర్‌వెల్స్, బావులను తాగునీటి అవసరాలకు వాడుకోవాలని, సమీపంలో ఉన్న నీటి వనరులను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. తాగునీటికి ప్రజలు ఇబ్బంది పడకుండా జిల్లా కలెక్టర్లు ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని చెప్పారు. సమస్య ఉన్న చోట తక్షణ పరిష్కారాలను పర్యవేక్షించేందుకు జిల్లా స్థాయిలో ఒక సీనియర్ అధికారిని ప్రత్యేక అధికారిగా నియమించాలని ఆదేశించారు.
గ్రామాలవారీగా డ్రింకింగ్ వాటర్ యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోవాలని చెప్పారు. అవసరాన్ని బట్టి రాష్ట్రస్థాయి నుంచి సంబంధిత శాఖల ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలని సూచించారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలలో తాగునీటి కొరత అధిగమించేందుకు వాటర్‌ట్యాంకులు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. ట్యాంకర్లు బుక్ చేస్తే ఆలస్యం లేకుండా 12 గంటల్లోపు అవసరమైన చోటకు చేరేలా చూడాలని, అందుకు సరిపడా ట్యాంకర్లు సమకూర్చుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు.
భారీగా పెరిగిన విద్యుత్ డిమాండ్..
గత ఏడాదితో పోలిస్తే డిమాండ్‌కు అనుగుణంగా విద్యుత్ సరఫరా గణనీయంగా పెరిగింది. రాష్ట్రంలో సగటున 9,712 మెగావాట్ల విద్యుత్ లోడ్ ఉంటుంది. గత రెండు వారాలుగా 14,000 మెగావాట్ల నుంచి 15,000 మెగావాట్ల పీక్ డిమాండ్ ఉంటోంది. ఏప్రిల్ నెల రెండోవారం వరకు ఇంచుమించుగా ఇదే స్థాయిలో డిమాండ్ ఉంటుందని విద్యుత్ అధికారులు అంచనా వేశారు.
– గత ఏడాది జనవరి నుంచి మార్చి వరకు సగటున రోజుకు 239.19 మిలియన్ యూనిట్ల(ఎంయూ) విద్యుత్ వినియోగం ఉంటే.. 2024 జనవరి నుంచి మార్చి మధ్యకాలంలో సగటున రోజుకు 251.59 ఎంయూల విద్యుత్ వినియోగం ఉంది.
– గత ఏడాది మార్చి 14న అత్యధికంగా 297.89 ఎంయూల విద్యుత్ వినియోగం ఉండగా, ఈ ఏడాది 308.54 ఎంయూల వినియోగం జరిగి కొత్త రికార్డును సృష్టించింది.
– గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనూ గత ఏడాదితో పోలిస్తే విద్యుత్ వినియోగం గణనీయంగా పెరిగింది.
Comments
Please login to add a commentAdd a comment