బడుగులపై ‘అగ్గి’ పిడుగు
మండు వేసవి.. మిట్టమధ్యాహ్నం 12 గంటల సమయం.. భానుడు నిప్పుడు చెరుగుతున్నాడు. అంతకు మించి వడగాడ్పులు ఉద్ధృతంగా వీస్తున్నాయి. ఆ ధాటికి బయటకు రావడానికి భయపడిన కాలనీ వాసులు గుడిసెల్లోనే సేద దీరుతున్నారు. ఇంతలో ఒక్కసారిగా పెద్దగా అరుపులు, కేకలు.. ఏం జరిగిందోనని ఒకరి వెంట ఒకరు గుడిసెల నుంచి బయటకు పరుగుతీశారు. ఓ ఇంటి నుంచి పొగతో కూడిన మంటలు ఎగసి పడుతున్నాయి. చూస్తూ ఉండగానే అగ్ని కీలలు కాలనీ మొత్తాన్ని చుట్టేశాయి. 68 ఇళ్లు కాలి బూడిదయ్యాయి. దాదాపు 150 కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఈ ఘోర అగ్నిప్రమాదం శుక్రవారం తెనాలి పట్టణంలోని పాండురంగపేటలో జరిగింది.
తెనాలిఅర్బన్
పట్టణంలోని పాండురంగపేట శుక్రవారం మధ్యాహ్నం సంభవించిన అగ్ని ప్రమాదం నిరుపేదలను నిరాశ్రయులను చేసింది. లక్షల రూపాయల ఆస్తిని బుగ్గిపాలు చేసింది. స్థానిక లంబాడీ కాలనీలోని 27వ వార్డులో వందకు పైగా నిరుపేదల ఇళ్లున్నాయి. అంతా ఇరుకు సందులు, ఇంటికి ఇంటికీ మధ్య నడిచే కాళీ కూడా లేదు. మధ్యాహ్న సమయంలో ఓ పూరిగుడిసె నుంచి మంటలు రాగా స్థానికులు వెంటనే ఫైర్‌స్టేషన్‌కు సమాచారం అందించారు. ఇళ్లలోంచి సామాన్లు బయట పడేసే పనిలో నిమగ్నమయ్యారు. చూస్తూ ఉండగానే మంటలు కాలనీని చుట్టుముట్టాయి.
ఇంతలో ఓ ఇంటిలోంచి గ్యాస్ సిలిండర్ పెద్దశబ్దంతో పేలి, పైకి లేచింది. ఈ హటాత్పరిణామంతో స్థానికులు భయాందోళనలకు లోనయ్యారు. ప్రతి ఇంటిలోనూ వంటగ్యాస్ సిలిండర్లు ఉండటంతో మంటలను అదుపు చేసేందుకు ఎవరూ సాహసించలేదు. కట్టుబట్టలతో బయటపడిన మహిళలు మంటలను చూస్తూ రోదిస్తూ నిస్సహాయంగా ఉండిపోయారు. ఈ ప్రమాదంలో మొత్తం 68 పూడి గుడిసెలు దగ్దమయ్యాయి. ఇందులో 43 ఇళ్లు పూర్తిగాను 25 పాక్షికంగాను కాలిపోయాయి.
స్పందించిన అగ్నిమాపకశాఖ.: ప్రమాద వార్త అందిన వెంటనే అగ్నిమాపక శాఖాధికారి కె.కృష్ణారెడ్డి సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. రెండు వాహనాల ద్వారా మంటలను అదుపుచేశారు. సమీపంలో చెరువులు, కాలువలు లేకపోవటం, రెండు వాహనాల్లో నీరు ఏకకాలంలో అయిపోవటంతో మరలా మంటలు చెలరేగకుండా స్థానికులు అప్రమత్తంగా వ్యవహరించారు. ఈ ప్రమాదంలో రూ.21 లక్షలు నష్టం జరిగి ఉంటుందని అధికారులు అంచనా వేశారు. స్థానికులు మాత్రం 40 లక్షలపైగా నష్టం ఉండొచ్చని, వంట చేస్తుండగా మంటలు పెకైగసి గుడిసెకు అంటుకున్నాయని చెబుతున్నారు.
సహాయక చర్యల్లో రెవెన్యూ సిబ్బంది..
రెవెన్యూ అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. ఆర్డీవో ఎస్.శ్రీనివాసమూర్తి నేతృత్వంతో మునిసిపల్ కమిషర్ బి.గోపినాథ్, డీఎస్పీ టి.పి.విఠలేశ్వర్ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని, పరిస్థితిని సమీక్షించారు. సమీసంలోని షాదీఖానాలో బాధితులకు భోజన ఏర్పాట్లు చేశారు.
వారిని తాత్కాలికంగా అక్కడికి తరలించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. తాగునీరు, భోజన వసతికి ఇబ్బంది లేకుండా సిబ్బందిని అప్రమత్తం చేశారు. బాధితులను ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని, విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి ఐఏవై కింద గృహ నిర్మాణానికి ప్రతిపాదిస్తామని ఆర్టీవో తెలిపారు. త్రీటౌన్ సీఐ షేక్ అబ్దుల్‌అజీజ్, ఎస్‌ఐలు రవీంద్రబాబు, జోగి శ్రీనివాస్, ఇన్‌చార్జి తహశీల్దార్ వెంకటరత్నం, ఏసీపీ ధర్మారావు, టీపీవో అనురాధ, ఆర్‌ఐ సూర్యనారాయణమూర్తి, పలువురు వీఆర్వోలు, వీఆర్‌ఏలు సహయక చర్యల్లో నిమగ్నమయ్యారు.