నిప్పుల కుంపటి
రాష్ట్రవ్యాప్తంగా మండుతున్న ఎండలు
► చాలా ప్రాంతాల్లో 45 – 46 డిగ్రీల మేర గరిష్ట ఉష్ణోగ్రతలు
► రాష్ట్రంలో పెరుగుతున్న వడదెబ్బ మృతుల సంఖ్య
► ఇప్పటివరకు 171 మంది మృతిచెందినట్లు విపత్తు నిర్వహణ శాఖ ప్రకటన.. మరో 4 రోజులు వడగాడ్పుల హెచ్చరిక
► ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టని అధికార యంత్రాంగం
► వేసవి కార్యాచరణ ప్రణాళిక అమలు శూన్యం
సాక్షి హైదరాబాద్, నెట్‌వర్క్
భారీగా పెరిగిన ఉష్ణోగ్రతలతో రాష్ట్రం నిప్పుల కుంపటిగా మారింది. ఎండల తీవ్రత, వడగాడ్పులతో జనం విలవిల్లాడుతున్నారు. వడదెబ్బకు గురై పిట్టల్లా రాలిపోతున్నారు. రాష్ట్రంలో వేసవి ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు 171 మంది వడదెబ్బ కారణంగా మృతి చెందారని విపత్తు నిర్వహణ శాఖ శనివారం ప్రకటించింది. ఇక శనివారం నల్లగొండలో అత్యధికంగా 46 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఆదిలాబాద్, భద్రాచలం, రామగుండంలలో 45 డిగ్రీల చొప్పున.. హన్మకొండ, మహబూబ్‌నగర్, నిజామాబాద్‌లలో 44, ఖమ్మంలో 43, హైదరాబాద్‌లో 42, హకీంపేటలో 41 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎండ తీవ్రత కారణంగా జనం పగటిపూట ఇళ్లలోంచి బయటకు వెళ్లాలంటే భయపడుతున్నారు.
ఖమ్మం జిల్లాలో అత్యధికంగా..
రాష్ట్రంలో అత్యధికంగా ఖమ్మం జిల్లాలో 56 మంది వడదెబ్బతో చనిపోయారు. కరీంనగర్‌లో 27 మంది, నల్లగొండలో 25 మంది, మంచిర్యాలలో 12 మంది మరణించారు. రైతు సమగ్ర సర్వే చేస్తున్న వ్యవసాయ విస్తరణాధికారి ఒకరు విధుల్లోనే మరణించడం గమనార్హం. ఇక వందల సంఖ్యలో జనం ఎండదెబ్బ కారణంగా అస్వస్థతకు గురయ్యారు. పాత ఆదిలాబాద్ జిల్లా పరిధిలో ఎండల తీవ్రత మరింత ఎక్కువగా ఉంది. ముఖ్యంగా సింగరేణి గనులున్న ప్రాంతాల్లో ఎండ నిప్పులు కక్కుతోంది. చాలా మండలాల్లో 45 డిగ్రీలకుపైగానే గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వడగాడ్పుల కారణంగా వందల సంఖ్యలో అస్వస్థతకు గురై ఆస్పత్రుల పాలయ్యారు.
మరిన్ని రోజులు వడగాడ్పులు..
ఆంధ్రప్రదేశ్ సముద్ర తీరం వెంబడి అల్పపీడన ద్రోణి ఉండటంతో ఉత్తర భారతదేశం నుంచి వేడి గాలులు వీస్తున్నాయని... ఫలితంగా ఏపీ, తెలంగాణలపై వడగాడ్పులు పంజా విసురుతున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ వై.కె.రెడ్డి చెప్పారు. మరో నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో తీవ్రస్థాయిలో వడగాల్పులు ఉంటాయని హెచ్చరించారు. నైరుతి రుతు పవనాలు ప్రవేశించే వరకు కూడా వడగాడ్పులు కొనసాగినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని పేర్కొన్నారు.
వేసవి ప్రణాళిక అమలు ఏదీ?
భారీ స్థాయిలో ఎండలు మండుతున్నా, జనం పిట్టల్లా రాలిపోతున్నా తగిన చర్యలు చేపట్టడంలో ప్రభుత్వ యంత్రాంగం విఫలమైందనే ఆరోపణలు వస్తున్నాయి. ఎండ తీవ్రత నుంచి ప్రజలను కాపాడేందుకు రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ వేసవి కార్యాచరణ ప్రణాళికను రూపొందించింది. దాని ప్రకారం ఆయా శాఖలు రాష్ట్రవ్యాప్తంగా నగరాలు, పట్టణాలు, పల్లెల్లో చర్యలు తీసుకోవాలి. కానీ ఆ దిశగా చర్యలేమీ కనిపించడం లేదు. కొన్ని శాఖలైతే అసలు పట్టించుకోవడం లేదు. వడగాడ్పులుంటే ఆర్టీసీ బస్సులను మధ్యాహ్నం 12 నుంచి 4 గంటల మధ్య నడపకూడదన్న నిబంధన ఉంది. కానీ అది అమలుకావడం లేదు. ఆరు బయట శారీరక శ్రమ చేసే వారికి నీడ కల్పించాలని, ఫ్యాక్టరీల్లో చల్లదనం వసతి కల్పించాలనే నిబంధనలున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. ఇక తాగునీరు, వైద్య వసతి, నీడ కల్పించడం వంటి చర్యలూ లేవు.
అమలు చేయాల్సిన వేసవి ప్రణాళిక ఇదీ
సాధారణ ఉష్ణోగ్రత 40 డిగ్రీలుగా ఉండి, దానికి అదనంగా నాలుగైదు డిగ్రీలు పెరిగితే (45 డిగ్రీలకు చేరుకుంటే) అధిక ఉష్ణోగ్రత, వడగాడ్పుల పరిస్థితిగా పరిగణిస్తారు. అదే ఏడు డిగ్రీలు అధికంగా 46–47 డిగ్రీల వరకు ఉంటే దాన్ని తీవ్రమైన వడగాడ్పుల పరిస్థితిగా పరిగణిస్తారు. ఈ ప్రకారం అత్యంత తీవ్రమైన ఎండలు, వడగాడ్పుల పరిస్థితి ఉన్నప్పుడు రెడ్ అలర్ట్, తీవ్రమైన ఎండలు ఉన్నప్పుడు ఆరెంజ్ అలర్ట్, ఎండలు కాస్త ఎక్కువగా ఉన్నప్పుడు ఎల్లో అలర్ట్‌లను జారీచేయాల్సి ఉంటుంది. కానీ అవేమీ జరగడం లేదు.
→ రాష్ట్రవ్యాప్తంగా నగరాలు, పట్టణాల్లో ఎల్‌ఈడీ స్క్రీన్స్ పెట్టి ఉష్ణోగ్రతల వివరాలు ప్రదర్శించడం
→ రేడియో ద్వారా ప్రజలను అప్రమత్తం చేయడం
→ఐస్ ప్యాక్స్, ఐవీ ఫ్లూయిడ్స్‌ను అందుబాటులో ఉంచడం
→108 సర్వీసును, ఆరోగ్య కార్యకర్తలను, ఆశ వర్కర్లను అందుబాటులో ఉంచడం. ఆరోగ్య కేంద్రాల వేళలను పెంచడం. వడదెబ్బకు గురైనవారి కోసం ఆస్పత్రుల్లో ప్రత్యేకంగా వార్డులను నెలకొల్పడం
→ ఆరు బయట శారీరక శ్రమ చేసే వారికి తగు నీడ కల్పించడం. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి ఐదింటి వరకు పనివేళలు లేకుండా చూడడం. ఫ్యాక్టరీల్లో ఏసీ వసతి కల్పించడం
→ ఎండలు, వడగాడ్పుల పరిస్థితిపై ట్వీటర్, ఫేస్‌బుక్, వాట్సప్ వంటి సామాజిక మాధ్యమాలను ఉపయోగించి ప్రజలను అప్రమత్తం చేయడం. మొబైల్ ఫోన్లకు ఎస్సెమ్మెస్‌లు పంపడం
→ అత్యంత తీవ్రత ఉన్న ప్రాంతాలను గుర్తించి ప్రత్యేక ఏర్పాట్లు చేయడం
వడదెబ్బ తగలకుండా ఏంచేయాలి?
→ వీలైనంత వరకు ఎండలో వెళ్లకపోవడం మంచిది. వెళ్లాల్సి వస్తే గొడుగు తప్పనిసరిగా వాడాలి. తలపై టోపీ లేదా రుమాలు చుట్టుకోవడం వంటివి చేయాలి.
→ తెలుపు లేదా లేత రంగుల పలుచటి వస్త్రాలను ధరించాలి
→ ఉప్పు కలిపిన మజ్జిగ లేదా చిటికెడు ఉప్పు కలిపిన గ్లూకోజ్ నీరు లేదా ఓరల్ రీహైడ్రేషన్ ద్రవం తాగాలి.
→ ఎవరైనా వడదెబ్బకు గురైతే వెంటనే చల్లటి ప్రదేశానికి తరలించాలి. గాలి తగిలేలా ఏర్పాట్లు చేయాలి. శరీర ఉష్ణోగ్రత సాధారణ స్థాయికి వచ్చేదాకా చల్లని నీటిలో ముంచిన తడి వస్త్రంతో శరీరమంతా తుడుస్తూ ఉండాలి. వీలైనంత త్వరగా సమీపంలోని ఆస్పత్రికి తరలించాలి.
తండ్రి, కొడుకును బలిగొన్న వడదెబ్బ
రాష్ట్రవ్యాప్తంగా ఎండల తీవ్రత కారణంగా పెద్ద సంఖ్యలో జనం వడదెబ్బకు గురవుతున్నారు. ఆరుబయట పనిచేసేవారు, అత్యవసర పనుల మీద వెళుతున్నవారు ఎండ తీవ్రత కారణంగా అస్వస్థతకు గురవుతున్నారు. శనివారం వడదెబ్బ కారణంగా నల్లగొండ జిల్లా చిట్యాలలో కొద్దిగంటల వ్యవధిలోనే తండ్రి, కుమారుడు మృతి చెందారు. చిట్యాలకు చెందిన కొండె దశరథరావు(60), ఆయన రెండో కుమారుడు శివ (32) గ్రామాల్లో తిరుగుతూ జాతకాలు చెప్పి పొట్టపోసుకుంటారు. ఇలా వరంగల్ వెళ్లిన దశరథరావు వడదెబ్బకు గురై ఆస్పత్రి పాలయ్యాడు. ఆయన కోసం వెళ్లిన కుమారుడు శివ కూడా ఎండదెబ్బకు గురయ్యాడు. కొద్ది గంటల వ్యవధిలోనే ఇద్దరూ మృతిచెందడంతో వారి కుటుంబం విషాదంలో మునిగిపోయింది. ఇక మేడ్చల్ జిల్లాలో ఒకరు, యాదాద్రి జిల్లా ఘట్కేసర్‌లో ఒక పశువుల కాపరి, కరీంనగర్ జిల్లాలో ఇద్దరు, హైదరాబాద్‌లో ఒకరు, ఆదిలాబాద్ జిల్లాలో ఒక రైతు, సూర్యాపేట జిల్లాలో ఇద్దరు మరణించారు.
నల్లమల.. విలవిల
ఎండల తీవ్రతకారణంగా వన్యప్రాణులూ విలవిల్లాడుతున్నాయి. అడవుల్లోని నీటి వనరులన్నీ ఎండిపోవడంతో మృత్యువాతపడుతున్నాయి. అడవుల నుంచి సమీపంలోని గ్రామాల్లోకి వచ్చి వేటగాళ్ల ఉచ్చులో చిక్కుకుంటున్నాయి. ముఖ్యంగా నల్లమల అటవీ ప్రాంతంలో పరిస్థితి తీవ్రంగా ఉంది. గత కొద్దిరోజుల్లోనే వందకుపైగా జింకలు మృత్యువాతపడినట్లు అంచనా. ఇటీవలే నాగర్‌కర్నూల్ జిల్లా బక్కాలింగాయపల్లిలో ఓ చిరుతపిల్ల నీటి కోసం వచ్చి వ్యవసాయ బావిలో పడింది. పాత మహబూబ్‌నగర్ జిల్లా పరిధిలోని ఉప్పునుంతల, లింగాల, కొల్లాపూర్, బల్మూర్, అమ్రాబాద్, పదర మండలాల పరిధిలో పెద్ద సంఖ్యలో మృతిచెందిన దుప్పులను అటవీ అధికారులు గుర్తించారు. అయితే ఈ అటవీ ప్రాంతంలో జంతువులకు తాగునీటి కోసం 109 నీటి నిల్వ సాసర్లను అటవీ శాఖ ఏర్పాటు చేసింది. కానీ వాటిలో నీటిని నింపే పరిస్థితి లేదు. ఇక అడవిలోని 120 చెంచు నివాస ప్రాంతాల్లోనూ నీటికి కటకట ఏర్పడింది. నీటి వనరులు ఎండిపోవడంతో చెలిమలు తవ్వుకుని.. కిలోమీటర్ల దూరం నుంచి తాగునీటిని తెచ్చుకుంటున్నారు. పాత ఆదిలాబాద్ జిల్లాలోని కవ్వాల్ అటవీ ప్రాంతంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. మరోవైపు జనగామ జిల్లా దేవరుప్పుల మండలం చిన్నమడూరుకు వలసవచ్చే సైబీరియన్ కొంగలు భానుడి ప్రతాపానికి బలవుతున్నాయి. వారం రోజులుగా ఎండ తీవ్రత పెరగడంతో రోజూ పెద్ద సంఖ్యలో మృత్యువాత పడుతున్నాయి.