సాక్షి, న్యూఢిల్లీ: వర్షాకాలం వచ్చినా.. వేసవి తాపం నుంచి భారత్ ఊరట పొందడం లేదు. రుతుపవనాలు ప్రవేశించినా కూడా పలు రాష్ట్రాల్లో ఇంకా తొలకరి పలకరింపు జరగలేదు. మరోవైపు కొన్ని రాష్ట్రాల్లో వడగాల్పులు తప్పవని హెచ్చరికలు జారీ చేసింది భారత వాతావరణ శాఖ.
ఒడిశా, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఆంధ్రప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, తెలంగాణ, తమిళనాడులో తీవ్ర నుంచి అతితీవ్ర వడగాల్పులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. అక్కడక్కడా వర్షాలు పడినప్పటికీ.. చాలావరకు ఆయా రాష్ట్రాల్లో అధిక ఉష్ణోగ్రతలే ఉంటాయని తెలిపింది. తెలుగు రాష్ట్రాలనైతే ఎండలు హడలెత్తిస్తున్నాయి.
ఏపీ విషయానికొస్తే.. దాదాపు 300 మండలాలకు వడగాల్పుల హెచ్చరికలు జారీ అయ్యాయి. 23 మండలాల్లో మరీ తీవ్రంగా ఉండొచ్చని అంచనా వేస్తోంది. పెద్దలు, పిల్లలు, అనారోగ్యంతో బాధపడేవాళ్లు.. అవసరమైతేనే బయటకు రావాలని, డీహైడ్రేషన్ నేపథ్యంలో దాహం వేయకున్నా నీరు తాగాలని వైద్య నిపుణులు సూచించారు. ఇక బాపట్ల, అల్లూరి, ఏలూరు, తూర్పు గోదావరి జిల్లాల్లో 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశాలున్నాయని అంచనా వేస్తోంది ఐఎండీ.
బిపర్‌జోయ్ తుపాను బలహీనపడడం, మరో 12 గంటలపాటు పరిస్థితి కొనసాగేలా కనిపిస్తుండడంతో.. రేపు సాయంత్రానికిగానీ, ఎల్లుండికిగానీ ఏపీలో రుతుపవనాల ప్రభావం కనిపించొచ్చని అంచనా వేస్తోంది వాతావరణ శాఖ.
ఇదీ చదవండి: జూన్ మూడోవారంలోనూ నిప్పుల కొలిమిలా తెలంగాణ
Comments
Please login to add a commentAdd a comment