
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు వేగంగా పెరుగుతున్నాయి. పలు ప్రాంతాల్లో సాధారణంకంటే 2 నుంచి 4 డిగ్రీ సెల్సియస్ అధికంగా నమోదవుతున్నాయి. రానున్న మూడు రోజులు ఇదే తరహాలో ఉష్ణోగ్రతలు (Temperatures) అధికంగా నమోదు కావొచ్చని వాతావరణ శాఖ సూచించింది. ఉత్తర తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో వడగాడ్పులు (Heat Wave) వీచే అవకాశముందని హెచ్చరించింది.
ఆదివారం రాష్ట్రంలో గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే... గరిష్ట ఉష్ణోగ్రత ఆదిలాబాద్‌లో 40.3 డిగ్రీ సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత మెదక్‌లో 19.2 డిగ్రీ సెల్సియస్‌గా నమోదైంది. ఆదిలాబాద్‌లో సాధారణం కంటే 3.4 డిగ్రీ సెల్సియస్ అధికంగా గరిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా, భద్రాచలం, హైదరాబాద్, ఖమ్మం, మహబూబ్‌నగర్‌లో 3 డిగ్రీల చొప్పున అధికంగా ఉష్ణోగ్రత నమోదైంది. కనిష్ట ఉష్ణోగ్రతలు సైతం చాలా ప్రాంతాల్లో 1 నుంచి 3 డిగ్రీలు అధికంగా నమోదయ్యాయి.
అధిక ఉష్ణోగ్రతల నుంచి ఉపశమనం పొందేందుకు ప్రజలు ఏసీలు, ఎయిర్ కూలర్లను ఆశ్రయిస్తున్నారు. దీంతో విద్యుత్ వినియోగం భారీగా పెరుగుతోందని అధికారులు చెబుతున్నారు. రానున్న మూడు రోజులు వడగాలులు వీచే అవకాశం ఉన్నందున్న.. అత్యవసరం అయితే తప్ప ప్రజలు బయటకు రావొద్దని అధికారులు హెచ్చరించారు. అటు ఆంధ్రప్రదేశ్‌లోనూ ఎండలు పెరగడంతో ఏపీ వాసులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
మండుతున్న ఎండలు... బోసిపోయిన రోడ్లు
రాష్ట్రంలో ఎండలు మండుతున్నాయి. ఎండల తీవ్రత కారణంగా ప్రజలు రోడ్లపైకి రావడం తగ్గించారు. ఎండ వేడిమికి తోడు వడగాలులు కూడా వీస్తుండటంతో ఆదివారం మధ్యాహ్నం హైదరాబాద్‌లో సచివాలయం వద్ద రోడ్లు ఇలా బోసిపోయి కనిపించాయి. మరో మూడు రోజుల పాటు అధిక ఉష్ణోగ్రతలు కొనసాగుతాయని వాతావరణ శాఖ వెల్లడించిన నేపథ్యంలో భాగ్యనగరవాసులకు మరింత ఉక్కపోత ఖాయంగా కనిపిస్తోంది.
21 నుంచి రెండు రోజులపాటు వర్షాలు
మండుతున్న ఎండలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న నగరవాసులకు వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. ఈ నెల 21 నుంచి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రెండు రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు (Rain) కురుస్తాయని పేర్కొంది. గత కొద్దిరోజులుగా దంచికొడుతున్న ఎండలకు ప్రజలు అల్లాడిపోతున్నారు. గత ఏడాదితో పోల్చితే ఈసారి ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి. ఈ సంవత్సరం ఫిబ్రవరిలోనే వేసవిని తలపించేలా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
చదవండి: RRR వరకు హెచ్‌ఎండీఏ విస్తరణతో డీటీసీపీకి బ్రేక్
Comments
Please login to add a commentAdd a comment