ఎండలకు గుండెపోటుతో చిన్నారి మృతి!
సాధారణంగా ఎవరికైనా హార్ట్ ఎటాక్ వచ్చిందంటే వాళ్ల వయసు కనీసం 40 ఏళ్లు దాటి ఉంటుందని అనుకుంటాం కదూ.. కానీ, మహారాష్ట్రలో 12 ఏళ్ల అమ్మాయి హార్ట్ ఎటాక్‌తో చనిపోయింది! అది కూడా ఎండ కారణంగానే. తన స్వగ్రామంలో ఇంటి నుంచి అర కిలోమీటరు దూరంలో ఉన్న నీటి పంపు వద్దకు నీళ్లు వస్తాయేమో, పట్టుకుందామని యోగితా దేశాయ్ (12) ఐదుసార్లు అటూ ఇటూ తిరిగింది.
గత కొన్ని రోజులుగా ఆమె డిసెంట్రీతో బాధపడుతోంది. అయినా, ఆమెనే నీళ్లు పట్టుకుని రమ్మని పంపారు. చివరకు ఐదోసారి వెళ్లినప్పుడు.. పంపు దగ్గరే ఆమె కుప్పకూలిపోయింది. వెంటనే వైద్యుల వద్దకు తీసుకెళ్తే.. ఆమె గుండెపోటు, డీహైడ్రేషన్ కారణంగా మరణించినట్లు చెప్పారు. మహారాష్ట్రలోని బీద్ జిల్లాలో గత మూడేళ్లుగా కరువు కరాళ నృత్యం చేస్తోంది. అక్కడ గరిష్ఠ ఉష్ణోగ్రత 42 డిగ్రీలుగా నమోదైంది.