పలు జిల్లాల్లో పంటలకు నష్టం
తడిసిన ధాన్యం.. రైతుల దైన్యం
పిడుగులు, ఈదురు గాలుల బీభత్సం
వర్షంతో స్తంభించిన జనజీవనం
సాక్షి నెట్‌వర్క్: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఆదివారం సాయంత్రం హఠాత్తుగా గాలివాన కురిసింది. వాతావరణం ఒక్కసారిగా చల్లబడి ఎండలతో అల్లాడుతున్న జనం సేదతీరినప్పటికీ.. వివిధ చోట్ల పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. కొనుగోలు కేంద్రాల్లో కుప్పలుగా పోసిన ధాన్యం అకాల వర్షానికి తడిసిపోయింది. కొన్ని చోట్ల ఇళ్లు కూలిపోగా, మరికొన్ని చోట్ల పైకప్పులు ఎగిరిపోయాయి. వరంగల్ జిల్లా చేర్యాల మండలంలో కురిసిన వర్షానికి ఆరు గ్రామాల్లో పంటలకు నష్టం వాటిల్లింది.
ఐనాపూర్‌లో మామిడికాయలు నేలరాలాయి. ఐకేపీ కొనుగొలు కేంద్రంలోని ధాన్యం తడిసి ముద్దయింది. అంగడిబజారులో ఓ పెద్ద చెట్టు, హోటల్ కోసం వేసిన ఇల్లు కూలి, ఒకరికి గాయాలయ్యాయి. వేణుగోపాలస్వామి ఆలయం ముందున్న వేపచెట్టు కూలడంతో ధ్వజస్తంభం విరిగిపోయింది. ఒక్క ఐనాపూర్ గ్రామంలోనే సుమారు 500 ఎకరాల్లో వరిపంట దెబ్బతిన్నది. తపాస్‌పల్లి, పోసానిపల్లి, గురువన్నపేట, నాగపూరి గ్రామాల్లోనూ వరి, మామిడి పంటలు దెబ్బతిన్నాయి. బచ్చన్నపేట మండలంలోనూ పంటలకు నష్టం వాటిల్లింది.
- కరీంనగర్ జిల్లాలో గాలివానతో పలుచోట్ల వడగళ్లు, పిడుగులు పడ్డాయి. మామిడి పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. ధర్మపురి మార్కెట్‌యార్డు, రాయపట్నం సిరిసిల్ల మండలం జిల్లెల్ల తదితర చోట్ల వందల క్వింటాళ్ల ధాన్యం తడిసింది. రాయికల్, బెజ్జంకి, కోహెడ, సారంగాపూర్, ఇల్లంతకుంట మండలాల్లో గాలివానకు రేకులషెడ్లు ఎగిరిపోయాయి. కరెంటు స్తంభాలు నేలకూలి, విద్యుత్ వైర్లు తెగిపడ్డాయి. బెజ్జంకి మండలం కల్లెపల్లిలో కోళ్లఫారం రేకులు ఎగిరిపోయి 3 వేల కోడిపిల్లలు మృత్యువాత పడ్డాయి. గొల్లపల్లి మండలం యశ్వంతరావుపేటలో పిడుగుపడి రైతు చిర్ర రాజయ్య(40) మరణించాడు. అరికిల్ల శంకరవ్వ, ఉరిమిట్ల లచ్చయ్య తీవ్రంగా గాయపడ్డారు.
- రంగారెడ్డి జిల్లాలో ఆదివారం సాయంత్రం ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడింది. పలుచోట్ల ఇళ్లు, పశువుల పాకలు దెబ్బతినగా.. చేతికొచ్చే దశలో ఉన్న మామిడికాయలు రాలిపడ్డాయి. వేగంగా వీచిన గాలులతో మేడ్చల్‌లో పిడుగుపాటుతో చెట్టుకొమ్మలు విరిగి పడ్డాయి. శామీర్‌పేటలో ఈదురుగాలుల బీభత్సంతో ప్రధాన రహదారుల్లో చెట్లు నేలకూలడంతో ట్రాఫిక్ సమస్య నెలకొంది. పశువుల పాక ధ్వంసం కావడంతో మూగ జీవాలతోపాటు యజమానికి గాయాలయ్యాయి. యాచారం మండలం నక్కర్తమేడిపల్లిలో పిడుగుపాటుకు సెంట్రింగ్ పనిచేసే శ్యామ్ (25) మృతి చెందాడు.
-మెదక్ జిల్లాలో అకాల వర్షం బీభత్సం సృష్టించింది. వర్షానికి ఈదురుగాలులు తోడై పలుచోట్ల ఆస్తి నష్టం వాటిల్లింది. తూఫ్రాన్‌లో కోళ్లఫారం ధ్వంసమై ఫారం మొత్తం నాశనమైంది. 8 వేల కోళ్లు మృత్యువాత పడగా రూ.25 లక్షల వరకు ఆస్తినష్టం వాటిల్లింది. గాలి ధాటికి రేకులు అర కిలోమీటరు దూరం మేర ఎగిరిపడ్డాయి. అక్కడ వాతావరణం భీతావహంగా మారింది. కాస యాదగిరి పదేళ్లుగా ఇక్కడ పది వేల సామర్థ్యం కలిగిన కోళ్లఫారం నడుపుతూ జీవనోపాధి పొందుతున్నాడు. వర్షం దెబ్బకు 8 వేల కోళ్లకు కోల్పోయి రోడ్డున పడ్డాడు. బలంగా వీచిన గాలులకు పలుచోట్ల పిందె దశలో ఉన్న మామిడికాయలు నేలరాలాయి. దౌల్తాబాద్, తొగుట ప్రాంతాల్లో వడగళ్లు పడ్డాయి. కొన్ని ప్రాంతాల్లో చెట్లు వేళ్లతో సహా నేలకూలాయి. జగదేవ్‌పూర్ మండలం మాందాపూర్‌లో పిడుగు పడి ఎద్దు, మేక మృతి చెందాయి. పశువుల కొట్టంలో పడుకున్న ఎద్దు పడుకున్నట్టే కాలిపోయింది. దౌల్తాబాద్ మండలం రాంసాగర్‌లో పిడుగు పడి పశువుల కాపరి గాయపడ్డాడు.
- ఆదిలాబాద్ జిల్లాలోని కెరమెరి, లక్సెట్టిపేట మండలాల్లో ఆదివారం వర్షం కురిసింది. ఈదురుగాలతో రహదారులపై చెట్లు విరిగి పడ్డారుు. రాకపోకలకు అంతరాయం కలిగింది. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని కాపాడుకునేందుకు రైతులు ఇబ్బందులు పడ్డారు. కొన్నిచోట్ల ఇళ్లలోకి వరదనీరు చేరి, జనజీవనం అస్తవ్యస్తమైంది.
- మహబూబ్‌నగర్ జిల్లా లింగాల మండల కేంద్రంలో జరుగుతున్న జాతరలో ఈదురుగాలులకు గుడారాలు కూలి పోయాయి. కల్వకుర్తి మండలంలోని లింగసానిపల్లి గ్రామానికి చెందిన పుట్టోజు మాధవాచారి వ్యవసాయ పొలంలో ఏర్పాటు చేసిన పాలీహౌస్ కూలిపోయి రూ.70 లక్షల ఆస్తినష్టం సంభవించింది. కేశంపేట మండలలోని వేముల చింతకింది రామయ్యకు చెందిన 16 మేకలు పిడుగుపాటు చనిపోయాయి. లక్షల్లో ఆస్తినష్టం వాటిల్లిందని బాధితుడు వాపోయాడు. కొందుర్గు మండలం అయోధ్యపూర్ తండాల్లో ఓ లేగదూడ చనిపోయింది. కొత్తూరు మండల కేంద్రంలోని వినాయకస్టీల్ పరిశ్రమలో మెకానికల్ ఆపరేటర్ నబీ (45) (ఏపీలోని కర్నూలు వాసి) విధులు ముగించుకుని బైకుపై వెళుతుండగా పిడుగుపడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.
రాజధానిలో తేలికపాటి జల్లులు
మండుటెండలతో సతమతమైన రాజధాని హైదరాబాద్ వాసులకు ఆదివారం చల్లటి జల్లులు పలకరించడంతో స్వల్పంగా ఉపశమనం పొందారు. ఆదివారం మధ్యాహ్నం వరకు 42.2 డిగ్రీల మేర గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవడంతో మండుటెండ చుర్రు మనిపించగా.. సాయంత్రం ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన చిరుజల్లులు కురిశాయి. క్యుములోనింబస్ మేఘాల ప్రభావంతో అక్కడక్కడా జల్లులు కురిసినట్లు బేగంపేటలోని వాతావరణ శాఖ తెలిపింది.
రానున్న 24 గంటల్లో అక్కడక్కడా జల్లులు కురిసే అవకాశాలున్నాయని, ఉష్ణోగ్రతల్లో స్వల్ప హెచ్చు తగ్గులుంటాయని ప్రకటించింది. ఈదురుగాలుల ప్రభావంతో పలు ప్రాంతాల్లో చెట్లు నేలకొరిగాయి. చెట్టుకొమ్మలు విరిగిపడడంతో వాహనాలు ధ్వంసం అయ్యాయి. విద్యుత్ స్తంభాలు కూలిపోవడం, వైర్లు తెగడంతో వంద ఫీడర్ల పరిధిలో దాదాపు గంటసేపు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.