హైదరాబాద్ లో ఆకాశ మార్గాలు
* రాజధానిలో ఎలివేటెడ్ కారిడార్లకు ప్రతిపాదన
సాక్షి, హైదరాబాద్: రాజధానిలోని రహదారులకు మహర్దశ పట్టనుంది. ట్యాంక్‌బండ్ చుట్టూ నింగినంటే సౌధాలను నిర్మించి హైదరాబాద్ ప్రతిష్టను విశ్వవ్యాప్తం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసిన రాష్ర్ట ప్రభుత్వం.. నగరం నలువైపులా రహదారుల అభివృద్ధిపై కూడా దృష్టి సారించింది. రాజధాని నుంచి మూడు ప్రధాన మార్గాల్లోని ఔటర్ రింగురోడ్డు(ఓఆర్‌ఆర్)లను కలిపేవిధంగా ఎలివేటెడ్ కారిడార్‌లను నిర్మించేం దుకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధంచేశారు.
ఉప్పల్ రింగురోడ్డు నుంచి ఘట్‌కేసర్ ఓఆర్‌ఆర్ వరకు 20 కిలోమీటర్లు, బాలానగర్ చౌరస్తా నుంచి నర్సాపూర్ మార్గంలో ఔటర్ వరకు 20 కిలోమీటర్లు, పరేడ్ గ్రౌండ్స్ నుంచి బొల్లారం మీదుగా శామీర్‌పేట్ ఔటర్ రోడ్డు వరకు 18 కిలోమీటర్ల మేర ఎలివేటెడ్ హైవేలను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలను రూపొందించారు. ఈ ప్రతిపాదనలకు ప్రభుత్వం నుంచి అనుమతి లభించిన వెంటనే సమగ్ర ప్రాజెక్టు నివేదికల కోసం అర్హతగల కన్సల్టెన్సీ సంస్థల నుంచి టెండర్లను ఆహ్వానించనున్నట్లు జాతీయ రహదారుల విభాగం ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’తో చెప్పారు.
ఈ మూడు మార్గాల్లో ఎలివేటెడ్ హైవేల నిర్మాణాల కోసం సర్వే నిర్వహించడంతో పాటు, డిజైన్ల రూపకల్పన, నిర్మాణ అంచనాలు తదితర అంశాలతో కన్సల్టెన్సీల నుంచి నివేదికలు కోరుతారు. ఇందుకోసం ఒక్కో మార్గానికి రెండు నుంచి నాలుగు కోట్ల రూపాయల వరకు వెచ్చించనున్నారు. రెండేళ్లలోనే రహదారులు అందుబాటులోకి వచ్చే విధంగాప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలిసింది.
వాహనదారులకు ఊరట..
ఈ మూడు ప్రధాన మార్గాల్లో నిత్యం లక్షలాది వాహనాలు తిరుగుతుంటాయి. ఉప్పల్-ఘట్‌కేసర్ మార్గంలో వాహనాల రద్దీ నరకప్రాయంగా మారింది. వరంగల్, హన్మకొండ నుంచి వచ్చే వాహనాలు ట్రాఫిక్‌లో గంటల తరబడి చిక్కుకొనిపోతున్నాయి. వరంగల్ నుంచి ఘట్‌కేసర్ వరకు గంటన్నర వ్యవధిలో చేరుకుంటే, అక్కడి నుంచి ఉప్పల్‌కు వచ్చేందుకే మరో గంటన్నరకుపైగా పడుతోంది. మరోవైపు ఉప్పల్ నల్లచెరువు నుంచి రింగురోడ్డు వరకు ఉన్న ఇరుకైన రహదారి వల్ల, మెట్రో నిర్మాణ పనుల దృష్ట్యా ట్రాఫిక్ స్తంభించిపోతోంది. ఈ మార్గంలో ఎలివేటెడ్ హైవే నిర్మాణం వల్ల ఘట్‌కేసర్ ఔటర్ రింగు రోడ్డు నుంచి నేరుగా ఉప్పల్ రింగ్‌రోడ్డుకు చేరుకోవచ్చు. ఎలాంటి ట్రాఫిక్ రద్దీ లేకుండా కొద్ది నిమిషాల్లోనే ప్రయాణించవచ్చు.
అలాగే ఎలివేటెడ్ హైవే వల్ల మేడిపల్లి, బోడుప్పల్, ఉప్పల్ ప్రాంతాల్లో సగానికిపైగా రద్దీ తగ్గే అవకాశం ఉంటుంది. అయితే ప్రస్తుతమున్న మెట్రో మార్గాన్ని భవిష్యత్తులో ఘట్‌కేసర్ వరకు పొడిగించాలని ప్రభుత్వం భావిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎలివేటెడ్ హైవే నిర్మాణం వల్ల మెట్రో నిర్మాణం సాధ్యం కాకపోవచ్చుననే అభిప్రాయం వినిపిస్తోంది.
ఎలివేటెడ్ హైవే ఎత్తు కంటే ఎక్కువ ఎత్తులో మెట్రో నిర్మాణం సాధ్యమవుతుందా అనే సందేహం వ్యక్తమవుతోంది. పైగా కోట్లాది రూపాయల అదనపు భారం తప్పదని నిపుణులు పేర్కొంటున్నారు. ఇక నిత్యం రద్దీగా ఉండే రాజీవ్ రహదారి మార్గంలోనూ, నర్సాపూర్ మార్గంలోనూ ఎలివేటెడ్ రహదారుల నిర్మాణం వల్ల మెదక్, సిద్దిపేట్, కరీంనగర్ తదితర ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలకు ట్రాఫిక్ తిప్పలు తప్పుతాయి.