ఔటర్ రింగ్ రోడ్డుపై పిన్నమనేని సత్యవాణి మృతదేహం
- రెయిలింగ్‌ను ఢీకొన్న ఆప్కాబ్ చైర్మన్ పిన్నమనేని కారు
- ఆయన భార్య, కారు డ్రైవర్ మృతి
- సీట్‌బెల్ట్ ధరించడంతో గాయాలతో బయటపడ్డ వెంకటేశ్వరరావు.. అపోలోలోచికిత్స
- ఈ ఘటనకు 3 గంటల ముందు మరో ప్రమాదం.. ఓ మహిళ మృతి
- రెండు ప్రమాదాలకు అతివేగం, నిర్లక్ష్యమే కారణమన్న పోలీసులు
హైదరాబాద్: నగర శివార్లలోని ఔటర్ రింగ్ రోడ్డు నిత్యం నెత్తురోడుతోంది. మూడు గంటల వ్యవధిలో జరిగిన రెండు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఆప్కాబ్ చైర్మన్, మాజీ మంత్రి పిన్నమనేని వెంకటేశ్వరరావు ప్రయాణిస్తున్న కారు రెయిలింగ్(క్రాష్ బ్యారియర్)ను ఢీ కొని బోల్తా కొట్టిన ఘటనలో ఆయన భార్య సాహిత్యవాణి(52), డ్రైవర్ స్వామిదాసు(40) అక్కడికక్కడే కన్నుమూశారు. సీట్‌బెల్ట్ ధరించడం వల్ల గాయాలతో బయటపడిన వెంకటేశ్వరరావు ప్రస్తుతం అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనకు మూడు గంటల ముందు కూడా ఔటర్‌పై జరిగిన మరో ప్రమాదంలో సౌతాఫ్రికాలో అకౌంటెంట్‌గా పనిచేస్తున్న వాసు భార్య మాధురి చనిపోయారు. ఈ రెండు ప్రమాదాలకూ అతివేగం, నిర్లక్ష్యమే కారణమని పోలీసులు చెప్తున్నారు.
ఊడిన చక్రం.. పల్టీలు కొట్టిన కారు..
పిన్నమనేని సోమవారం తన భార్యతో కలసి అధికారిక వాహనమైన మిత్సుబిషి పజేరో స్పోర్ట్(ఏపీ16డీసీ0555)లో విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తున్నారు. వాహనాన్ని ఆయన డ్రైవర్ స్వామిదాస్ నడుపుతుండగా ముందు సీట్లో పిన్నమనేని, వెనుక సీట్లో భార్య కూర్చున్నారు. పిన్నమనేని సీట్ బెల్ట్ ధరించగా.. సాహిత్యవాణి, స్వామిదాస్ ధరించలేదు. సోమవారం రాత్రి సుమారు 11.40 గంటల సమయంలో వీరి వాహనం రింగ్ రోడ్డుపై ఉంది. ఔటర్‌పై గరిష్ట పరిమితి వేగం గంటకు 120 కిలోమీటర్లు. అయితే స్వామిదాస్ ఆ వేగాన్ని మించి పోవడాన్ని గమనించిన పిన్నమనేని రెండు, మూడుసార్లు మందలించారు. ఆయన చెప్పినప్పుడు వేగం తగ్గిస్తున్న డ్రైవర్ కొద్దిసేపటికే మళ్లీ పుంజుకోవడం మొదలెట్టాడు.
వాహనం మంఖాల్ వద్దకు రాగానే డ్రైవర్ నిద్రమత్తులో జోగడం, వాహనం గంటకు 120 కిమీ కంటే ఎక్కువ వేగంతో ఉండటంతో ఔటర్ కార్నర్ వద్ద రెయిలింగ్‌ను ఢీ కొంది. ఈ ధాటికి ముందు చక్రం ఊడిపోవడంతో కారు పల్టీలు కొట్టింది. దీంతో సీట్ బెల్ట్ పెట్టుకోని సాహిత్యవాణి, స్వామిదాస్ వాహనం నుంచి ఎగిరి కిందపడ్డారు. బలంగా రోడ్డును తాకడంతో ఇరువురూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సీట్ బెల్ట్ పెట్టుకున్న వెంకటేశ్వరరావు గాయాలతో కారులోనే ఉండిపోయారు.
ప్రమాదాన్ని గుర్తించిన ఇతర వాహనచోదకులు పహాడీషరీఫ్ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి చేరుకొని పిన్నమనేనిని శంషాబాద్‌లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. వెంకట్వేరరావును మెరుగైన వైద్యం కోసం జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రికి తీసుకెళ్లారు. పిన్నమనేని విజయవాడ నుంచి తన కారులో తీసుకొచ్చిన మామిడికాయలు, ఆవకాయ పచ్చడి, పాలడబ్బా తదితరాలు ఘటనాస్థలిలో చెల్లాచెదురుగా పడ్డాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పహాడీషరీఫ్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
పిన్నమనేని సతీమణి మృతి పట్ల జగన్ సంతాపం
- ఆప్కాబ్ చైర్మన్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష
సాక్షి, హైదరాబాద్: రోడ్డు ప్రమాదంలో ఆప్కాబ్ చైర్మన్ పిన్నమనేని వెంకటేశ్వరరావు సతీమణి సాహిత్యవాణి మృతి చెందడం పట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో కారుడ్రైవర్ కూడా మృతి చెందడం పట్ల ఆయన తీవ్ర విచారం వెలిబుచ్చారు. మృతుల కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ప్రమాదంలో గాయపడిన పిన్నమనేని వెంకటేశ్వరరావు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు.
మరో ప్రమాదంలో మహిళ మృతి..
ఔటర్‌పై పిన్నమనేని వాహనానికి ప్రమాదం జరగడానికి మూడు గంటల ముందు మరో ప్రమాదం జరిగింది. రంగారెడ్డి జిల్లా నాగారం నివాసి వాసు దక్షిణాఫ్రికాలో అకౌంటెంట్. ఆయన మంగళవారం తెల్లవారుజామున శంషాబాద్ విమానాశ్రయం నుంచి సౌతాఫ్రికా వెళ్లాల్సి ఉంది. సోమవారం రాత్రి భార్య మాధురి(34), కుమార్తెలు ధరిణి ప్రియ, నందిని, బంధువు శ్రీనివాస్‌తో కలసి కారు(ఏపీ11జే3495)లో బయలుదేరారు.
ఔటర్‌పై ప్రయాణిస్తున్న వీరి వాహనం రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో తుక్కుగూడ వద్దకు చేరుకుంది. విమానాశ్రయానికి వెళ్లడానికి తుక్కుగూడ వద్ద ఔటర్ దిగాల్సి ఉండగా.. వీరి వాహనం కాస్త ముందుకు వెళ్లింది. డ్రైవింగ్ సీట్‌లో ఉన్న శ్రీనివాస్ దీన్ని గమనించి వాహనాన్ని రోడ్డు మధ్య నుంచి రివర్స్ గేర్‌లో వెనక్కి తిప్పుతుండగా.. వెనుక నుంచి వేగంగా వచ్చిన మరో వాహనం(టీఎస్10యూఏ3306) వీరి కారును ఢీ కొంది. దీంతో ముందుసీట్లో కూర్చున్న మాధురి అక్కడికక్కడే చనిపోగా.. మిగిలిన వారికి తీవ్ర గాయాలయ్యాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.