‘సైక్లింగ్’ రూట్ మారింది...
ఔటర్ ‘సైక్లింగ్ ట్రాక్’పై సర్కార్ పునరాలోచన
గచ్చిబౌలి-శంషాబాద్ మార్గంపై మొగ్గు
డీపీఆర్ రూపొందిస్తున్న హెచ్‌ఎండీఏ
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ మహానగరంలో అంతర్జాతీయ స్థాయి సైక్లింగ్ ట్రాక్ రూపకల్పనను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. తొలుత ఘట్‌కేసర్ నుంచి శామీర్‌పేట వరకు ఔటర్ రింగ్‌రోడ్డు వెంట నిర్మించాలనుకున్న మార్గాన్ని మారుస్తూ గచ్చిబౌలి- శంషాబాద్ ఔటర్ మార్గంలో సైక్లింగ్ ట్రాక్‌ను అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. ఈ మార్గంలో సైక్లింగ్ ట్రాక్ నిర్మాణానికి సాంకేతికంగా ఏవైనా ఇబ్బందులెదురయ్యే పరిస్థితి ఉంటే... గచ్చిబౌలి-పటాన్‌చెరు మార్గంలో ఔటర్ వెంట ట్రాక్‌ను నిర్మించాలని మంత్రి కేటీఆర్ హెచ్‌ఎండీఏను ఆదేశించారు. అంతర్జాతీయ పోటీల నిర్వహణకు అనువుగా ట్రాక్‌ను తీర్చిదిద్దాలని హెచ్‌ఎండీఏ కమిషనర్ టి.చిరంజీవులుకు సూచించారు. రాబోయే 100 రోజుల్లో ఈ ప్రాజెక్టును పూర్తిచేసి అందుబాటులోకి తేవాలని మంత్రి గడువు నిర్దేశించారు.
ఇక్కడ ఎలా..?
ఔటర్ రింగ్‌రోడ్డుకు ఇరువైపులా మెయిన్ కారేజ్ వేకు- సర్వీసు రోడ్‌కు మధ్యలో 25 మీటర్ల వెడల్పులో రైల్వే కారిడార్ కోసం 158 కి.మీ. మేర హెచ్‌ఎండీఏ స్థలం కేటాయించింది. ప్రస్తుతం గచ్చిబౌలి-శంషాబాద్, లేదా గచ్చిబౌలి-పటాన్‌చెరు మార్గంలో ఔటర్ వెంట సైక్లింగ్ ట్రాక్‌ను నిర్మించేందుకు అధికారులు నిర్ణయించారు. అయితే... ఈ మార్గంలో అనేక అవాంతరాలు ఎదురవ్వనున్నాయి. ప్రధానంగా కల్వర్టులు, రోడ్ అండర్ పాస్‌లు, రైల్వే ట్రాక్/బ్రిడ్జి వంటివి సైక్లింగ్ ట్రాక్ నిర్మాణానికి అడ్డువస్తాయి. ఇలాంటి ప్రాంతాల్లో సైక్లింగ్ ట్రాక్ నిర్మాణం ఎలా చేపడతారన్నది అందరిలో ఉదయిస్తోన్న ప్రశ్న. సుమారు 12-15 కి.మీ. మేర సైక్లింగ్ ట్రాక్‌ను అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించేందుకు ఎంత నిధులు అవసరం.. దీన్ని పూర్తి చేసేందుకు ఎన్ని నెలలు సమయం పడుతుంది..? తదితర అంశాలపై ఇంజనీరింగ్ అధికారులు డీపీఆర్‌ను రూపొందించేందుకు సన్నద్ధమయ్యారు. సైక్లింగ్ ట్రాక్ ను తొలిదశలో గచ్చిబౌలి-శంషాబాద్ మార్గంలో నిర్మిస్తే మలిదశలో ఏ ప్రాంతంలో నిర్మించేందుకు అనువుగా ఉంటుందన్న దానిపైనా అధికారులు సర్వే నిర్వహిస్తున్నారు.