సాక్షి, ముంబై: ప్రతిపాదిత ఓవల్‌మైదాన్-చర్చ్‌గేట్-విరార్ ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టులో రైల్వే మంత్రిత్వశాఖ ఇటీవల స్వల్పమార్పులు చేసింది. ప్రయాణికుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని విరార్‌లోనే విరార్ సౌత్, విరార్ నార్త్ రెండు స్టేషన్లను నిర్మించనున్నారు. ఈ స్టేషన్ల మధ్య దూరం రెండు కిలోమీటర్లు ఉంటుందని సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. విరార్ సౌత్ స్టేషన్‌ను కొత్తగా నిర్మిస్తున్న కార్‌షెడ్ వద్ద నిర్మించాలని భావిస్తుండగా, విరార్ నార్త్ స్టేషన్‌ను ప్రస్తుతమున్న విరార్ స్టేషన్‌కు కిలోమీటర్ దూరంలో నిర్మించనున్నారు. అంతేగాకుండా మహాలక్ష్మీ, విలేపార్లేలో కూడా స్టేషన్లను నిర్మించాలని మంత్రిత్వశాఖ నిర్ణయించింది. మహాలక్ష్మీ స్టేషన్ పరిసరాల్లో వివిధ ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, వ్యాపారసంస్థలు ఉండడంతో వచ్చిపోయే వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటుంది. దీనిని పరిగణనలోకి తీసుకున్న మంత్రిత్వశాఖ ఈ మేరకు నిర్ణయం తీసుకుందని సంబంధిత అధికారి తెలిపారు.
అయితే విలేపార్లే ఎయిర్ పోర్ట్ ప్రాంతంలో ఉండడంతో ఇక్కడ ఈ కారిడార్ నిర్మించడాన్ని నిషేధించారని, దీంతో ఇక్కడ భూగర్భ మార్గం నిర్మించి, స్టేషన్‌ను ఏర్పాటు చేయనున్నారని చెప్పారు. ఫలితంగా ఇయిర్ పోర్టు నుంచి వచ్చే ప్రయాణికులకు కూడా ఈ కారిడార్ సౌకర్యవంతంగా ఉంటుందని, దీంతో ఈ ఎలివేటెడ్ రైలును వీరు కూడా ఉపయోగించుకోవచ్చన్నారు. ఈ కారిడార్ ఏర్పాటుతో విలేపార్టే ప్రాంతం కూడా గొప్ప వ్యాపార కేంద్రంగా అభివృద్ధి చెందనుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక మీరారోడ్‌లో ఈ కారిడార్ డిపోను ఏర్పాటు చేసే ప్రతిపాదన ఉన్నప్పటికీ ఇక్కడ చట్టపరమైన అడ్డంకులు ఉన్నాయని అధికారుల పరిశీలనలో తేలింది.. దీంతో రైల్వే బోర్డు ఈ డిపోను నాయ్‌గావ్ స్టేషన్ వద్ద నిర్మించే ఆలోచన చేస్తోంది. ఈ కారిడార్ నిర్మాణం కోసం రూ.20 వేల కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేయగా ఇందులో ప్రణాళిక సంఘం రూ.1,240 కోట్లు భరించనుంది. ఈ మోత్తాన్ని కారిడార్ నిర్మాణానికి అడ్డు వచ్చే కట్టడాలు, భూగర్భంలో ఉన్న వివిధ సంస్థల కేబుళ్లు, పైప్‌లైన్లు తొలగించడానికి ఉపయోగించనున్నారు. ఈ పనులను బీఎంసీ, టాటా పవర్ రిలయన్స్, ఎంటీఎన్‌ఎల్, బీఎస్‌ఎన్‌ఎల్, మహానగర్ గ్యాస్, తదితర 12 ఏజెన్సీలు చేపట్టనున్నాయి.
ఓవల్‌మైదాన్-చర్చ్‌గేట్-విరార్ ఎలివేటెడ్ కారిడార్‌లో మార్పులు
Published Thu, Oct 31 2013 12:34 AM | Last Updated on Sat, Sep 2 2017 12:08 AM
Advertisement
Advertisement