కృష్ణపట్నంపై మళ్లీ మొదటికి..
- విద్యుత్ ఉత్పత్తిపై మాట మార్చిన ఏపీ
- ప్రాజెక్టులో విజయవంతమైన వాణిజ్య ఉత్పత్తి
- బొగ్గు నిల్వలు లేవంటూ ప్లాంట్ షట్‌డౌన్ చేసిన ఏపీ
- కేంద్రం జోక్యం కోరిన తెలంగాణ సర్కారు
సాక్షి, హైదరాబాద్: కృష్ణపట్నం విద్యుత్‌పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మళ్లీ మాట మార్చింది. ఇంతకాలం ప్రయోగాత్మక ఉత్పత్తి అంటూ ప్రాజెక్టులోని మొత్తం విద్యుత్‌ను వాడుకుంటూ వచ్చిన ఆ రాష్ట్రం. తాజాగా వాణిజ్యోత్పత్తి ప్రారంభమైనా, బొగ్గు నిల్వలు లేవంటూ ప్లాంటును షట్‌డౌన్ చేసిం ది. వాటా ప్రకారం న్యాయంగా రావాల్సి న విద్యుత్‌ను పంపిణీ చేయాలని పట్టుపడుతున్న తెలంగాణకు మరోసారి మొండిచేయి చూపింది.
నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నం విద్యుత్ కేంద్రంలో తొలి యూనిట్ ద్వారా బుధవారం అధికారికంగా వాణిజ్య ఉత్పత్తి (సీవోడీ) ప్రారంభమైంది. నిబంధనల ప్రకారం 72 గంటల పాటు నిర్విరామంగా ప్లాంట్‌ను నడిపి... విజయవంతంగా సీవోడీ ప్రక్రియను ఏపీ జెన్‌కో పూర్తి చేసింది. 800 మెగావాట్ల సామర్థ్యం గల ఈ యూనిట్ నుంచి రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం 53.89 శాతం విద్యుత్ తెలంగాణకు, 46.21 శాతం ఏపీకి పంపిణీ చేయాలి. అధికారిక ఉత్పత్తి ప్రారంభం కావడంతో.. అందులోంచి తమకు రావాల్సిన వాటా అందుతుందని టీజెన్‌కో, రాష్ట్ర సర్కారు ఎదురుచూశాయి.
కానీ వాణిజ్య ఉత్పత్తి ప్రారంభించిన రోజునే.. బొగ్గు కొరత పేరు చెప్తూ కృష్ణపట్నం తొలి యూనిట్‌ను ఏపీ జెన్‌కో షట్‌డౌన్ చేయడంతో వివాదం మళ్లీ మొదటికి వచ్చింది. ‘సీవోడీ విజయవంతంగా పూర్తయింది. తర్వాత అరగంట సేపు ప్లాంటు నడిచింది. బొగ్గు కొరత కారణంగా యూనిట్‌ను షట్‌డౌన్ చేయాల్సి వచ్చింది. ఈ ప్లాంటుకు మహానది కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ నుంచి నెలకు నాలుగు లక్షల టన్నుల బొగ్గు అందాలి. కానీ రెండు లక్షల టన్నులే అందింది. బొగ్గు లేని కారణంగా ప్లాంట్‌ను షట్‌డౌన్ చేయడం అనివార్యమైంది..’ అని ఏపీ జెన్‌కో వర్గాలు వెల్లడించాయి. దీంతో కృష్ణపట్నం విద్యుత్ వస్తుందని ఆశపడిన తెలంగాణ సర్కారు మళ్లీ భంగపడింది.
కావాలనే..!
వాస్తవానికి గత ఏడాది ఏప్రిల్‌లోనే కృష్ణపట్నంలో విద్యుత్ ఉత్పత్తి మొదలైంది. కానీ ఇంతకాలం ట్రయల్న్,ర ఇన్‌ఫర్మ్‌పవర్ పేరుతో ఉత్పత్తి చేసిన విద్యుత్‌ను గ్రిడ్‌కు షెడ్యూల్ చేయకుండా ఏపీనే వినియోగించుకుంది. విద్యుత్ ఇవ్వాలంటూ తెలంగాణ ప్రభుత్వం ఒత్తిడి చేసినప్పటికీ, కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసినప్పటికీ ప్రయోగాత్మక విద్యుత్ అంటూ పంపిణీకి నిరాకరించింది.
వాణిజ్య ఉత్పత్తి ప్రారంభమయ్యాక ఒప్పందాలు అమల్లోకి వస్తాయని గత నెలలో జరిగిన కృష్ణపట్నం పాలకమండలి సమావేశంలో ఏపీ జెన్‌కో అధికారులు ప్రకటించారు. తీరా వాణిజ్య ఉత్పత్తిని ప్రారంభించిన రోజునే షట్‌డౌన్ చేయటం అంటే.. తెలంగాణకు విద్యుత్ పంపిణీ చేయకుండా అడ్డుకోవడమేనని ఇక్కడి అధికారులు అంటున్నారు.
ప్రస్తుతం ఏపీలో ఆ రాష్ట్ర అవసరాలకు సరిపడా విద్యుత్ అందుబాటులో ఉంది. అందువల్ల కృష్ణపట్నం ప్లాంట్‌ను షట్‌డౌన్ చేసినా వారికి నష్టమేమీ లేదు. కానీ తీవ్ర విద్యుత్ కొరతను ఎదుర్కొంటున్న తెలంగాణను మరింత చిక్కుల్లోకి నెట్టేయాలనే ఏపీ సర్కారు ఈ కుట్రకు పాల్పడిందని తెలంగాణ జెన్‌కో అధికారులు పేర్కొంటున్నారు. ఈ వ్యవహారంపై జోక్యం చేసుకోవాలని సీఎం కేసీఆర్ కేంద్రాన్ని కోరారని, సీఎం తన ఢిల్లీ పర్యటనలోనూ ఈ విషయాన్ని ప్రధానంగా ప్రస్తావించే అవకాశముందని వారు తెలిపారు.