
క్షతగాత్రుడికి చెక్కును అందజేస్తున్న ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి
తిరుపతి తుడా/చంద్రగిరి: బస్సు ప్రమాద ఘటన మృతుల కుటుంబాలు, క్షతగాత్రులకు ప్రభుత్వం అండగా నిలిచింది. చిత్తూరు జిల్లా భాకరాపేట ఘాట్‌లో జరిగిన బస్సు ప్రమాదంలో మృతి చెందిన పదిమంది బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తరఫున ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి బుధవారం రూ.2లక్షల చొప్పున ధర్మవరంలో చెక్కులను అందజేయగా.. తిరుపతిలోని 8 ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న 42 మంది క్షతగాత్రులకు అక్కడే రూ.50వేల చొప్పున చెక్కులను అందజేశారు. మృతుల కుటుంబాలకు మొత్తం రూ.20 లక్షలు, క్షతగాత్రులకు రూ.21 లక్షల సాయం ప్రభుత్వం తరఫున అందింది.
డ్రైవర్ నిర్లక్ష్యంతోనే ప్రమాదం..
డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే భాకరాపేట లోయలో బస్సు ప్రమాదం చోటు చేసుకుందని రోడ్ సేఫ్టీ అడిషనల్ డీజీపీ కృపానంద త్రిపాఠి ఉజేల స్పష్టం చేశారు. బుధవారం ఆయన భాకరాపేట కనుమలోని ప్రమాద స్థలాన్ని అర్బన్ ఎస్పీ వెంకటప్పలనాయుడుతో కలసి పరిశీలించారు. అతికష్టం మీద రోప్ సాయంతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదం జరిగిన ప్రాంతంతో పాటు బస్సును పరిశీలించి పలు ఫొటోలను తన సెల్‌ఫోన్‌లో చిత్రీకరించారు. కనుమలో ప్రమాదాలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment