bhakarapeta
-
కారులో ముగ్గురు సజీవ దహనం
మార్కాపురం/భాకరాపేట: ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలో మంగళవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తిరుపతి జిల్లా చిన్నగొట్టిగల్లు మండలం భాకరాపేటకు చెందిన ముగ్గురు యువకులు సజీవదహనం అయ్యారు. టైరు పేలి అదుపు తప్పిన కారు.. కంటైనర్ లారీని ఢీకొనడంతో స్నేహితులు సాకిరి బాలాజీ (21), పటాన్ ఇమ్రాన్‌ఖాన్ (21), రావూరి తేజ (29) నిలువునా కాలిపోయారు. తేజ పాస్‌పోర్ట్ పనిమీద ముగ్గురు విజయవాడ వెళ్లారని, తిరుగు ప్రయాణంలో ఈ ఘోరం జరిగిందని భావిస్తున్నారు. కంభం వైపు నుంచి మార్కాపురం వైపు వస్తున్న ఏపీ39 డీఈ 6450 నంబరు కారు తిప్పాయపాలెం–జంగంగుంట్ల మధ్య మిట్టమీదిపల్లి అడ్డరోడ్డు వద్దకు రాగానే టైరు పేలిపోయింది. దీంతో కుడివైపు మార్కాపురం నుంచి కంభం వైపు వెళుతున్న కేఏ14 సీ 2949 నంబరు కంటైనర్ లారీని ఢీకొంది. కారులో ఉన్న పెట్రోల్ ట్యాంక్‌కు మంటలు అంటుకోవడంతో అందులోని ముగ్గురు సజీవ దహనమయ్యారు. మంటలు ఎగిసిపడుతుండటంతో కారు వద్దకు వెళ్లేందుకు ఎవరూ సాహసించలేదు. డీఎస్పీ డాక్టర్ కిశోర్‌కుమార్, సీఐ ఆంజనేయరెడ్డి సమాచారం ఇవ్వడంతో వచ్చిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. కారు నంబరు ఆధారంగా యజమాని చిత్తూరు జిల్లా రొంపిచెర్ల మండలం మోటుమల్లెలపాలెం పోస్టు, ఆదినారాయణవారిపల్లికి చెందిన ఈటెలమర్రి నరేంద్రగా గుర్తించి పోలీసులు అతడికి సమాచారమిచ్చారు. తాను కారును బాడుగకు ఇచ్చానని నరేంద్ర పోలీసులకు తెలిపారు. దీంతో డ్రైవర్ రావూరు తేజ అయి ఉండవచ్చని అనుమానించిన పోలీసులు వివరాలు సేకరించారు. మూడు కుటుంబాల్లో విషాదం భాకరాపేటకు చెందిన సాకిరి బాలాజీ, పటాన్ ఇమ్రాన్‌ఖాన్, రావూరి తేజ స్నేహితులు. వీరు ముగ్గురు ఎక్కడికెళ్లారో తమకు తెలియదని తల్లిదండ్రులు చెబుతున్నారు. స్నేహితులు మాత్రం త్వరలో గల్ఫ్‌కు వెళ్లాలనుకుంటున్న రావూరి తేజ పాస్‌పోర్ట్ పనిమీద విజయవాడ వెళ్లారని చెబుతున్నారు. బాలాజీ తండ్రి సత్యనారాయణ, తల్లి ఇంద్ర టీటీడీలో పనిచేసి రిటైరయ్యారు. వీరికి ఇద్దరు కుమారులు కాగా.. మృతుడు పెద్ద కుమారుడు. పటాన్ ఇమ్రాన్‌ఖాన్ తండ్రి మస్తాన్ పంక్చర్ షాపు నిర్వహిస్తున్నారు. ఆయనకు ముగ్గురు సంతానం కాగా.. ఇద్దరు ఆడపిల్లలు, ఒక కుమారుడు. రావూరి తేజ తండ్రి భాస్కర్ పెయింటర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. ఆయన ఒక్కగానొక్క కుమారుడు తేజ తండ్రికి సాయంగా ఉండేందుకు గల్ఫ్ వెళ్లాలని ప్రయత్నిస్తున్నాడు. ఇంతలోనే జరిగిన ఈ ప్రమాదం మూడు కుటుంబాల్లో విషాదం నింపింది. -
బస్సు ప్రమాద మృతులకు ఆర్థికసాయం
తిరుపతి తుడా/చంద్రగిరి: బస్సు ప్రమాద ఘటన మృతుల కుటుంబాలు, క్షతగాత్రులకు ప్రభుత్వం అండగా నిలిచింది. చిత్తూరు జిల్లా భాకరాపేట ఘాట్‌లో జరిగిన బస్సు ప్రమాదంలో మృతి చెందిన పదిమంది బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తరఫున ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి బుధవారం రూ.2లక్షల చొప్పున ధర్మవరంలో చెక్కులను అందజేయగా.. తిరుపతిలోని 8 ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న 42 మంది క్షతగాత్రులకు అక్కడే రూ.50వేల చొప్పున చెక్కులను అందజేశారు. మృతుల కుటుంబాలకు మొత్తం రూ.20 లక్షలు, క్షతగాత్రులకు రూ.21 లక్షల సాయం ప్రభుత్వం తరఫున అందింది. డ్రైవర్ నిర్లక్ష్యంతోనే ప్రమాదం.. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే భాకరాపేట లోయలో బస్సు ప్రమాదం చోటు చేసుకుందని రోడ్ సేఫ్టీ అడిషనల్ డీజీపీ కృపానంద త్రిపాఠి ఉజేల స్పష్టం చేశారు. బుధవారం ఆయన భాకరాపేట కనుమలోని ప్రమాద స్థలాన్ని అర్బన్ ఎస్పీ వెంకటప్పలనాయుడుతో కలసి పరిశీలించారు. అతికష్టం మీద రోప్ సాయంతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదం జరిగిన ప్రాంతంతో పాటు బస్సును పరిశీలించి పలు ఫొటోలను తన సెల్ఫోన్లో చిత్రీకరించారు. కనుమలో ప్రమాదాలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. -
నిర్లక్ష్యపు డ్రైవింగే కొంప ముంచింది
తిరుపతి రూరల్: చిత్తూరు జిల్లా మదనపల్లి–తిరుపతి జాతీయ రహదారిపై శనివారం రాత్రి భాకరాపేట ఘాట్‌లో పెళ్లి నిశ్చితార్థం కోసం వస్తున్న బస్సు లోయలో పడిన ఘటనలో మృతుల సంఖ్య తొమ్మిదికి చేరింది. 300 అడుగులకు పైగా ఉన్న లోయలో బస్సు ఐదు పల్టీలు కొట్టి, పెద్ద పెద్ద బండ రాళ్లను ఢీకొట్టడంతో ప్రమాద తీవ్రత పెరిగింది. నిర్లక్ష్యపు డ్రైవింగ్‌కు తోడు అతి వేగం వల్లే బస్సు నియంత్రణ కోల్పోయి లోయలోకి దూసుకుపోయినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. అనంతపురం జిల్లా ధర్మవరానికి చెందిన డ్రైవర్ రసూల్‌బాషా (47), క్లీనర్ షకీల్ (25), మలిశెట్టి గణేష్ (40), మలిశెట్టి మురళి (45), మలిశెట్టి వెంగప్ప (60), లక్ష్మీకాంతమ్మ (40) ఘటన స్థలిలోనే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన యశస్విని (8) ఆస్పత్రికి తరలిస్తుండగా చనిపోయింది. తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ జర్నలిస్ట్ ఆదినారాయణరెడ్డి (45), నాగలక్ష్మి (60) ఆదివారం మృతి చెందారు. మరో 43 మంది క్షతగాత్రులకు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. ఎముకలు విరిగిన 22 మందికి బర్డ్ ఆస్పత్రిలో, శస్త్రచికిత్సలు అవసరం అయిన 12 మంది స్విమ్స్‌లో, మరో 9 మందికి రుయాలో చికిత్స అందిస్తున్నారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఆస్పత్రి వద్ద ఆర్తనాదాలు బస్సు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన 45 మందిని (మొత్తం 52 మంది) శనివారం అర్ధరాత్రి తిరుపతిలోని రుయా జనరల్ ఆస్పత్రికి తరలించారు. కాలు విరిగి ఒకరు, ముఖంపై రాడ్లు గుచ్చుకుని రక్తం ధారలు కారుతూ మరొకరు, రెండు చేతులూ విరిగి, కాలు తెగి అల్లాడిపోతూ ఇంకొకరు.. బాధతో చేస్తున్న ఆర్తనాదాలు చూపరుల కంట నీరు తెప్పిస్తున్నాయి. చికిత్స పొందుతూ ఆదివారం వీరిలో ఇద్దరు మృతి చెందారు. పెళ్లికొడుకు వేణు తీవ్ర గాయాలతో తల్లిదండ్రులు, బంధువుల ఆరోగ్య పరిస్థితులను తెలుసుకునేందుకు పడుతున్న ఆరాటం అయ్యో.. అనిపిస్తోంది. డిప్యూటీ సీఎం, మంత్రి, ఎమ్మెల్యేల పరామర్శ ఆయా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ఆదివారం డిప్యూటీ సీఎం నారాయణస్వామి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చంద్రగిరి, ధర్మవరం ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని డీఎంహెచ్ఓ శ్రీహరి, వైద్యాధికారులను ఆదేశించారు. క్షతగాత్రులతో నేరుగా మాట్లాడారు. వైద్యం అందుతున్న తీరుపై ఆరా తీశారు. ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. జిల్లా మంత్రులు, అధికారులతో మాట్లాడారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. గాయపడిన వారిలో అత్యధికులు చేనేత కుటుంబాలకు చెందిన వారని, వారికి అండగా ఉంటామని సీఎం ప్రకటించారని మంత్రులు నారాయణస్వామి, పెద్దిరెడ్డి తెలిపారు. మృతి చెందిన వారికి ఒక్కొక్కరికి రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50 వేలు చొప్పున ప్రభుత్వం సాయం అందించనున్నట్లు చెప్పారు. కాగా, గాయపడిన వారి అభ్యర్థన మేరకు మరింత ఆర్థిక సాయం కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్లి ఆదుకునేందుకు తన వంతు కృషి చేస్తానని ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి తెలిపారు. మృతదేహాలకు తిరుపతి ఎస్వీ మెడికల్ మార్చురీలో పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. రుయాలో క్షతగాత్రులను పరామర్శిస్తున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బస్సు కండిషన్ ఓకే.. అతివేగమే కారణం భాకరాపేట ఘాట్ వద్ద లోయలో పడిన బస్సు ప్రమాదంపై లోతైన విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్ బసిరెడ్డి, తిరుపతి వెస్ట్ డీఎస్పీ నరసప్ప, ప్రాంతీయ రవాణా శాఖాధికారి సీతారామిరెడ్డి, ఆర్అండ్బీ (జాతీయ రహదారులు) డీఈ సత్యమూర్తి ఆధ్వర్యంలోని బృందం ఆదివారం ఘటనా స్థలాన్ని పరిశీలించింది. బస్సు కండీషన్ బాగానే ఉందని, డ్రైవర్ నిర్లక్ష్యం, అతివేగం వల్ల స్టీరింగ్ కంట్రోల్ తప్పడంతో మలుపు వద్ద లోయలో పడినట్లు ప్రాథమికంగా నిర్ధారించామని అధికారులు తెలిపారు. ధర్మవరం కన్నీటి సంద్రం అంత్యక్రియలకు భారీగా తరలివచ్చిన జనం ధర్మవరం టౌన్/అర్బన్ : చిత్తూరు జిల్లా భాకరాపేట వద్ద బస్సు బోల్తా ఘటనతో అనంతపురం జిల్లా ధర్మవరంలో తీవ్ర విషాదం నెలకొంది. పట్టణంలోని నేసే పేటకు చెందిన సిల్క్ హౌస్ యజమాని మలిశెట్టి మురళి, తమ్ముడు గణేష్ (పట్టు చీరల వ్యాపారి), మరో తమ్ముడు శివ భార్య కాంతమ్మ ఈ ప్రమాదంలో మృతి చెందారు. ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి చెందడంతో పాటు మురళి కుమారుడు వేణు (పెళ్లి కొడుకు) గాయపడడంతో ఆ ఇంట తీవ్ర విషాదం అలముకుంది. మలిశెట్టి మురళి బంధువైన మలిశెట్టి వెంగప్ప (పెళ్లిళ్ల పేరయ్య), అతని భార్య నాగలక్ష్మి కూడా చనిపోయారు. మరో బంధువు జింకా చంద్ర కుమార్తె చందన (నాలుగవ తరగతి) మృతి చెందింది. పట్టణంలోని మారుతీనగర్‌లో నివసించే బస్సు డ్రైవర్ నబీరసూల్, శాంతినగర్‌లో ఉండే బస్సు క్లీనర్ షకీల్ (ఇంకా వివాహం కాలేదు) చనిపోయారు. ఇదే ప్రమాదంలో సీనియర్ జర్నలిస్టు ఆదినారాయణరెడ్డి సైతం మృత్యువాత పడ్డారు. ఈయన స్వగ్రామం బుక్కపట్నం మండలం మారాల. మలిశెట్టి మురళి స్నేహితుడు కావడంతో అతని కుమారుడి నిశ్చితార్థానికి వెళుతూ ప్రమాదంలో చనిపోయాడు. ఆదివారం వీరి మృతదేహాలు స్వస్థలాలకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా వారి అంత్యక్రియలకు జనం భారీగా తరలివచ్చారు. మృతుల కుటుంబాలకు ప్రధాని సానుభూతి చిత్తూరు జిల్లా తిరుపతి సమీపంలోని భాకారాపేట వద్ద ప్రైవేట్ బస్సు బోల్తా పడిన ఘటనపై ఆదివారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ ట్విటర్ ద్వారా స్పందిస్తూ.. ‘ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో పలువురు ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలుపుతున్నాను. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాను’ అని పేర్కొన్నారు. మృతుల బంధువులకు ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి (పీఎంఎన్ఆర్ఎఫ్) నుంచి రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేలు అందజేస్తామని తెలిపారు. మెరుగైన వైద్యం అందించాలి : గవర్నర్ బస్సు ప్రమాదంపై రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని చిత్తూరు జిల్లా అధికార యాంత్రాంగాన్ని ఆదేశించారు. ఈ మేరకు ఆదివారం రాజ్‌భవన్ ఓ ప్రకటన విడుదల చేసింది. బస్సు ప్రమాదంపై సీఎం దిగ్భ్రాంతి తిరుపతి సమీపంలో ప్రైవేట్ బస్సు బోల్తా ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు నాణ్యమైన వైద్యం అందించాలని, వారు కోలుకునేంతవరకూ అండగా నిలవాలని అధికారులను ఆదేశించారు. ప్రమాదానికి గల కారణాలను, సహాయక చర్యలను ఆదివారం ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. ప్రమాదం జరిగిన వెంటనే జిల్లా కలెక్టర్, ఎస్పీలు సహాయక చర్యలను స్వయంగా పర్యవేక్షించారని తెలిపారు. చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి కూడా సహాయక చర్యల్లో పాల్గొన్నారని చెప్పారు. తిరుపతిలోని స్విమ్స్, రుయా, బర్డ్ ఆస్పత్రుల్లో గాయపడ్డ వారికి చికిత్స అందిస్తున్నామన్నారు. ఈ ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున, గాయపడ్డ వారికి రూ.50 వేల చొప్పున పరిహారం అందించాలని సీఎం జగన్ ఆదేశించారు. కాగా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌లు ఈ ఘటనపై వేర్వేరు ప్రకటనల ద్వారా సానుభూతి తెలిపారు. భవిష్యత్‌లో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అతివేగమే ప్రమాదానికి కారణమని, బస్సులకు వేగ పరిమితి విధించాలని పవన్ కల్యాణ్ సూచించారు. -
చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం.. లోయలో పడ్డ బస్సు
చంద్రగిరి: ఓ పెళ్లి నిశ్చితార్థం కార్యక్రమానికి బయలుదేరిన బస్సు (కేఎల్30 ఏ 4995) చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం భాకరాపేట ఘాట్‌లో శనివారం రాత్రి బోల్తా పడింది. ఈ ఘటనలో ఎనిమిది మంది మృతి చెందగా, మరో 45 మందికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. అనంతపురం జిల్లా ధర్మవరంలోని మారుతినగర్‌కు చెందిన పట్టు చీరల వ్యాపారి (కోమలి శిల్క్ హౌస్) మలిశెట్టి మురళి కుమారుడు మలిశెట్టి వేణు (25)కు చిత్తూరు జిల్లా పుత్తూరు సమీపంలోని నారాయణవనంకు చెందిన ఓ యువతితో ఆదివారం నిశ్చితార్థం జరగాల్సి ఉంది. వేణుతో పాటు కుటుంబ సభ్యులు, బంధు మిత్రులు 55 మంది శనివారం ఓ ప్రైవేట్ బస్సులో తిరుపతికి బయలుదేరారు. రాత్రి 10 గంటల సమయంలో మార్గంమధ్యలో తిరుపతికి 20 కిలోమీటర్ల దూరంలో భాకరాపేట ఘాట్‌లో బస్సు ఒక్కసారిగా 300 అడుగుల లోతున్న లోయలోకి దూసుకెళ్లింది. చుట్టూ చిమ్మ చీకటి, ముళ్ల పొదలు, బండరాళ్ల మధ్య ఏం జరిగిందో తెలియక ప్రయాణికులు హడలిపోయారు. కాపాడండి సారూ.. అంటూ పెద్ద పెట్టున కేకలు వేశారు. బస్సు పల్టీలు కొట్టడంతో ఆ కుదుపులకు కొందరి కాళ్లు, చేతులు విరిగిపోయాయి. మరికొందరికి తీవ్రగాయాలు కావడంతో బస్సు మొత్తం రక్తమయమైంది. అయ్యా.. కాపాడండి.. బస్సు పల్టీలు కొడుతూ లోయలో పడిపోగానే అందులో ఉన్న వారు భయంతో కేకలు పెట్టారు. కొందరు కిటికీల్లోంచి బయటకు వచ్చినా, చీకట్లో వారికేమీ కనిపించలేదు. చిన్న పిల్లలు గుక్క పట్టి ఏడుస్తుండగా, మహిళల ఆర్తనాదాలు మిన్నంటాయి. ప్రయాణికుల ఆర్తనాదాలు విన్న వాహనదారులు లోయలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. ముళ్ల కంపలు, రాళ్లు, రప్పల మధ్య అతికష్టం మీద లోయలోంచి కొందరు క్షతగాత్రులను పైకి తీసుకొచ్చారు. మరికొందరు బస్సులోనే చిక్కుకుపోవడంతో వారిని తీయడానికి అష్టకష్టాలు పడాల్సి వచ్చింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. తిరుపతి అర్బన్ ఎస్పీ వెంకట అప్పలనాయుడు భాకరాపేట, చంద్రగిరి పోలీసులతో ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ముమ్మరం చేశారు. కలెక్టర్ హరినారాయణన్, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి కుమారుడు హర్షితరెడ్డి హుటాహుటిన అక్కడికి చేరుకుని సహాయక చర్యలు పర్యవేక్షించారు. 250 నుంచి 300 అడుగుల లోతు నుంచి క్షతగాత్రులను పైకి తీసుకొచ్చేందుకు వందలాది మంది పోలీసులు, రోప్ బృందాలు, స్థానికులు చాలా కష్టపడాల్సి వచ్చింది. ఒక్కొక్కరికి ఆరుగురు చొప్పున సాయపడాల్సి వచ్చింది. ఒకరిని పైకి తీసుకొచ్చేందుకు అరగంటకు పైగా సమయం పట్టింది. లైట్లు ఒకరు పట్టుకొని, మరొకరు తాడు సాయంతో.. ఇలా ప్రమాదకర స్థితిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఆరుగురి మృతదేహాలు లభ్యం కాగా, 35 మంది క్షతగాత్రులను చికిత్స నిమిత్తం 20 అంబులెన్స్‌లలో తిరుపతి రుయాకు తరలించారు. కాగా, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలిస్తున్న దృశ్యం అతివేగమే కారణం ప్రమాదకరమైన మలుపులు ఉన్న భాకరాపేట ఘాట్ రోడ్డులో ఈ బస్సు డ్రైవర్ ఎక్కువ వేగంతో నడిపినట్లు సమాచారం. నిత్యం ఈ రహదారిలో వెళ్లే డ్రైవర్లు మాత్రమే వేగంగా వెళ్లడానికి వీలుంటుంది. అలాంటిది ప్రమాదానికి గురైన బస్సు డ్రైవర్ అనుభవ రాహిత్యం వల్లే వేగాన్ని కంట్రోల్ చేయలేకపోవడం వల్ల ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు. ఈ ఘటన జరగడానికి ముందు సమీపంలోని పెట్రోల్ బంకులో బస్సుకు డీజిల్ పట్టించారు. ఆ సమయంలో బస్సును ముందుకు కదిల్చే క్రమంలో ర్యాష్ డ్రైవింగ్‌పై పలువురు డ్రైవర్‌ను హెచ్చరించారు. జాగ్రత్తగా వెళ్లాలని చెప్పారు. ఇది జరిగిన కాసేపటికే ఘాట్ మొదటి మలుపు వద్దే బస్సు లోయలోకి దూసుకెళ్లింది. ఐదు పల్టీలు కొట్టినట్లు ఓ ప్రయాణికుడు తెలిపాడు. ఈ ఘటనలో వధూ వరుల కుటుంబాల వారు, బంధు మిత్రులు విషాదంలో మునిగిపోయారు. కాగా, 2000లో ఇదే ఘాట్‌లో ఓ పెళ్లి బృందం బస్సు బోల్తా పడి 12 మంది మృతి చెందారు. -
ప్రమాదం: లోయలో పడ్డ ఆర్టీసీ బస్సు
సాక్షి, తిరుపతి: భాకరాపేట ఘాట్ రోడ్డులో ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సు లోయలో పడటంతో 22 మందికి గాయాలయ్యాయి. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వారిని రుయా ఆస్పత్రికి తరలించారు. బళ్లారి నుంచి తిరుపతికి వస్తుండగా ప్రమాదం జరిగింది. డ్రైవర్ కి గుండెనొప్పి రావటంతో బస్సు అదుపు తప్పిందని సమాచారం. -
మామిడి పేరుతో మస్కా
చెప్పేవన్నీ రైతు సంస్కరణ సుద్దులే. చేసేవన్నీ ఫక్తు మోసాలు. పేరుకే ప్రవాస భారతీయుడు. అడుగుడుగునా రైతులను ముంచడం అతని నైజం. ఆక్రమణలు అతని హాబి. సేంద్రియ సేద్యం, గ్రామాల దత్తత పేరుతో ఆ ఘరానా ఎన్ఆర్ఐ ఇప్పటికే రూ.60 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని తన సొంతం చేసుకున్నాడు. పేద రైతుల నోట్లో దుమ్ముకొట్టి ఆక్రమణలకు తెగబడుతున్నాడు. భాకరాపేటలోని దీన్దార్లపల్లి కేంద్రంగా అబ్దుల్ అలీ చేసే అక్రమాలు అన్నీ ఇన్నీ కావు. ఏళ్ల తరబడి జరిగిన అలీ దోపిడీపై రైతులు మండిపడుతున్నారు. బలవంతంగా లాక్కున్న తమ భూములను తిరిగి అప్పగించాలనే డిమాండ్‌తో ఆందోళనలకు సిద్ధమవుతున్నారు. అలీ అక్రమాలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.. సాక్షి, తిరుపతి రూరల్: చిన్నగొట్టిగల్లు మండలం దీన్దార్లపల్లికి చెందిన అబ్దుల్ అలీ చాలా ఏళ్ల క్రితం పొట్టచేతపట్టుకుని జీవనోపాధి కోసం గల్ఫ్ దేశాలకు తరలివెళ్లాడు. అక్కడ ఉద్యోగం చేసే సమయంలో ఏర్పడిన పరిచయాల కారణంగా మహా రాష్ట్రలోని నాసిక్ ప్రాంతంలో రైతులు నిర్వహించే సాయాద్రి అనే సంస్థలో ఉద్యోగిగా చేరాడు. పూర్తిగా సేంద్రియ సేద్యం, రైతు శ్రేయస్సు కోరే ఈ సంస్థలో దాదాపు 30 వేల మంది రైతులు సభ్యులుగా ఉన్నారు. ఇక్కడికి వచ్చే వివిధ రకాల పంటల దిగుమతులు విదేశాలకు ఎగుమతి అవుతూ ఉంటాయి. ఉద్యోగిగా ఉన్న అలీ ఈ పరిస్థితులను దగ్గరగా పరిశీలించాడు. ఇక్కడ జరుగుతున్న ప్రక్రియను చూసిన అతను తన సొంతూరు అయిన భాకరాపేటలో కిసాన్ సువిధ ఫార్మర్స్(కేఎస్‌ఎఫ్) సంస్థను ఏర్పాటు చేశాడు. చిన్నగొట్టిగల్లు, ఎర్రావారిపాళెం, రొంపిచెర్ల మండలాల్లో అమాయకులైన రైతులను నమ్మించి, కొందరిని సభ్యులుగా చేర్చుకున్నాడు. ఇక్కడ నుంచే అలీ తన ఘరానా మోసాలకు నాంది పలికాడు. ఈ ప్రాంతంలో మామిడి విపరీతంగా పండుతుందనే విషయం అలీకి చాలా బాగా తెలుసు. అందుకే వారి కష్టాన్ని నిలువునా దోచేసే వ్యవస్థను రూపొందించుకున్నాడనే ఆరోపణలున్నాయి. రైతులు పండించిన మామిడి పంటను సేకరించి, సేంద్రియ ఫలసాయం పేరుతో నాసిక్‌కు తరలించి, అక్కడి నుంచి ఎగుమతులు చేయడం ప్రారంభించాడు. వచ్చే ఆదాయం రైతులకు పంచిపెడుతున్నట్లు బిల్డప్ ఇస్తూ అంతర్జాతీయంగా ఉన్న సంస్థల నుంచి సబ్సిడీలు, నిధులను తెచ్చుకుని స్వాహా చేస్తున్నాడనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ స్వాహాల పర్వానికి దశాబ్ధ కాలపు చరిత్ర ఉంది. బలవంతపు భూసేకరణ సేంద్రియ వ్యవసాయం, రైతు సంక్షేమం పేరుతో రైతులను, ప్రభుత్వాన్ని మోసగిస్తున్న అలీ కోట్ల రూ పాయల విలువ చేసే ప్రభు త్వ భూములను కారు చౌకకు కొట్టేసే ప్రయత్నాలు చేశారనే ఆరో పణలున్నాయి. ఈ క్రమంలో రూ.60 కోట్ల విలువ చేసే వంద ఎకరాల భూమికి ఎసరు పెట్టారనే విమర్శలు ఉన్నాయి. ఎర్రావారిపాళెం మండల కేంద్రానికి సమీపంలో భాకరాపేట–ఎర్రావారిపాళెం ప్రధాన రహదారికి అనుకుని ఎర్రావారిపాళెం గ్రామం మబ్బుతోపు వద్ద 100 ఎకరాలను ఆక్రమించుకున్నాడనే ఆరోపణలున్నాయి. గత ప్రభుత్వం అండతో అక్రమంగా, చట్ట విరుద్ధం గా పేదల భూములను బలవంతంగా లాక్కున్నాడనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఏపీఐఐసీని భూ తంగా చూపెట్టి రైతుల నుంచి బలవంతంగా భూ ములు లాక్కున్నారని, చాలామంది రైతులకు దారి సౌకర్యం కూడా లేకుండా చేసి వేధించారనే ఆరోపణలున్నాయి. పశువులు సైతం మేతకు వెళ్లకుండా చుట్టు ప్రహరీ గోడ నిర్మించారని రైతులు వాపోతున్నారు. ఇందులో చాలావరకు దళితులు, బలహీన వర్గాలకు చెందిన వారి డీకేటీ భూములే ఉన్నాయి. వారిని అక్కడి నుంచి వారిని తరిమికొట్టి భూమికి చుట్టూ కంచె వేశాడు. రైతుల నుంచి బలవంతంగా సేకరించిన భూమిని చదును చేసి నిర్మాణాలకు రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. ఈ క్రమంలో కడుపు మండిన రైతులు గత ప్రభుత్వ హయాంలో అధికారులకు ఎన్నోమార్లు ఫిర్యాదు చేశారు. ఫలితం కనిపించకపోవటంతో అప్పట్లోనే అలీపై తిరుగుబాటు చేశారు. పలుకుబడి కలిగిన అలీ బలం ముందు రైతులు నిస్సహాయులుగా మారారు. తాజాగా రైతులు మరోమారు భూపోరాటం కోసం సిద్ధమౌతున్నారు. ఇందులో భాగంగానే అలీ దౌర్జన్యంగా నిర్మించిన కంచె, ప్రహరీ గోడను పాక్షికంగా కూల్చివేసినట్లు సమాచారం. మరోమారు బాధిత రైతులందరూ అందోళనకు సిద్ధమవుతున్నారు. రైతుల భూములను తిరిగి ఇప్పిస్తాం రైతుల నుంచి బలవంతంగా లాక్కున్న భూములను వారికి తిరిగి ఇప్పిస్తాం. ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ద్వారా ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి దృష్టికి సమస్యను తీసుకెళతాం. రైతులను ఆదుకుంటామని మోసగించటం దారుణం. అబ్దుల్ అలీ అక్రమాలపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరతాం. – సంధ్యా, ఎంపీపీ, చిన్నగొట్టిగల్లు గత ప్రభుత్వం కేటాయించింది భూములకు సంబంధించి ఎలాంటి అక్రమాలకూ పాల్పడలేదు. అవన్నీ గత ప్రభుత్వం కేటాయించింది. – అబ్దుల్ అలీ, కిసాన్ సువిధ ఫార్మర్స్ -
గుండె చెరువైంది
చిత్తూరు / భాకరాపేట: చిన్నగొట్టిగల్లు మండలం చిట్టేచెర్ల పంచాయతీ అయ్యప్పనాయినిచెరువులో సంతోషంగా బోట్ షికారుకు వెళ్లిన ఇద్దరు విద్యార్థులు నీటిలో మునిగి మృతిచెందారు. చిన్నగొట్టిగల్లు మండలం కొత్తపల్లెకు చెందిన దిలీప్(25), మురళీకృష్ణ(22), హరీష్, ముని స్నేహితులు. అందరూ ఆదివారం సంతోషంగా గడపాలని అయ్యప్పనాయినిచెరువు వద్దకు చేరుకున్నారు. అక్కడ ఉన్న చేపలు పట్టే బోట్లో సరదాగా తిరిగి రావాలని అనుకున్నారు. దిలీప్, మురళీకృష్ణ, ముని కలిసి బోటు ఎక్కారు. చెరువులో దాదాపు 20 నుంచి 40 అడుగులు లోతు నీరు ఉంది. చెరువు మధ్యలోకి వెళ్లిన సమయంలో బోటు తల్లకిందులైంది. ఈత రాకపోవడంతో దిలీప్, మురళీకృష్ణ నీట మునిగిపోయారు. ముని ఒడ్డుకు చేరుకున్నాడు. చెరువు కట్టపై ఉన్న హరీష్ కేకలు వేస్తూ గ్రామానికి వెళ్లి గ్రామస్తులకు విషయం చెప్పాడు. గ్రామ ప్రజలు అక్కడికి చేరుకుని గాలించారు. సమాచారం అందుకున్న భాకరాపేట ఎస్ఐ శ్రీనివాసులు, తహసీల్దార్ ఎం.ఆర్.భాగ్యలక్ష్మి చెరువు వద్దకు చేరుకున్నారు. పరిస్థితిని సమీక్షించారు. పీలేరు అగ్నిమాపక సిబ్బందిని, గజ ఈతగాళ్లను పిలిపించి గాలింపు చర్యలు చేపట్టారు. మధ్యాహ్నం నుంచి గాలింపు చర్యలు చేపట్టి సాయంత్రం 5 గంటలకు మృతదేహాలను వెలికితీశారు. శోకసముద్రంలో కొత్తపల్లె ఇద్దరు యువకులు మృతి చెందడంతో కొత్తపల్లెలో విషాదఛాయలు అలుముకున్నాయి. మునిరాజ, ప్రభావతి దంపతులు ఉన్న కొద్దిపాటి పొలాన్ని సాగు చేసుకోవడంతోపాటు కూలి పనులు చేస్తూ కొడుకు దిలీప్‌ను ఎంటెక్ వరకు చదివిం చారు. అలాగే రాజన్న, రాణెమ్మ దంపతులు వ్యవసాయ పనులు చేసుకుంటూ తమ కొడుకు మురళీకృష్ణను ఎంసీఏ చదివించారు. వారు చెరువులో మునిగి మృతిచెందారని తెలియడంతో గుండెలవిసేలా రోదించారు. ముసలితనంలో ఉద్దరిస్తారనుకుంటే అప్పుడే నూరేళ్లూ నిండిపోయా నాయనా.. అంటూ వారు రోదించడాన్ని చూసి స్థానికులు కంటతడి పెట్టారు. మృతుల కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పరామర్శించారు. -
ఆయిల్ ట్యాంకర్ బోల్తా
సిద్దవటం: సిద్దవటంలోని జేఎంజే కళాశాల సమీపంలో సోమవారం పెట్రోలు ఆయిల్ ట్యాంకర్ అదుపు తప్పి బోల్తా పడింది. సిద్దవటం మండలం భాకరాపేట సమీపంలోని హెచ్‌పీసీఎల్ పెట్రోలియం డిపో నుంచి ఏపీ 02 ఎక్స్ 4500 అనే నంబర్ గల ఆయిల ట్యాంకర్ పెట్రోలు నింపుకొని కర్నూలులోని పోలీసు వారి పెట్రోలు బంకుకు తీసుకెళ్తోంది. భాకరాపేట–కడప మార్గం మధ్యలో పోలీసులు రోడ్డుపై ఏర్పాటు చేసిన డ్రమ్ముల వద్దకు రాగానే డ్రైవర్ వాహనాన్ని కంట్రోలు చేయలేక పోవడంతో అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో ట్యాంకర్లో ఉన్న పెట్రోలు కింద పడి పోయింది. సమాచారం తెలుసుకున్న హెచ్‌పీసీఎల్ సిబ్బంది కడప అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి నేలపై పడిన పెట్రోలుపై నీరు చల్లారు. తరువాత ఈ ట్యాంకర్ నుంచి పెట్రోలును వేరే ట్యాంకర్‌లోకి బకెట్లతో పోశారు. ఈ ప్రమాదంలో డ్రైవర్ కడపకు చెందిన కె.ఈశ్వరయ్య, క్లీనర్ గుంతకల్లుకు చెందిన చాకలి సాయినాథ్ లకు స్వల్ప గాయాలయ్యాయి. -
విభజన జరిగితే అభివృద్ధి శూన్యం
భాకరాపేట, న్యూస్‌లైన్: రాష్ట్ర విభజన జరిగితే అభివృద్ధి శూన్యంగా మారుతుందని ఎమ్మెల్సీ యుండపల్లె శ్రీనివాసులురెడ్డి అన్నారు. బుధవారం ఆయన తన స్వగ్రావుం చిన్నగొట్టిగల్లు వుండలం యుండపల్లెవారిపల్లెకు వచ్చారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. విభజన బిల్లుకు సంబంధించి శాసనసభలో, శాసన వుండలిలో చేర్పులు, వూర్పులకు సూచనలు ఇచ్చావున్నారు. రాష్ట్ర విభజన అంశాన్ని ఎన్నికల వుుందు తీసుకొచ్చి హడావుడి చేసేయూలని కాంగ్రెస్ భావిస్తోందని వుండిపడ్డారు. రాష్ట్ర విభజన ప్రజాప్రయోజనాలకంటే రాజకీయ ప్రయోజనాలకోసమే అనే విషయం ప్రజలు గుర్తించారన్నారు. లక్షకోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా ప్రజెక్టులన్నీ పాక్షికంగానే పూర్తయ్యాయన్నారు. పెండింగ్ ప్రాజెక్టులపై కేంద్రప్రభుత్వం చొరవ తీసుకోకపోవడం దారుణమన్నారు. మన జిల్లాలో గాలేరు-నగరి, హంద్రీ-నీవా పనులు పూర్తి చేయలేదన్నారు. రాష్ట్ర విభజన అనివార్యం అరుుతే రాయులసీవు ప్రాంత జిల్లాలు అథోగతికి చేరుకుంటాయన్నారు. కోస్తా ప్రాంత ంలో సైతం పంటలకు నీళ్లు ఉండవన్నారు. విద్యారంగానికి సంబంధించి తీరని సవుస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. యుువతకు ఉపాధి, విద్య, ఉద్యోగ అవకాశాల ఉండవని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ర్ట విభజనతో సమస్యలు మిగులుతాయే తప్ప అభివృద్ధి జరగదన్నారు. -
భారీగా ఎర్రచందనం స్వాధీనం
భాకరాపేట, న్యూస్‌లైన్: శేషాచలం కొండల్లోని దట్టమైన ఆరిపెంట అటవీ ప్రాంతంలో రూ.20 లక్షల ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు భాకరాపేట ఫారెస్టు రేంజర్ డీఎన్‌కె ప్రసాద్ తెలిపారు. శనివారం ఫారెస్టు కార్యాలయుంలో ఆయన స్థానిక విలేకరులతో వూట్లాడారు. ఫారెస్టు సెక్షన్ అధికారి జి మునికృష్ణరాజు ఆధ్వర్యంలో సిబ్బందితో కలసి 5 కిలోమీటర్ల దూరం గాలింపు చేపట్టగా ముళ్ల పొదల్లో దాచిన దుంగలు కనిపించాయన్నారు. 1500 కిలోల బరువు గల 47 దుంగలను వెలికి తీసి, శుక్రవారం రాత్రి భాకరాపేట కార్యాలయానికి తరలించినట్లు తెలిపారు. వీటి విలువ రూ 20 లక్షలు వుంటుందన్నారు. ఈ గాలింపులో ఎఫ్ఎస్వో జిఎంకెరాజు, ఎఫ్‌బీవో శోభారాణి, సిబ్బంది శ్రీనివాసన్, మూర్తి, శంకర్నాయుక్, హేవూవతి, ప్రొటెక్షన్ వాచర్లు పాల్గొన్నారు. రూ.60లక్షల ఎర్ర చందనం పట్టివేత తిరుపతి(మంగళం): తిరుపతి రేంజ్ పరిధిలో అక్రమంగా తరలిస్తున్న రూ.60 లక్షల ఎర్రచందనాన్ని శనివారం వైల్డ్‌లైఫ్ అధికారులు పట్టుకున్నారు. మామండూరు, టీఎన్పాళెం, కృష్ణాపురం బీట్లలో శనివారం వైల్డ్‌లైఫ్ రేంజ్ ఆఫీసర్ రామ్లానాయక్ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. టెంపోట్రావెలర్, ఈచర్ వాహనం, స్వరాజ్ మజ్దా తదితర నాలుగు వాహనాలను, వాటిలో అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఎర్రచందనం 6,672 కిలోల బరువు ఉంటుందని రామ్లానాయక్ తెలిపారు. దీంతోపాటు ఎర్రచందనాన్ని తరలిస్తున్న ఇద్దరు స్మగ్లర్లను అరెస్ట్ చేశామని తెలిపారు. ఈ దాడుల్లో డెప్యూటీ రేంజ్ ఆఫీసర్లు ఎన్.లక్ష్మీపతి(కృష్ణాపురం), పి.రామకోటి(మామండూరు), ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ టివి. రమణారెడ్డి(టిఎన్పాళెం), ఎఫ్‌బీవోలు రమేష్, నటరాజ్, టి. హరిప్రియ, జిడి.సంపత్ పాల్గొన్నారు. రూ.10 లక్షల ఎర్రచందనం పట్టివేత ఏర్పేడు: మండలంలోని అముడూరు పొలాల్లో రెండు ఎడ్లబండ్లపై తరలిస్తున్న ఎర్రచందనం దుంగలను శనివారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముందస్తు సమాచారం మేరకు తిరుపతి అర్బన్ ఎస్పీ రాజశేఖరబాబు, రేణిగుంట డీఎస్పీ శ్రీనివాసులు ఆదేశాలతో ఎస్ఐ విక్రమ్ తమ సిబ్బందితో దాడిచేసి అముడూరు పొలాల్లో ఎడ్లబండ్లపై తరలిస్తున్న 50 ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు రెండు ఎడ్లబండ్లు, 4 ఎద్దులు పట్టుకున్నారు. వీటి విలువ రూ.10 లక్షలు ఉంటుందని రేణిగుంట సీఐ రామ్‌కుమార్ తెలిపారు. శ్రీకాళహస్తి మండలం గొల్లపల్లెకు చెందిన బిల్లు సురేష్(25)ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపారు. పోలీసులు మునికృష్ణ, శ్రీరాములు, ప్రసాద్, సుబ్రమణ్యం, కరీముల్లా, మునస్వామిరెడ్డి, రాజేష్, అనిల్‌కుమార్ పాల్గొన్నారు. లారీ సహా రూ.36లక్షల ఎర్రచందనం స్వాధీనం నారాయణవనం: లారీ సహా అక్రమంగా తరలిస్తున్న రూ.36 లక్షల విలువైన ఎర్రచంద్రనం దుంగలను స్వాధీనం చేసుకుని, ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు పుత్తూరు సీఐ చంద్రశేఖర్ తెలిపారు. శనివారం రాత్రి స్థానిక పోలీస్ స్టేషన్లో ఆయన వివరాలు వెల్లడించారు. మండలంలోని పాలమంగళం దక్షిణం కండ్రిగకు చెందిన శంకర్‌రెడ్డి 15 ఎర్రచందనం చెట్లను పెంచుతున్నాడు. సుమారు 35 సంవత్సరాల వయస్సున్న రెండు చెట్లను తమిళనాడు రాష్ట్రం తిరువణ్ణామలైకు చెందిన నలుగురు కూలీలు నరికారు. సుమారు 800 కేజీల బరువున్న ఏడు దుంగలను శనివారం సాయంత్రం టర్బో లారీలో తరలిస్తుండగా పోలీసులకు సమాచారం అందింది. ఎస్ఐ ప్రసాదరావు, సిబ్బంది రాజు, గోపి, ప్రసాద్‌తో మండలంలోని తుంబూరు వద్ద లారీని అడ్డగించారు. పోలీసులను గమనించి ముగ్గురు కూలీలు పరారయ్యూరు. తివణ్ణామలై సమీపంలోని సంగం గ్రామానికి చెందిన కూలీ కాళీ అమ్మన్(35), హోసూరుకు చెందిన లారీ డ్రైవర్ నవీన్(36), క్లీనర్ బాబు(37)ను అరెస్టు చేసి, ఏడు ఎర్రచందనం దుంగలను పోలీ సులు స్వాధీనం చేస్తుకున్నారు. ఎర్రచందనం దుంగల విలువ సుమారు 16 లక్షలు కాగా, లారీ విలువ సుమారు 20 లక్షలకుపైగా ఉంటుందని సీఐ చంద్రశేఖర్ తెలిపారు. కేసులు దర్యాప్తు చేస్తున్నారు.