ఎర్రావారిపాళెంలో భూములను ఆక్రమించి అలీ నిర్మిస్తున్న పల్ప్ ఫ్యాక్టరీ
చెప్పేవన్నీ రైతు సంస్కరణ సుద్దులే. చేసేవన్నీ ఫక్తు మోసాలు. పేరుకే ప్రవాస భారతీయుడు. అడుగుడుగునా రైతులను ముంచడం అతని నైజం. ఆక్రమణలు అతని హాబి. సేంద్రియ సేద్యం, గ్రామాల దత్తత పేరుతో ఆ ఘరానా ఎన్‌ఆర్‌ఐ ఇప్పటికే రూ.60 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని తన సొంతం చేసుకున్నాడు. పేద రైతుల నోట్లో దుమ్ముకొట్టి ఆక్రమణలకు తెగబడుతున్నాడు. భాకరాపేటలోని దీన్‌దార్లపల్లి కేంద్రంగా అబ్దుల్ అలీ చేసే అక్రమాలు అన్నీ ఇన్నీ కావు. ఏళ్ల తరబడి జరిగిన అలీ దోపిడీపై రైతులు మండిపడుతున్నారు. బలవంతంగా లాక్కున్న తమ భూములను తిరిగి అప్పగించాలనే డిమాండ్‌తో ఆందోళనలకు సిద్ధమవుతున్నారు. అలీ అక్రమాలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం..
సాక్షి, తిరుపతి రూరల్: చిన్నగొట్టిగల్లు మండలం దీన్‌దార్లపల్లికి చెందిన అబ్దుల్ అలీ చాలా ఏళ్ల క్రితం పొట్టచేతపట్టుకుని జీవనోపాధి కోసం గల్ఫ్ దేశాలకు తరలివెళ్లాడు. అక్కడ ఉద్యోగం చేసే సమయంలో ఏర్పడిన పరిచయాల కారణంగా మహా రాష్ట్రలోని నాసిక్ ప్రాంతంలో రైతులు నిర్వహించే సాయాద్రి అనే సంస్థలో ఉద్యోగిగా చేరాడు. పూర్తిగా సేంద్రియ సేద్యం, రైతు శ్రేయస్సు కోరే ఈ సంస్థలో దాదాపు 30 వేల మంది రైతులు సభ్యులుగా ఉన్నారు. ఇక్కడికి వచ్చే వివిధ రకాల పంటల దిగుమతులు విదేశాలకు ఎగుమతి అవుతూ ఉంటాయి. ఉద్యోగిగా ఉన్న అలీ ఈ పరిస్థితులను దగ్గరగా పరిశీలించాడు. ఇక్కడ జరుగుతున్న ప్రక్రియను చూసిన అతను తన సొంతూరు అయిన భాకరాపేటలో కిసాన్ సువిధ ఫార్మర్స్(కేఎస్‌ఎఫ్) సంస్థను ఏర్పాటు చేశాడు.
చిన్నగొట్టిగల్లు, ఎర్రావారిపాళెం, రొంపిచెర్ల మండలాల్లో అమాయకులైన రైతులను నమ్మించి, కొందరిని సభ్యులుగా చేర్చుకున్నాడు. ఇక్కడ నుంచే అలీ తన ఘరానా మోసాలకు నాంది పలికాడు. ఈ ప్రాంతంలో మామిడి విపరీతంగా పండుతుందనే విషయం అలీకి చాలా బాగా తెలుసు. అందుకే వారి కష్టాన్ని నిలువునా దోచేసే వ్యవస్థను రూపొందించుకున్నాడనే ఆరోపణలున్నాయి. రైతులు పండించిన మామిడి పంటను సేకరించి, సేంద్రియ ఫలసాయం పేరుతో నాసిక్‌కు తరలించి, అక్కడి నుంచి ఎగుమతులు చేయడం ప్రారంభించాడు. వచ్చే ఆదాయం రైతులకు పంచిపెడుతున్నట్లు బిల్డప్ ఇస్తూ అంతర్జాతీయంగా ఉన్న సంస్థల నుంచి సబ్సిడీలు, నిధులను తెచ్చుకుని స్వాహా చేస్తున్నాడనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ స్వాహాల పర్వానికి దశాబ్ధ కాలపు చరిత్ర ఉంది.
బలవంతపు భూసేకరణ
సేంద్రియ వ్యవసాయం, రైతు సంక్షేమం పేరుతో రైతులను, ప్రభుత్వాన్ని మోసగిస్తున్న అలీ కోట్ల రూ పాయల విలువ చేసే ప్రభు త్వ భూములను కారు చౌకకు కొట్టేసే ప్రయత్నాలు చేశారనే ఆరో పణలున్నాయి. ఈ క్రమంలో రూ.60 కోట్ల విలువ చేసే వంద ఎకరాల భూమికి ఎసరు పెట్టారనే విమర్శలు ఉన్నాయి. ఎర్రావారిపాళెం మండల కేంద్రానికి సమీపంలో భాకరాపేట–ఎర్రావారిపాళెం ప్రధాన రహదారికి అనుకుని ఎర్రావారిపాళెం గ్రామం మబ్బుతోపు వద్ద 100 ఎకరాలను ఆక్రమించుకున్నాడనే ఆరోపణలున్నాయి. గత ప్రభుత్వం అండతో అక్రమంగా, చట్ట విరుద్ధం గా పేదల భూములను బలవంతంగా లాక్కున్నాడనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ఏపీఐఐసీని భూ తంగా చూపెట్టి రైతుల నుంచి బలవంతంగా భూ ములు లాక్కున్నారని, చాలామంది రైతులకు దారి సౌకర్యం కూడా లేకుండా చేసి వేధించారనే ఆరోపణలున్నాయి. పశువులు సైతం మేతకు వెళ్లకుండా చుట్టు ప్రహరీ గోడ నిర్మించారని రైతులు వాపోతున్నారు. ఇందులో చాలావరకు దళితులు, బలహీన వర్గాలకు చెందిన వారి డీకేటీ భూములే ఉన్నాయి. వారిని అక్కడి నుంచి వారిని తరిమికొట్టి భూమికి చుట్టూ కంచె వేశాడు. రైతుల నుంచి బలవంతంగా సేకరించిన భూమిని చదును చేసి నిర్మాణాలకు రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. ఈ క్రమంలో కడుపు మండిన రైతులు గత ప్రభుత్వ హయాంలో అధికారులకు ఎన్నోమార్లు ఫిర్యాదు చేశారు.
ఫలితం కనిపించకపోవటంతో అప్పట్లోనే అలీపై తిరుగుబాటు చేశారు. పలుకుబడి కలిగిన అలీ బలం ముందు రైతులు నిస్సహాయులుగా మారారు. తాజాగా రైతులు మరోమారు భూపోరాటం కోసం సిద్ధమౌతున్నారు. ఇందులో భాగంగానే అలీ దౌర్జన్యంగా నిర్మించిన కంచె, ప్రహరీ గోడను పాక్షికంగా కూల్చివేసినట్లు సమాచారం. మరోమారు బాధిత రైతులందరూ అందోళనకు సిద్ధమవుతున్నారు.
రైతుల భూములను తిరిగి ఇప్పిస్తాం
రైతుల నుంచి బలవంతంగా లాక్కున్న భూములను వారికి తిరిగి ఇప్పిస్తాం. ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ద్వారా ముఖ్యమంత్రి వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి సమస్యను తీసుకెళతాం. రైతులను ఆదుకుంటామని మోసగించటం దారుణం. అబ్దుల్ అలీ అక్రమాలపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరతాం. – సంధ్యా, ఎంపీపీ, చిన్నగొట్టిగల్లు
గత ప్రభుత్వం కేటాయించింది
భూములకు సంబంధించి ఎలాంటి అక్రమాలకూ పాల్పడలేదు. అవన్నీ గత ప్రభుత్వం కేటాయించింది.
– అబ్దుల్ అలీ, కిసాన్ సువిధ ఫార్మర్స్
Comments
Please login to add a commentAdd a comment