huge scam
-
తెలుగు అకాడమీలో డిపాజిట్ల గోల్ మాల్
-
రూ. 22 వేల కోట్ల స్కాం : ఓంకార్ గ్రూప్ చైర్మన్ అరెస్ట్
సాక్షి,ముంబై: వేల కోట్ల రూపాయల కుంభకోణం కేసులో అతిపెద్ద రియల్ ఎస్టేట్ సంస్థ ఓంకార్ గ్రూప్ చైర్మన్ కమల్ గుప్తా, మేనేజింగ్ డైరెక్టర్ బాబూలాల్ వర్మలకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) షాకిచ్చింది. రూ .22 వేల కోట్ల మేర పలు బ్యాంకులను ముంచేసిన స్కాంలో మనీలాండరింగ్ ఆరోపణలపై బుధవారం వీరిని అరెస్టు చేసింది. విచారణ అనంతరం గురువారం ప్రత్యేక పీఎంఎల్ఏ కోర్టులో హాజరుపరచనున్నారు. మురికివాడల పునరావాసం పేరుతో కమల్ గుప్తా, బాబు లాల్ వర్మ 22 వేల కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడ్డారు. ప్రధానంగా యస్ బ్యాంక్ నుంచి రూ .450 కోట్లతో సహా పలు బ్యాంకుల నుంచి వేల కోట్ల రుణాలు తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఓంకర్ గ్రూప్‌నకు చెందిన పలు ఆఫీసులు, నివాసాలపై ఈడీ వరుస దాడులు చేపట్టింది. 10 చోట్ల నిర్వహించిన ఈ దాడుల్లో అనేక కీలక పత్రాలను ఈడీ స్వాధీనం చేసుకుంది. ఈ నేపథ్యంలో తాజా అరెస్టులు చోటు చేసుకున్నాయి. ఈడీ కార్యాలయంలోబాబులాల్ వర్మ, కమల్ గుప్తాను ప్రశ్నించిన ఈడీ దర్యాప్తునకు నిందితులిద్దరూ సహకరించలేదని ఆరోపించింది. ఈ నేపథ్యంలో కస్టోడియల్ విచారణను కోరినట్టు తెలిపింది. మురికివాడల పునరావాసం పేరిట ఓంకార్ గ్రూప్, గోల్డెన్ ఏజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ సంస్థలు ఫోర్జరీ చేశాయని, తప్పుడు పత్రాలను సృష్టించి వేలకోట్ల అక్రమాలకు పాల్పడ్డాయంటూ 2019లో బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. మురికివాడల పునరావాస అథారిటీ (ఎస్ఆర్ఏ) అధికారులతో ఓమ్కర్ గ్రూప్ సిబ్బంది కుమ్మక్కై తప్పుడు వివిధ బ్యాంకుల నుండి సుమారు 22,000 కోట్ల రూపాయల రుణాలు పొందారని ఆరోపణలు నమోదయ్యాయి. దీనిపై ముంబై పోలీసుల ఎకనామిక్ నేరాల విభాగం దర్యాప్తు చేస్తోంది. కాగా ముంబైలోని అతిపెద్ద రియల్ ఎస్టేట్ సంస్థలలో ఓంకర్ గ్రూప్ ఒకటి, ఇది ప్రధానంగా నగర శివారులోని విలాసవంతమైన ప్రీమియం రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులను నిర్వహిస్తుంది. ముఖ్యంగా వర్లీలోని ఓంకార్ 1973 ప్రాజెక్టు బాగా ప్రసిద్ది చెందింది. హై ప్రొఫైల్ సెలబ్రిటీలు మాత్రమే ఇక్కడ ఫ్లాట్లను కొనుగోలు చేయడం గమనార్హం. -
మెడికల్ సీట్లలో భారీ దందా
సాక్షి, హైదరాబాద్ : ఎంబీబీఎస్ సీట్లలో భారీ కుంభకోణానికి రాష్ట్రంలో కొన్ని ప్రైవేటు మెడికల్ కాలేజీలు తెరలేపాయి. నెల రోజులుగా జరుగుతున్న ఈ దందా ప్రక్రియ చివరి అంకానికి చేరుకుంది. బీ–కేటగిరీలో వివిధ కౌన్సెలింగ్‌లలో చేరిన పలువురు ఇతర రాష్ట్రాల విద్యార్థులు శుక్రవారం సాయం త్రం తమ సీట్లను రద్దు చేసుకున్నారు. అలా రద్దు చేసుకున్నాక మిగిలిపోయిన సీట్లు ఎన్నారై కోటాగా మారిపోయాయి. ముందస్తుగా వేసుకున్న ప్రణాళిక ప్రకారం అటు దళారులు, ఇటు ప్రైవేటు మెడికల్ కాలేజీలు ఆ ఎన్నారై సీట్లను ఎక్కువ ధరకు సీటు రాని ఇతర విద్యార్థులకు అమ్ముకున్నారు. అలా ఎక్కువ ధరకు కొనుగోలు చేసిన విద్యార్థులు శనివారం (31 ఆగస్టు)మెడికల్‌లో అడ్మిషన్లు తీసుకోనున్నారు. ఈ దందాలో అనేక ముఠాలు, ప్రైవేటు కాలేజీలు, కొందరు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు భాగస్వాములుగా ఉండడం గమనార్హం. తద్వారా అక్రమంలో పాలుపంచుకున్న విద్యార్థులకు లక్షలకు లక్షలు, దళారులు, ప్రైవేటు మెడికల్ కాలేజీలకు అక్రమంగా, అప్పనంగా కోట్ల రూపాయలు దక్కాయి. కర్ణాటకలో ఈ వ్యవహారంలో దాదాపు రూ.500 కోట్ల కుంభకోణం జరిగినట్లు వార్తలు రాగా, అదే తరహాలో మన రాష్ట్రంలోనూ జరుగుతున్నాయి. ఇంత జరుగుతున్నా వైద్య ఆరోగ్యశాఖ చోద్యం చూస్తుండటం పై విమర్శలు వస్తున్నాయి. పెద్ద ముఠాలే ! రాష్ట్రంలో 21 ప్రైవేటు మెడికల్ కాలేజీలున్నాయి. అందులో నాన్–మైనారిటీ మెడికల్ కాలేజీల్లో 2,500 ఎంబీబీఎస్ సీట్లున్నాయి. వాటిల్లో బీ–కేటగిరీ 875 సీట్లుండగా, 375 ఎన్నారై సీట్లున్నాయి. ఇక మైనారిటీ కాలేజీల్లో 550 ఎంబీబీఎస్ సీట్లుండగా అందులో 136 బీ–కేటగిరీ సీట్లు, 84 ఎన్నారై కోటా సీట్లు. ఇక ప్రస్తుతం ఎంబీబీఎస్ బీ–కేటగిరీ ఫీజు ఏడాదికి రూ.11.55 లక్షలుంది. సీ–కేటగిరీ ఫీజు ఏడాదికి రూ.23.10 లక్షలు. అంటే బీ–కేటగిరీ ఫీజుకు రెట్టింపు ఫీజు సీ–కేటగిరీ సీటుకుంది. అంటే ప్రైవేటు మెడికల్ కాలేజీలకు సీ–కేటగిరీ ఫీజుతోనే రెట్టింపు లాభం వస్తుంది. బీ–కేటగిరీ సీట్లకు రెండు విడతల కౌన్సిలింగ్, మాప్–అప్ రౌండ్ కౌన్సిలింగ్ పూర్తయ్యాక మిగిలే సీట్లు ఆటోమెటిక్‌గా ఎన్నారై కోటా సీట్లుగా మారిపోతాయని గతంలోనే సర్కారు జీవో ఇచ్చింది. ఈ జీవోను ఆధారం చేసుకొనే భారీ కుంభకోణానికి తెరలేచింది. పైగా నీట్ ర్యాంకుల నేపథ్యంలో రాష్ట్రంలోని బీ, ఎన్ఆర్ఐ (సీ) కేటగిరీ సీట్లకు దేశంలోని ఏ రాష్ట్రానికి చెందిన విద్యార్థులైనా దరఖాస్తు చేసుకోవచ్చు. దీంతో బీ–కేటగిరీకి జరిగిన తొలి, రెండో విడతలతోపాటు మాప్–అప్ రౌండ్ కౌన్సెలింగ్ ఇతర రాష్ట్రాల విద్యార్థులను దళారులు చేర్పించారు. అందుకోసం దేశవ్యాప్తంగా అనేక ముఠాలు నడుస్తున్నాయి. ఉచ్చులోకి విద్యార్థులు, కుటుంబ సభ్యులు ప్రైవేటు మెడికల్ కాలేజీలు ఈ ముఠాలతో ఒప్పందం చేసుకున్నాయి. నీట్లో మంచి ర్యాంకు వచ్చిన ఇతర రాష్ట్రాల విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు దళారులు ఆశ చూపి వారిని ఈ ఉచ్చులోకి లాగారు. ఉదాహరణకు ఒక విద్యార్థికి నీట్లో మంచి ర్యాంకు వచ్చింది. అతను ఏ ఉత్తరప్రదేశ్‌లోనో రాజస్థాన్‌లోనూ ప్రభుత్వ మెడికల్ కాలేజీలోనైనా లేదా ప్రైవేటు మెడికల్ కాలేజీలోనైనా సీటు సంపాదించాడనుకోండి. అక్కడ అతను చేరుతాడు. అలాగే ఆ విద్యార్థి తెలంగాణలోని ఏదో ఒక ప్రైవేటు మెడికల్ కాలేజీలో బీ–కేటగిరీ కౌన్సిలింగ్‌కు హాజరవుతాడు. అందుకోసం అవసరమైన ఒరిజినల్ సర్టిఫికెట్లు కూడా తీసుకొస్తాడు. ఆ రాష్ట్రంలో విద్యార్థి చేరిన కాలేజీలో ఉన్న క్లర్క్‌లకు దళారులు 10–15వేలు ఇచ్చి ఒరిజినల్ సర్టిఫికేట్ల కలర్ జిరాక్స్‌లు తీసుకుంటారు. విచిత్రమేంటంటే కలర్ జిరాక్స్ సర్టిఫికేట్లను ఆ కాలేజీలోనే పెట్టి ఒరిజినల్ సర్టిఫికేట్లు తెలంగాణలోని కౌన్సిలింగ్‌లకు హాజరవుతారు. ఇక్కడ వచ్చిన సీట్లల్లో చేరిపోతారు. ఇలా ఆ విద్యార్థి రెండు చోట్లా సీట్లు పొంది చేరుతాడు. అన్ని రౌండ్ల కౌన్సిలింగ్‌లు పూర్తయ్యాక తెలంగాణలో తన సీటును రద్దు చేసుకుంటాడు. అయితే సీటు రద్దు చేసుకున్నందుకు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయానికి రూ.3లక్షలు జరిమానా చెల్లించాలి. అలా చెల్లించి రద్దు చేసుకుంటారు. తిరిగి సొంత రాష్ట్రంలో తాను చేరిన కాలేజీకి వెళ్లి ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇచ్చుకుంటాడు. దీంతో అతను తెలంగాణలో వదిలేసిన బీ–కేటగిరీ సీటు ఎన్నారై సీటుగా మారిపోతుంది. ఇలా రాష్ట్రంలో దాదాపు 100 ఎంబీబీఎస్ సీట్లల్లో దందా జరిగినట్లు అంచనా వేస్తున్నారు. ఉన్నతస్థాయి వర్గాల సమాచారం మేరకు ఈ దందాలో అనేక కాలేజీలు పాలుపంచుకున్నాయి. ఇక ఎన్నారై సీటును ఎంతకు అమ్ముకున్నా అడిగే నాథుడే లేడు. డిమాండ్‌ను బట్టి రూ.కోటి నుంచి రూ.కోటిన్నర వరకు కూడా వసూలు చేస్తున్నారు. ఒక యూపీ విద్యార్థి అక్కడ ప్రైవేటు మెడికల్ కాలేజీలో కన్వీనర్ కోటాలో చేరాడు. అతను దళారుల ద్వారా తెలంగాణలో బీ–కేటగిరీ సీటులో చేరాడు. చివరకు శుక్రవారం ఆ సీటును వదులుకున్నందుకు అతనికి రూ.5లక్షలు ముట్టచెప్పారు. దళారులకు రూ.10లక్షల నుంచి రూ.15లక్షలు కూడా ఇచ్చారు. ఇలా కర్ణాటకలో జరిగిన ఎంబీబీఎస్ సీట్ల కుంభకోణంలో కాలేజీల చైర్మన్లు, వైద్యాధికారులు కూడా ఉన్నట్లు పెద్ద ఎత్తున ఆరోపణలున్నాయి. కానీ మన రాష్ట్రంలో ఇదంతా గుట్టుగా జరుగుతోంది. నెల రోజులుగా జరుగుతున్న తంతు శుక్రవారం రాత్రి సీట్ల రద్దుతో ముగిసింది. దీంతో ఈ సీట్లన్నీ ఎన్నారై కోటాగా మారిపోయాయి. శనివారం ఒక్కరోజే ఈ సీట్లలో చేరేందుకు గడువుంది. దీంతో ఒక్క రోజులోనే కోట్లు చేతులు మారనున్నాయి. ఒక అంచనా ప్రకారం ప్రైవేటు కాలేజీలు, దళారులు, విద్యార్థుల మధ్య మొత్తంగా రూ.100 కోట్లు అక్రమంగా చేతులు మారినట్లు అంచనా. ఇక్కడి వారక్కడ.. అక్కడి వారిక్కడ! ఇదిలావుంటే మన రాష్ట్రంలో ఉన్న విద్యార్థులు ఇక్కడికక్కడే సీట్లు మార్చుకునేందుకు వీలుండదు. మన రాష్ట్ర విద్యార్థులను దళారులు ఇతర రాష్ట్రాల్లో ఇలా అక్రమాలు చేయడానికి వినియోగించుకున్నారు. మన రాష్ట్రంలో చేయాలంటే నిబంధనలు ఒప్పుకోవు. ఎందుకంటే ఇక్కడ ఏ కాలేజీలో సీటొచ్చినా.. మరోచోట కలర్ జిరాక్స్ లేదా ఒరిజినల్తోనైనా రెండోచోట చేరడానికి వీలుండదు. ఒకసారి చేరాక మరోసారి కౌన్సిలింగ్లో పాల్గొనాలంటే తన మొదటి సీటును వదులుకోవాల్సిఉంటుంది. అంటే ఒకేసారి రెండుచోట్ల చేరే అవకాశం సొంత రాష్ట్రాల విద్యార్థులకు ఉండదని వైద్య విద్యనిపుణులు చెబుతున్నారు. ఇంత జరుగుతున్నా వైద్య ఆరోగ్యశాఖ కూడా ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తుందన్న విమర్శలున్నాయి. కొందరు అధికారుల హస్తం కూడా ఇందులో ఉన్నట్లు చర్చ జరుగుతోంది. -
మామిడి పేరుతో మస్కా
చెప్పేవన్నీ రైతు సంస్కరణ సుద్దులే. చేసేవన్నీ ఫక్తు మోసాలు. పేరుకే ప్రవాస భారతీయుడు. అడుగుడుగునా రైతులను ముంచడం అతని నైజం. ఆక్రమణలు అతని హాబి. సేంద్రియ సేద్యం, గ్రామాల దత్తత పేరుతో ఆ ఘరానా ఎన్ఆర్ఐ ఇప్పటికే రూ.60 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని తన సొంతం చేసుకున్నాడు. పేద రైతుల నోట్లో దుమ్ముకొట్టి ఆక్రమణలకు తెగబడుతున్నాడు. భాకరాపేటలోని దీన్దార్లపల్లి కేంద్రంగా అబ్దుల్ అలీ చేసే అక్రమాలు అన్నీ ఇన్నీ కావు. ఏళ్ల తరబడి జరిగిన అలీ దోపిడీపై రైతులు మండిపడుతున్నారు. బలవంతంగా లాక్కున్న తమ భూములను తిరిగి అప్పగించాలనే డిమాండ్‌తో ఆందోళనలకు సిద్ధమవుతున్నారు. అలీ అక్రమాలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.. సాక్షి, తిరుపతి రూరల్: చిన్నగొట్టిగల్లు మండలం దీన్దార్లపల్లికి చెందిన అబ్దుల్ అలీ చాలా ఏళ్ల క్రితం పొట్టచేతపట్టుకుని జీవనోపాధి కోసం గల్ఫ్ దేశాలకు తరలివెళ్లాడు. అక్కడ ఉద్యోగం చేసే సమయంలో ఏర్పడిన పరిచయాల కారణంగా మహా రాష్ట్రలోని నాసిక్ ప్రాంతంలో రైతులు నిర్వహించే సాయాద్రి అనే సంస్థలో ఉద్యోగిగా చేరాడు. పూర్తిగా సేంద్రియ సేద్యం, రైతు శ్రేయస్సు కోరే ఈ సంస్థలో దాదాపు 30 వేల మంది రైతులు సభ్యులుగా ఉన్నారు. ఇక్కడికి వచ్చే వివిధ రకాల పంటల దిగుమతులు విదేశాలకు ఎగుమతి అవుతూ ఉంటాయి. ఉద్యోగిగా ఉన్న అలీ ఈ పరిస్థితులను దగ్గరగా పరిశీలించాడు. ఇక్కడ జరుగుతున్న ప్రక్రియను చూసిన అతను తన సొంతూరు అయిన భాకరాపేటలో కిసాన్ సువిధ ఫార్మర్స్(కేఎస్‌ఎఫ్) సంస్థను ఏర్పాటు చేశాడు. చిన్నగొట్టిగల్లు, ఎర్రావారిపాళెం, రొంపిచెర్ల మండలాల్లో అమాయకులైన రైతులను నమ్మించి, కొందరిని సభ్యులుగా చేర్చుకున్నాడు. ఇక్కడ నుంచే అలీ తన ఘరానా మోసాలకు నాంది పలికాడు. ఈ ప్రాంతంలో మామిడి విపరీతంగా పండుతుందనే విషయం అలీకి చాలా బాగా తెలుసు. అందుకే వారి కష్టాన్ని నిలువునా దోచేసే వ్యవస్థను రూపొందించుకున్నాడనే ఆరోపణలున్నాయి. రైతులు పండించిన మామిడి పంటను సేకరించి, సేంద్రియ ఫలసాయం పేరుతో నాసిక్‌కు తరలించి, అక్కడి నుంచి ఎగుమతులు చేయడం ప్రారంభించాడు. వచ్చే ఆదాయం రైతులకు పంచిపెడుతున్నట్లు బిల్డప్ ఇస్తూ అంతర్జాతీయంగా ఉన్న సంస్థల నుంచి సబ్సిడీలు, నిధులను తెచ్చుకుని స్వాహా చేస్తున్నాడనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ స్వాహాల పర్వానికి దశాబ్ధ కాలపు చరిత్ర ఉంది. బలవంతపు భూసేకరణ సేంద్రియ వ్యవసాయం, రైతు సంక్షేమం పేరుతో రైతులను, ప్రభుత్వాన్ని మోసగిస్తున్న అలీ కోట్ల రూ పాయల విలువ చేసే ప్రభు త్వ భూములను కారు చౌకకు కొట్టేసే ప్రయత్నాలు చేశారనే ఆరో పణలున్నాయి. ఈ క్రమంలో రూ.60 కోట్ల విలువ చేసే వంద ఎకరాల భూమికి ఎసరు పెట్టారనే విమర్శలు ఉన్నాయి. ఎర్రావారిపాళెం మండల కేంద్రానికి సమీపంలో భాకరాపేట–ఎర్రావారిపాళెం ప్రధాన రహదారికి అనుకుని ఎర్రావారిపాళెం గ్రామం మబ్బుతోపు వద్ద 100 ఎకరాలను ఆక్రమించుకున్నాడనే ఆరోపణలున్నాయి. గత ప్రభుత్వం అండతో అక్రమంగా, చట్ట విరుద్ధం గా పేదల భూములను బలవంతంగా లాక్కున్నాడనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఏపీఐఐసీని భూ తంగా చూపెట్టి రైతుల నుంచి బలవంతంగా భూ ములు లాక్కున్నారని, చాలామంది రైతులకు దారి సౌకర్యం కూడా లేకుండా చేసి వేధించారనే ఆరోపణలున్నాయి. పశువులు సైతం మేతకు వెళ్లకుండా చుట్టు ప్రహరీ గోడ నిర్మించారని రైతులు వాపోతున్నారు. ఇందులో చాలావరకు దళితులు, బలహీన వర్గాలకు చెందిన వారి డీకేటీ భూములే ఉన్నాయి. వారిని అక్కడి నుంచి వారిని తరిమికొట్టి భూమికి చుట్టూ కంచె వేశాడు. రైతుల నుంచి బలవంతంగా సేకరించిన భూమిని చదును చేసి నిర్మాణాలకు రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. ఈ క్రమంలో కడుపు మండిన రైతులు గత ప్రభుత్వ హయాంలో అధికారులకు ఎన్నోమార్లు ఫిర్యాదు చేశారు. ఫలితం కనిపించకపోవటంతో అప్పట్లోనే అలీపై తిరుగుబాటు చేశారు. పలుకుబడి కలిగిన అలీ బలం ముందు రైతులు నిస్సహాయులుగా మారారు. తాజాగా రైతులు మరోమారు భూపోరాటం కోసం సిద్ధమౌతున్నారు. ఇందులో భాగంగానే అలీ దౌర్జన్యంగా నిర్మించిన కంచె, ప్రహరీ గోడను పాక్షికంగా కూల్చివేసినట్లు సమాచారం. మరోమారు బాధిత రైతులందరూ అందోళనకు సిద్ధమవుతున్నారు. రైతుల భూములను తిరిగి ఇప్పిస్తాం రైతుల నుంచి బలవంతంగా లాక్కున్న భూములను వారికి తిరిగి ఇప్పిస్తాం. ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ద్వారా ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి దృష్టికి సమస్యను తీసుకెళతాం. రైతులను ఆదుకుంటామని మోసగించటం దారుణం. అబ్దుల్ అలీ అక్రమాలపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరతాం. – సంధ్యా, ఎంపీపీ, చిన్నగొట్టిగల్లు గత ప్రభుత్వం కేటాయించింది భూములకు సంబంధించి ఎలాంటి అక్రమాలకూ పాల్పడలేదు. అవన్నీ గత ప్రభుత్వం కేటాయించింది. – అబ్దుల్ అలీ, కిసాన్ సువిధ ఫార్మర్స్ -
‘పాలమూరు’పై ప్రభుత్వానికి సుప్రీం నోటీసులు
సాక్షి, న్యూఢిల్లీ: పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో అవినీతి జరిగిందంటూ కాంగ్రెస్ నేత నాగం జనార్దన్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయా లని ఆదేశించింది. సంబంధిత పిటిషన్‌ను హైకోర్టు లో దాఖలు చేయగా హైకోర్టు దాన్ని తోసిపుచ్చడంతో ఆ ఉత్తర్వులను సవాల్ చేస్తూ సుప్రీం కోర్టును నాగం ఆశ్రయించారు. జస్టిస్ ఎస్ఏ బాబ్డే నేతృత్వం లోని ధర్మాసనం వద్దకు సోమవారం ఈ పిటిషన్ విచారణకు వచ్చింది. పిటిషనర్ తరఫున ప్రశాంత్ భూషణ్ వాదనలు వినిపించారు. ‘పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలోని ప్యాకేజీ 1, 5, 8, 16 పనుల అంచనా వ్యయాన్ని ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియా రూ.5,960.79 కోట్లుగా మదించగా.. తెలంగాణ ప్రభుత్వం బీహెచ్ఈఎల్, మెఘా ఇంజనీరింగ్ ఇన్ఫ్రా లిమిటెడ్, నవయుగ ఇంజనీరింగ్ కంపెనీ లిమిటెడ్ సంస్థలతో కుమ్మక్కై అంచనాలను రూ.8,386 కోట్లకు పెంచింది. దీని ద్వారా ప్రభుత్వ ఖజానాకు రూ.2,426 కోట్లు నష్టం వాటిల్లింది. మోటారు పంపుసెట్లకు అధిక రేటు చూపి, యంత్రాలు డిజైన్ చేసి సరఫరా చేసిన బీహెచ్ఈఎల్ కంటే అదనంగా మెఘా ఇంజనీరింగ్ సంస్థకు చెల్లించారు. ప్యాకేజీ–5లో ఒక పంపు సెట్‌కు రూ.92 కోట్లు, ఒక మోటారుకు రూ.87 కోట్లుగా లెక్కించి 9 మోటారు పంపుసెట్లకు రూ.179 కోట్ల చొప్పున రూ.1,611 కోట్ల చెల్లింపునకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. చెల్లింపుల బ్రేకప్‌లో మాత్రం బీహెచ్ఈఎల్కు రూ.803 కోట్లు చెల్లించి, మిగిలిన రూ.808 కోట్లను మెఘా సంస్థకు చూపారు. వాస్తవానికి ఇక్కడ అయిన ఖర్చు రూ.803 కోట్లు మాత్రమే. ఇక సివిల్ పనులకు మరో రూ.1,459 కోట్లు ఖర్చుగా చూపారు. అంటే యంత్రాల ఖర్చు కంటే సివిల్ పనులకు అదనంగా వెచ్చించారు. ఇక్కడ సివిల్ పనులు చూడాల్సిన మెఘా సంస్థ ఈ రూ.1,459 కోట్లు పొందడమే కాకుండా.. ప్యాకేజీ–5 మొత్తం ఈసీవీ విలువైన రూ.4,018 కోట్లలో మిగిలిన రూ.2,558 కోట్ల నుంచి కూడా తీసుకుంది. వీటిలో బీహెచ్ఈల్కు రూ.803 కోట్లు చెల్లించింది. ఇదే తరహాలో ఎలక్ట్రికల్, మెకానికల్ యంత్రాలకు ఎక్కువ వ్యయా న్ని చూపడం ద్వారా నవయుగ సంస్థకు కూడా లబ్ధి చేకూర్చారు. ప్యాకేజీ 1, 16లలో బీహెచ్ఈఎల్–మెఘా సంస్థ 145 మెగావాట్ల మోటారుకు రూ.38 కోట్లు కోట్ చేసింది. నవయుగ సంస్థ రూ.40 కోట్లకు కోట్ చేసింది. కానీ ప్రభుత్వం 145 మెగావాట్ల మోటారుకు రెండు సంస్థలకు రూ.87 కోట్లు ఆమోదించింది. అంటే దాదాపు రూ.50 కోట్లు పెంచింది. వేల కోట్ల కుంభకోణానికి సంబంధించి ఇన్ని సాక్ష్యాధారాలు ఉన్నా హైకోర్టు వీటిని విస్మరించింది’ అని వాదించారు. ఈ నేపథ్యంలో ధర్మాసనం పిటిషన్‌ను విచారణకు స్వీకరిస్తున్నామని పేర్కొంది. అందులో ఆశ్చర్యమేమీ లేదు.. పాలమూరు అంశంపై పిటిషనర్ 4 పిటిషన్లు దాఖలు చేయగా హైకోర్టు రెండింటిని కొట్టేసిందని, మరో రెండు పెండింగ్‌లో ఉన్నాయని ప్రభుత్వం తరఫు న్యాయవాది ముకుల్ రోహత్గీ ధర్మాసనానికి నివేదించారు. యంత్రాల ఖర్చు కంటే సివిల్ పనులకు ఎక్కువ వ్యయం కావడంలో ఆశ్చర్యం లేదని, ఆ ప్రాజెక్టు స్వరూపమే ఎత్తిపోతల ప్రాజెక్టు అని వివరించారు. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ కూడా ఆరోపణలను తోసిపుచ్చిందని వివరించారు. జస్టిస్ ఎస్.ఎ.బాబ్డే స్పందిస్తూ ‘మీ వాదనలు కూడా వింటాం. అంకెలు చూస్తుంటే అసాధారణ రీతిలో ఉన్నాయి. ప్రభుత్వ కాంట్రాక్టుల్లోనే ఇలాంటివి ఎందుకు జరుగుతున్నాయి. మీరు కరెక్టే కావచ్చు. కానీ ఈ కేసును మేం విచారిస్తాం’ అని పేర్కొన్నారు. దీనికి ముకుల్ రోహత్గీ బదులిస్తూ ‘హైకోర్టు ఈ అంశాలను కొట్టివేసింది’ అని నివేదించగా జస్టిస్ ఎస్.ఎ.బాబ్డే స్పందించారు. ‘హైకోర్టు కొట్టివేసి ఉండొచ్చు. కానీ అంకెలు అసాధారణ రీతిలో ఉండటాన్ని హైకోర్టు ప్రస్తావించలేదు’ అని జస్టిస్ పేర్కొన్నారు. బీహెచ్ఈఎల్ తరపు న్యాయవాదిని ఉద్దేశిస్తూ.. ‘ఒకవేళ బీహెచ్ఈఎల్ సంస్థ తాను సరఫరా చేసిన పంపుసెట్లు, మోటారు సెట్లు అమర్చడంతో పాటు సివిల్ పనులు చేపట్టి ఉంటే ఎంత వసూలు చేసేది..’ అని ప్రశ్నించారు. దీనికి న్యాయవాది స్పందిస్తూ ఖర్చు మదింపు చేయాల్సి ఉంటుందని వివరించారు. ఈ నేపథ్యం లో కేసును ఏప్రిల్ 26కు వాయిదా వేస్తూ ధర్మాసనం ఉత్తర్వులు జారీచేసింది. -
దేశంలో అతిపెద్ద ఆర్థిక కుంభకోణం - కోబ్రాపోస్ట్
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో మరో అతిపెద్ద ఫైనాన్షియల్ స్కాం అంటూ కోబ్రాపోస్ట్ బాంబు పేల్చింది. దీవాన్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్(డిహెచ్ఎఫ్ఎల్) రూ.31వేల కోట్ల కుంభకోణానికి పాల్పడిందని కోబ్రాపోస్ట్ వెబ్సైట్లో మంగళవారం ప్రకటించింది. ఈ స్కాంకు సంబంధించిన ఆధారాలను కూడా కోబ్రాపోస్ట్ ట్విటర్లో పోస్ట్ చేసింది. కోబ్రా పోస్ట్ అందించిన సమాచారం ప్రకారం షెల్ (డొల్ల) కంపెనీల నెట్వర్క్ ద్వారా కంపెనీ ప్రమోటర్లు మురికివాడల అభివృద్ధి పేరుతో అక్రమపద్ధతిలో వేల కోట్ల రూపాయలను దారి మళ్లించారు. తద్వారా భారతదేశంలోనే అతిపెద్ద ఆర్థిక కుంభకోణానికి పాల్పడ్డారని ట్వీట్ చేసింది. ముఖ్యంగా డిహెచ్ఎఫ్ఎల్ ప్రమోటర్లకు ఒకే అడ్రస్‌తో ఉన్న అనేక షెల్ కంపెనీలకు ఎలాంటి సెక్యూరిటీస్ లేకుండానే షెల్ కంపెనీలకు భారీగా రుణాలిచ్చింది. రూ.21,477 కోట్ల డిహెచ్ఎఫ్ఎల్ నిధులను వివిధ షెల్ కంపెనీలకు రుణాలుగా, పెట్టుబడులుగా అందించారని, డిహెచ్ఎఫ్ఎల్ ప్రోత్సాహక కంపెనీలకు రూ .31,000 కోట్లు చెల్లించారని ఆరోపించింది. మహారాష్ట్రలో మురికివాడల అభివృద్ధి పేరుతో ఈ షెల్ కంపెనీలకు వేలకోట్ల రూపాయలను సంస్థ కట్టబెట్టిందనీ ఆరోపించింది. ఇలా దాదాపు 45 కంపెనీలున్నాయని ఇందులో 34 సంస్థలకు వాద్వాన్ ఫ్యామిలీతో ప్రత్యక్ష సంబంధాలను కలిగి వున్నాయని కూడా కోబ్రా పోస్ట్ ఆరోపించింది. అంతేకాదు ఈ రుణాలకు సంబంధిందించిన వివరాలను కంపెనీ ఆర్థిక రిపోర్టుల్లో పొందుపర్చలేదని పేర్కొంది. ఇలా అక్రమంగా ఆర్జించిన సొమ్ముతో ప్రమోటర్లు విదేశాల్లో సొంత ఆస్తులు, పెద్ద పెద్ద కంపెనీల్లో షేర్లను కొన్నారని తెలిపింది. డిహెచ్ఎఫ్ఎల్ ముఖ్య ప్రమోటర్లు కపిల్ వాద్వాన్, అరుణా వాద్వాన్, ధీరజ్ వాద్వాన్ సహా పలువురికి ఇంగ్లండ్, దుబాయ్, శ్రీలంక, మారిషస్ దేశాల్లో వ్యక్తిగతంగా ఆస్తులు కూడ బెట్టుకున్నారని పేర్కొంది. ఈ నేపథ్యంలో సెబీ, ఐటీ, నల్లధనం, మనీ లాండరింగ్ చట్టం, కంపెనీ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న ఈ కంపెనీపై తక్షణమే విచారణ చెపట్టాలని కోరింది. దీంతోపాటు బీజీపీకి కోట్ల రూపాయల చందాలిచ్చిందని కోబ్రా పోస్ట్ ఆరోపించడం గమనార్హం. ఈ వార్తలతో డిహెచ్ఎఫ్ఎల్ షేరు ఇవాల్టి మార్కెట్లో దాదాపు 10శాతానికి పైగా నష్టపోయింది. అయితే చివర్లో తేరుకుని 5శాతం నష్టాలకు పరిమితమైంది. మరోవైపు ఇప్పటికే వివాదాల్లో చిక్కుకున్న సంస్థకు తాజా ఆరోపణలు మరింత ప్రతికూలమని ఎనలిస్టులు చెబుతున్నారు. Dewan’s financial credentials: Rs 8,700 crore net worth, Rs 96,000 crore money raised through loans and public deposits. pic.twitter.com/UGH2gQzteV — Cobrapost (@cobrapost) January 29, 2019 Here is a single infograph that explains what Cobrapost has unearthed about #LooteraDewan. pic.twitter.com/0SQqEBSePe — Cobrapost (@cobrapost) January 29, 2019 -
‘పరిశీలన’లో పీఎన్బీ రేటింగ్‌లు
ముంబై: భారీ స్కామ్‌తో వణికిపోతున్న పంజాబ్ నేషనల్ బ్యాంకు రేటింగ్లను పరిశీలనలో పెడుతున్నట్టు ప్రముఖ రేటింగ్ సంస్థ క్రిసిల్ ప్రకటించింది. ముంబైలోని బ్రాడీహౌస్ శాఖలో రూ.11,400 కోట్ల ఎల్వోయూల కుంభకోణం వెలుగు చూసిన విషయం విదితమే. నీరవ్ మోదీ, ఆయన కంపెనీలు ఈ మేరకు బ్యాంకు ఉద్యోగుల సాయంతో మోసపూరిత లావాదేవీలకు పాల్పడ్డారు. ఎస్బీఐ తర్వాత ప్రభుత్వ రంగంలో రెండో అతిపెద్ద బ్యాంకు అయిన పీఎన్బీకి సంబంధించి డెట్ ఇన్స్ట్రుమెంట్లకు క్రిసిల్ ఏఏఏ, ఏఏ రేటింగ్‌లు కేటాయించి ఉంది. ‘‘పీఎన్బీ డెట్ ఇనుస్ట్రెమెంట్లపై మా రేటింగ్లను ‘పెరుగుతున్న అనుమానాల నేపథ్యంలో రేటింగ్ పరిశీలన’లో ఉంచాం. బ్రాడీహౌస్ బ్రాంచ్‌లో మోసపూరిత, అనధికారిక లావాదేవీలను గుర్తించినట్టు ఫిబ్రవరి 14 నాటి ప్రకటనలో వెల్లడించడంతో ఈ నిర్ణయం తీసుకున్నాం’’ అని క్రిసిల్ పేర్కొంది. ఈ స్కామ్ కారణంగా ఏర్పడే చెల్లింపుల బాధ్యత, పరిమాణం, రికవరీ అవకాశాలు, ప్రొవిజనింగ్ అంచనాలు, మూలధన రేషియోపై పడే ప్రభావం గురించి పీఎన్బీ నుంచి స్పష్టత కోరినట్టు క్రిసిల్ తెలిపింది. వీటిపై స్పష్టత వచ్చిన అనంతరం పరిశీలన జాబితా నుంచి పీఎన్బీ రేటింగ్లను తొలగించి తుది నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది. పెరిగిన ఉద్దేశపూర్వక ఎగవేతలు పీఎన్బీలో జనవరితో ముగిసిన చివరి ఎనిమిది నెలల కాలంలో ఉద్దేశపూర్వక భారీ రుణ ఎగవేతల మొత్తం (రూ.25 లక్షలపైన రుణం తీసుకున్న కేసులు) 23 శాతం పెరిగిపోయింది. వీటికి సంబంధించిన బకాయిలు రూ.14,593 కోట్లు. గతేడాది జూన్ నుంచి బ్యాంకు ఈ డేటాను విడుదల చేస్తోంది. అప్పుడు ఉద్దేశ్యపూర్వక ఎగవేతలు రూ.11,879 కోట్లుగా ఉన్నాయి. అప్పటి నుంచి చూస్తే జనవరి నాటికి ఎనిమిది నెలల్లో 22.8 శాతం పెరిగినట్టు తెలుస్తోంది. మొండి బకాయిల వసూళ్లపై తమ చర్యల్ని తీవ్రతరం చేసిన కాలంలోనే ఇవి పెరగడం గమనార్హం. అయితే మొత్తం మీద ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్ నాటికి బ్యాంకు నికర ఎన్పీఏలు రూ.34,076 కోట్లుగా ఉన్నాయి. అంతకుముందు ఏడాది ఇదే కాలంలో ఇవి రూ.34,994 కోట్లు. అంటే స్వల్పంగా తగ్గినట్టు తెలుస్తోంది. స్థూల ఎన్పీఏలు రూ.57,519 కోట్లుగా ఉన్నాయి. అంతకుముందు ఏడాది ఇదే కాలంలో ఉన్న రూ.55,628 కోట్లతో పోలిస్తే కొంచెం పెరిగాయి. గీతాంజలి గ్రూపు రికార్డుల పరిశీలన పీఎన్బీ స్కామ్ విచారణలో భాగంగా సీబీఐ, మెహుల్ చోక్సి ప్రమోట్ చేసిన గీతాంజలి గ్రూపు కంపెనీల బ్యాలన్స్ షీట్లను పరిశీలిస్తోంది. పీఎన్బీ నుంచి తీసుకున్న రూ.11,384 కోట్ల ఎల్వోయూల ఆధారంగా వివిధ బ్యాంకు శాఖల నుంచి డ్రా చేసుకున్న మొత్తం ఎంతన్న దానిని తేల్చే పని ప్రారంభించినట్టు అధికార వర్గాలు తెలిపాయి. బ్యాంకు రిటైర్డ్ ఉద్యోగి గోకుల్‌నాథ్‌శెట్టి, మనోజ్ ఖారత్, నీరవ్‌మోదీ కంపెనీ ఉద్యోగి ఒకరిని సీబీఐ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. వీరితోపాటు పీఎన్బీకి చెందిన ఇతర ఉద్యోగుల నుంచి సమాచారం రాబడుతోంది. మెహుల్ చోక్సీకి వ్యతిరేకంగా ఎఫ్ఐఆర్ దాఖలు చేసిన తర్వాత స్వాధీనం చేసుకున్న రికార్డులను పరిశీలిస్తున్నట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. నీరవ్‌మోదీ, మెహుల్ చోక్సీ ఇద్దరూ దగ్గరి బంధువులన్న విషయం తెలిసిందే. మరోవైపు వీరికి ఎల్వోయూల ఆధారంగా క్రెడిట్ ఇచ్చిన విదేశీ బ్యాంకు శాఖల ఉద్యోగులను కూడా సీబీఐ విచారించనుంది. హాంగ్‌కాంగ్‌లోని అలహాబాద్ బ్యాం కు, ఎస్బీఐ, యూనియన్ బ్యాంకు, యూకో బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు ఉద్యోగులకు ఈ స్కామ్‌లో పాత్ర ఉన్నట్టు అధికార వర్గాల సమాచారం. నిబంధనల మేరకు ఎల్వోయూలు 90 రోజుల వరకే ఉండాలని, 365 రోజులు కాదని అవి వెల్లడించాయి. కనుక ఉద్యోగులకు తెలిసే ఇది జరిగి ఉంటుందని పేర్కొన్నాయి. -
అయ్యబాబోయ్..ఇంత స్కామా?
► హాస్టల్ బ్యాంక్ ఖాతా నుంచి రూ.64 లక్షలు మింగేశారు ► పాలకొండ హాస్టల్ ఖాతానుంచి మరో రూ.14 లక్షలు ► సీతంపేట ఖాతా తెరిస్తే ఇంకెంతో? ► 2010లోనే స్కాంకు బీజం శ్రీకాకుళం టౌన్: పేద విద్యార్థులకు చెందాల్సిన లక్షలాది రూపాయలు రాబంధుల పాలైంది. శనివారం సాయంత్రానికి శ్రీకాకుళం పోస్టుమెట్రిక్ హాస్టల్ ఖాతా నంబరు 11152305021లో రూ.64 లక్షలు (2014-2015 , 2015-16 విద్యా సంవత్సరంలో) అక్రమార్కులు కొల్లగొట్టేసినట్టు వెలుగు చూసింది. 2010 నుంచి చిన్న మొత్తంతో ఆరంభమైన ఈ వ్యవహారం 2014 నాటికి రూ.లక్షలకు చేరువైంది. ఇక్కడ ఏటీడబ్ల్యూవోగా వ్యవహరించిన ఎర్రన్నాయుడు సంతకాలతోనే చెక్కులు జారీ అవడంతో ఇందులో ఆయ న్నీ సూత్రధారిగా భావిస్తున్నారు. అలాగే పాలకొండ ట్రైబల్ పోస్టుమెట్రిక్ హాస్టల్లో వార్డెన్ ఖాతా నుంచి రూ.14 లక్షలు 2015 జూలై నెలలో విత్‌డ్రా చేశారు. ఇప్పటివరకు గుర్తించిన ప్రకారం రూ.78 లక్షలు ప్రభుత్వ నిధులు కాజేసి వాటాలుగా పంచుకున్నారు. ఇంకా సీతంపేట తోపాటు మరో 15 పోస్టుమెట్రిక్ హాస్టళ్ల ఖాతాల నుం చి జరిపిన లావాదేవీల్లో ఇంకా లెక్కతేలాల్సిఉంది. అవినీతికి బీజం ఇలా.. శ్రీకాకుళంలోని గిరిజన సంక్షేమ శాఖ వసతిగృహంలో 1, 2 హాస్టళ్లు ఒకే వార్డెన్ పర్యవేక్షణలో సాగుతున్నాయి. సుమారు 600 మంది విద్యార్థినులకు లెక్కచూపించి వందల్లో విద్యార్థులు గైర్హాజరైనా పూర్తి హాజరు చూపించే ప్రక్రియ సాగేది. ఇందులోనూ రూ.లక్షలు చేతులు మారినప్పటి కీ అధికారులు నోరు మెదపలేక పోయారు. ఇదే అదునుగా చూసుకుని లేని పిల్లలకు హాజరు వేసే అలవాటు ఉండడంతో అదేపనిగా ఉపకార వేతనాలు కాజేందుకు రూపకల్పన చేశారు. ఇందులో తనవంతు పాత్రపోషించిన వార్డెన్ ఝాన్సీరాణిని సస్పెండ్ చేసిన అధికారులు ఆమె నుంచి పూర్తి బాధ్యతలను బదాలాయించారు. శనివారం డీడీ నాయక్‌తో, ఏటీడబ్ల్యూవో బల్ల అప్పారావుతోపాటు సాంఘిక సంక్షేమ శాఖాధికారిణి హాజరై లావాదేవీలన్నింటినీ పరిశీలించారు. మరోవైపు పాలకొండ వసతిగృహంలో కూడా వార్డెన్‌గా ఉన్న వెంకటనాయుడు నుంచి బాధ్యతలను బదలాయించారు. అ(ఉ)పకారం పై ఏసీబీ నివేదిక సిద్ధం శ్రీకాకుళం: ఉపకార వేతనాల స్కాం రోజుకో మలుపు తిరుగుతోంది. ఈస్కాం బయటపడ్డ నాటినుంచి అవినీతి నిరోధక శాఖ అడుగడుగున క్షుణ్ణంగా పరిశీలన జరిపి నిజాలను నిగ్గు తేల్చేపనిలో పడింది. పాలకొండ కేంద్రంగానే ఈస్కాం మూలాలు బయటపడ్డాయి. పాలకొండలోనే పకడ్బందీ వ్యూహంతో కొందరు గిరిజన సంక్షేమ శాఖ అధిరులు స్కార్షిప్పుల కోసం పెట్టుకున్న విద్యార్థుల దరఖాస్తులను హాస్టల్ విద్యార్థులుగా రూపు మార్చారు. అజయ్‌కుమార్ అనే కంప్యూటర్ ఆపరేటర్ దీన్ని ఆసరాగా చేసుకుని బీసీ సంక్షేమ శాఖ అధికారులను నేరుగా కలుసుకుని వ్యూహాన్ని వివరించారు. ఈ వ్యూహంలో నేరుగా బీసీ సంక్షేమ శాఖను సంప్రదించింది అజయ్ కుమార్ మాత్రమేనని తేల్చారు. అయితే అజయ్‌కుమార్‌ను గిరిజన సంక్షేమ శాఖలో ఎవరెవరు కలిశారు.. ఎక్కడ కలిశారు.. విద్యార్థుల దరఖాస్తులు ఎక్కడినుంచి వచ్చాయి. సీతంపేట, పాలకొండ, శ్రీకాకుళం పోస్టు మెట్రిక్ హాస్టళ్లలోనే బిసి విద్యార్థులు ఉన్నట్టు ఎలా చూపించారన్న సందేహాలపై ఏసీబీ శోధించింది. ఇందులో బీసీ సంక్షేమ శాఖ ఖాతాలకు ఈదరఖాస్తులు వచ్చినపుడు గుమస్తా బాలరాజు ఏంచేస్తున్నారనేది ఆ శాఖ అధికారులు ప్రశ్నించారు. బాధ్యులను విచారించి తుది నివేదికలు సిద్ధం చేసిన ఆశాఖ డిఎస్పీ రంగరాజు శనివారం కలెక్టరును కలసి వివరించారు. ట్రెజరీలో సోదాలుః ఉపకార వేతనాల స్కాంలో ఖజానా శాఖ పాత్రను ఇప్పటికే గుర్తించిన అవినీతి నిరోధక శాఖ అధికారులు శనివారం ఆఫైల్‌ను పరిశీలించిన ఉద్యోగులను ప్రశ్నించారు. ఐటీడీఏ పరిధిలో డెప్యూటీ డెరైక్టరుగా ఇన్చార్జి బాధ్యతల్లో ఉన్న నాయక్ , ఏటీడబ్ల్యుఓ బల్ల అప్పారావులను విచారించారు. వారి వాంగ్మూలాన్ని సేకరించి నివేదికలను సిద్ధం చేశారు. ఇన్చార్జి బిసి సంక్షేమ శాఖాధికారిగా వ్యవహరిస్తున్న ధనుంజయరావు బాధ్యులపై క్రిమినల్ చర్యలు చేపట్టేందుకు కలెక్టరు అనుమతికోరారు. గిరిజన సంక్షేమ శాఖ అధికారులు కూడా కలెక్టరు అనుమతి కోరుతూ లేఖ రాశారు. ఆ లేఖను పరిశీలించిన తర్వాత చర్చించేందుకు కలెక్టరేటులో హాజరుకావాలని కలెక్టరు సంభందితశాఖల అథికారులను శనివారం ఆదేశించారు. ఈ ఆదేశాలప్రకారం ఆదివారం రెండుశాఖల నుంచి అధికారులు కలెక్టరేటులో హాజరైన తర్వాత తుదినిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.. రాజకీయ ఒత్తిళ్లు: ఉపకార వేతనాలను అడ్డదారిలో ఖాతాలకు మళ్లించుకున్న వ్యవహారంలో బాధ్యులుగా ఉన్న వారు రాజకీయ పైరవీలకు సిద్దపడ్డారు. అజయ్ మినహా మిగిలిన వారంతా అధికార పార్టీ పెద్దలపై ఒత్తిడి పెంచి కేసునుంచి బయటపడేందుకు ముమ్మర ప్రయత్నాలు సాగిస్తున్నారు.