‘పాలమూరు’పై ప్రభుత్వానికి సుప్రీం నోటీసులు | SC notice to Telangana, BHEL on alleged irrigation scam | Sakshi
Sakshi News home page

‘పాలమూరు’పై ప్రభుత్వానికి సుప్రీం నోటీసులు

Published Tue, Mar 26 2019 5:27 AM | Last Updated on Tue, Mar 26 2019 5:38 AM

SC notice to Telangana, BHEL on alleged irrigation scam - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో అవినీతి జరిగిందంటూ కాంగ్రెస్‌ నేత నాగం జనార్దన్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లో కౌంటర్‌ దాఖలు చేయా లని ఆదేశించింది. సంబంధిత పిటిషన్‌ను హైకోర్టు లో దాఖలు చేయగా హైకోర్టు దాన్ని తోసిపుచ్చడంతో ఆ ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ సుప్రీం కోర్టును నాగం ఆశ్రయించారు. జస్టిస్‌ ఎస్‌ఏ బాబ్డే నేతృత్వం లోని ధర్మాసనం వద్దకు సోమవారం ఈ పిటిషన్‌ విచారణకు వచ్చింది.  పిటిషనర్‌ తరఫున ప్రశాంత్‌ భూషణ్‌ వాదనలు వినిపించారు. ‘పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలోని ప్యాకేజీ 1, 5, 8, 16 పనుల అంచనా వ్యయాన్ని ఇంజనీరింగ్‌ స్టాఫ్‌ కాలేజీ ఆఫ్‌ ఇండియా రూ.5,960.79 కోట్లుగా మదించగా.. తెలంగాణ ప్రభుత్వం బీహెచ్‌ఈఎల్, మెఘా ఇంజనీరింగ్‌ ఇన్‌ఫ్రా లిమిటెడ్, నవయుగ ఇంజనీరింగ్‌ కంపెనీ లిమిటెడ్‌ సంస్థలతో కుమ్మక్కై అంచనాలను రూ.8,386 కోట్లకు పెంచింది.

దీని ద్వారా ప్రభుత్వ ఖజానాకు రూ.2,426 కోట్లు నష్టం వాటిల్లింది. మోటారు పంపుసెట్లకు అధిక రేటు చూపి, యంత్రాలు డిజైన్‌ చేసి సరఫరా చేసిన బీహెచ్‌ఈఎల్‌ కంటే అదనంగా మెఘా ఇంజనీరింగ్‌ సంస్థకు చెల్లించారు. ప్యాకేజీ–5లో ఒక పంపు సెట్‌కు రూ.92 కోట్లు, ఒక మోటారుకు రూ.87 కోట్లుగా లెక్కించి 9 మోటారు పంపుసెట్లకు రూ.179 కోట్ల చొప్పున రూ.1,611 కోట్ల చెల్లింపునకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. చెల్లింపుల బ్రేకప్‌లో మాత్రం బీహెచ్‌ఈఎల్‌కు రూ.803 కోట్లు చెల్లించి, మిగిలిన రూ.808 కోట్లను మెఘా సంస్థకు చూపారు. వాస్తవానికి ఇక్కడ అయిన ఖర్చు రూ.803 కోట్లు మాత్రమే. ఇక సివిల్‌ పనులకు మరో రూ.1,459 కోట్లు ఖర్చుగా చూపారు. అంటే యంత్రాల ఖర్చు కంటే సివిల్‌ పనులకు అదనంగా వెచ్చించారు.

ఇక్కడ సివిల్‌ పనులు చూడాల్సిన మెఘా సంస్థ ఈ రూ.1,459 కోట్లు పొందడమే కాకుండా.. ప్యాకేజీ–5 మొత్తం ఈసీవీ విలువైన రూ.4,018 కోట్లలో మిగిలిన రూ.2,558 కోట్ల నుంచి కూడా తీసుకుంది. వీటిలో బీహెచ్‌ఈల్‌కు రూ.803 కోట్లు చెల్లించింది. ఇదే తరహాలో ఎలక్ట్రికల్, మెకానికల్‌ యంత్రాలకు ఎక్కువ వ్యయా న్ని చూపడం ద్వారా నవయుగ సంస్థకు కూడా లబ్ధి చేకూర్చారు. ప్యాకేజీ 1, 16లలో బీహెచ్‌ఈఎల్‌–మెఘా సంస్థ 145 మెగావాట్ల మోటారుకు రూ.38 కోట్లు కోట్‌ చేసింది. నవయుగ సంస్థ రూ.40 కోట్లకు కోట్‌ చేసింది. కానీ ప్రభుత్వం 145 మెగావాట్ల మోటారుకు రెండు సంస్థలకు రూ.87 కోట్లు ఆమోదించింది. అంటే దాదాపు రూ.50 కోట్లు పెంచింది. వేల కోట్ల కుంభకోణానికి సంబంధించి ఇన్ని సాక్ష్యాధారాలు ఉన్నా హైకోర్టు వీటిని విస్మరించింది’ అని వాదించారు. ఈ నేపథ్యంలో ధర్మాసనం పిటిషన్‌ను విచారణకు స్వీకరిస్తున్నామని పేర్కొంది.

అందులో ఆశ్చర్యమేమీ లేదు..
పాలమూరు అంశంపై పిటిషనర్‌ 4 పిటిషన్లు దాఖలు చేయగా హైకోర్టు రెండింటిని కొట్టేసిందని, మరో రెండు పెండింగ్‌లో ఉన్నాయని ప్రభుత్వం తరఫు న్యాయవాది ముకుల్‌ రోహత్గీ ధర్మాసనానికి నివేదించారు. యంత్రాల ఖర్చు కంటే సివిల్‌ పనులకు ఎక్కువ వ్యయం కావడంలో ఆశ్చర్యం లేదని, ఆ ప్రాజెక్టు స్వరూపమే ఎత్తిపోతల ప్రాజెక్టు అని వివరించారు. సెంట్రల్‌ విజిలెన్స్‌ కమిషన్‌ కూడా ఆరోపణలను తోసిపుచ్చిందని వివరించారు. జస్టిస్‌ ఎస్‌.ఎ.బాబ్డే స్పందిస్తూ ‘మీ వాదనలు కూడా వింటాం. అంకెలు చూస్తుంటే అసాధారణ రీతిలో ఉన్నాయి. ప్రభుత్వ కాంట్రాక్టుల్లోనే ఇలాంటివి ఎందుకు జరుగుతున్నాయి. మీరు కరెక్టే కావచ్చు. కానీ ఈ కేసును మేం విచారిస్తాం’ అని పేర్కొన్నారు.

దీనికి ముకుల్‌ రోహత్గీ బదులిస్తూ ‘హైకోర్టు ఈ అంశాలను కొట్టివేసింది’ అని నివేదించగా జస్టిస్‌ ఎస్‌.ఎ.బాబ్డే స్పందించారు. ‘హైకోర్టు కొట్టివేసి ఉండొచ్చు. కానీ అంకెలు అసాధారణ రీతిలో ఉండటాన్ని హైకోర్టు ప్రస్తావించలేదు’ అని జస్టిస్‌ పేర్కొన్నారు. బీహెచ్‌ఈఎల్‌ తరపు న్యాయవాదిని ఉద్దేశిస్తూ.. ‘ఒకవేళ బీహెచ్‌ఈఎల్‌ సంస్థ తాను సరఫరా చేసిన పంపుసెట్లు, మోటారు సెట్లు అమర్చడంతో పాటు సివిల్‌ పనులు చేపట్టి ఉంటే ఎంత వసూలు చేసేది..’ అని ప్రశ్నించారు. దీనికి న్యాయవాది స్పందిస్తూ ఖర్చు మదింపు చేయాల్సి ఉంటుందని వివరించారు. ఈ నేపథ్యం లో కేసును ఏప్రిల్‌ 26కు వాయిదా వేస్తూ ధర్మాసనం ఉత్తర్వులు జారీచేసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement