మెడికల్‌ సీట్లలో భారీ దందా | Some Private Medical Colleges Started A huge scam In MBBS Seats In Telangana | Sakshi
Sakshi News home page

మెడికల్‌ సీట్లలో భారీ దందా

Published Sat, Aug 31 2019 1:40 AM | Last Updated on Sat, Aug 31 2019 10:14 AM

Some Private Medical Colleges Started A huge scam In MBBS Seats In Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఎంబీబీఎస్‌ సీట్లలో భారీ కుంభకోణానికి రాష్ట్రంలో కొన్ని ప్రైవేటు మెడికల్‌ కాలేజీలు తెరలేపాయి. నెల రోజులుగా జరుగుతున్న ఈ దందా ప్రక్రియ చివరి అంకానికి చేరుకుంది. బీ–కేటగిరీలో వివిధ కౌన్సెలింగ్‌లలో చేరిన పలువురు ఇతర రాష్ట్రాల విద్యార్థులు శుక్రవారం సాయం త్రం తమ సీట్లను రద్దు చేసుకున్నారు. అలా రద్దు చేసుకున్నాక మిగిలిపోయిన సీట్లు ఎన్నారై కోటాగా మారిపోయాయి. ముందస్తుగా వేసుకున్న ప్రణాళిక ప్రకారం అటు దళారులు, ఇటు ప్రైవేటు మెడికల్‌ కాలేజీలు ఆ ఎన్నారై సీట్లను ఎక్కువ ధరకు సీటు రాని ఇతర విద్యార్థులకు అమ్ముకున్నారు. అలా ఎక్కువ ధరకు కొనుగోలు చేసిన విద్యార్థులు శనివారం (31 ఆగస్టు)మెడికల్‌లో అడ్మిషన్లు తీసుకోనున్నారు.

ఈ దందాలో అనేక ముఠాలు, ప్రైవేటు కాలేజీలు, కొందరు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు భాగస్వాములుగా ఉండడం గమనార్హం. తద్వారా అక్రమంలో పాలుపంచుకున్న విద్యార్థులకు లక్షలకు లక్షలు, దళారులు, ప్రైవేటు మెడికల్‌ కాలేజీలకు అక్రమంగా, అప్పనంగా కోట్ల రూపాయలు దక్కాయి. కర్ణాటకలో ఈ వ్యవహారంలో దాదాపు రూ.500 కోట్ల కుంభకోణం జరిగినట్లు వార్తలు రాగా, అదే తరహాలో మన రాష్ట్రంలోనూ జరుగుతున్నాయి. ఇంత జరుగుతున్నా వైద్య ఆరోగ్యశాఖ చోద్యం చూస్తుండటం పై విమర్శలు వస్తున్నాయి. 

పెద్ద ముఠాలే ! 
రాష్ట్రంలో 21 ప్రైవేటు మెడికల్‌ కాలేజీలున్నాయి. అందులో నాన్‌–మైనారిటీ మెడికల్‌ కాలేజీల్లో 2,500 ఎంబీబీఎస్‌ సీట్లున్నాయి. వాటిల్లో బీ–కేటగిరీ 875 సీట్లుండగా, 375 ఎన్నారై సీట్లున్నాయి. ఇక మైనారిటీ కాలేజీల్లో 550 ఎంబీబీఎస్‌ సీట్లుండగా అందులో 136 బీ–కేటగిరీ సీట్లు, 84 ఎన్నారై కోటా సీట్లు. ఇక ప్రస్తుతం ఎంబీబీఎస్‌ బీ–కేటగిరీ ఫీజు ఏడాదికి రూ.11.55 లక్షలుంది. సీ–కేటగిరీ ఫీజు ఏడాదికి రూ.23.10 లక్షలు. అంటే బీ–కేటగిరీ ఫీజుకు రెట్టింపు ఫీజు సీ–కేటగిరీ సీటుకుంది. అంటే ప్రైవేటు మెడికల్‌ కాలేజీలకు సీ–కేటగిరీ ఫీజుతోనే రెట్టింపు లాభం వస్తుంది.

బీ–కేటగిరీ సీట్లకు రెండు విడతల కౌన్సిలింగ్, మాప్‌–అప్‌ రౌండ్‌ కౌన్సిలింగ్‌ పూర్తయ్యాక మిగిలే సీట్లు ఆటోమెటిక్‌గా ఎన్నారై కోటా సీట్లుగా మారిపోతాయని గతంలోనే సర్కారు జీవో ఇచ్చింది. ఈ జీవోను ఆధారం చేసుకొనే భారీ కుంభకోణానికి తెరలేచింది. పైగా నీట్‌ ర్యాంకుల నేపథ్యంలో రాష్ట్రంలోని బీ, ఎన్‌ఆర్‌ఐ (సీ) కేటగిరీ సీట్లకు దేశంలోని ఏ రాష్ట్రానికి చెందిన విద్యార్థులైనా దరఖాస్తు చేసుకోవచ్చు. దీంతో బీ–కేటగిరీకి జరిగిన తొలి, రెండో విడతలతోపాటు మాప్‌–అప్‌ రౌండ్‌ కౌన్సెలింగ్‌ ఇతర రాష్ట్రాల విద్యార్థులను దళారులు చేర్పించారు. అందుకోసం దేశవ్యాప్తంగా అనేక ముఠాలు నడుస్తున్నాయి. 
 
ఉచ్చులోకి విద్యార్థులు, కుటుంబ సభ్యులు 
ప్రైవేటు మెడికల్‌ కాలేజీలు ఈ ముఠాలతో ఒప్పందం చేసుకున్నాయి. నీట్‌లో మంచి ర్యాంకు వచ్చిన ఇతర రాష్ట్రాల విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు దళారులు ఆశ చూపి వారిని ఈ ఉచ్చులోకి లాగారు. ఉదాహరణకు ఒక విద్యార్థికి నీట్‌లో మంచి ర్యాంకు వచ్చింది. అతను ఏ ఉత్తరప్రదేశ్‌లోనో రాజస్థాన్‌లోనూ ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలోనైనా లేదా ప్రైవేటు మెడికల్‌ కాలేజీలోనైనా సీటు సంపాదించాడనుకోండి. అక్కడ అతను చేరుతాడు. అలాగే ఆ విద్యార్థి తెలంగాణలోని ఏదో ఒక ప్రైవేటు మెడికల్‌ కాలేజీలో బీ–కేటగిరీ కౌన్సిలింగ్‌కు హాజరవుతాడు. అందుకోసం అవసరమైన ఒరిజినల్‌ సర్టిఫికెట్లు కూడా తీసుకొస్తాడు.

ఆ రాష్ట్రంలో విద్యార్థి చేరిన కాలేజీలో ఉన్న క్లర్క్‌లకు దళారులు 10–15వేలు ఇచ్చి ఒరిజినల్‌ సర్టిఫికేట్ల కలర్‌ జిరాక్స్‌లు తీసుకుంటారు. విచిత్రమేంటంటే కలర్‌ జిరాక్స్‌ సర్టిఫికేట్లను ఆ కాలేజీలోనే పెట్టి ఒరిజినల్‌ సర్టిఫికేట్లు తెలంగాణలోని కౌన్సిలింగ్‌లకు హాజరవుతారు. ఇక్కడ వచ్చిన సీట్లల్లో చేరిపోతారు. ఇలా ఆ విద్యార్థి రెండు చోట్లా సీట్లు పొంది చేరుతాడు. అన్ని రౌండ్ల కౌన్సిలింగ్‌లు పూర్తయ్యాక తెలంగాణలో తన సీటును రద్దు చేసుకుంటాడు. అయితే సీటు రద్దు చేసుకున్నందుకు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయానికి రూ.3లక్షలు జరిమానా చెల్లించాలి. అలా చెల్లించి రద్దు చేసుకుంటారు. తిరిగి సొంత రాష్ట్రంలో తాను చేరిన కాలేజీకి వెళ్లి ఒరిజినల్‌ సర్టిఫికెట్లు ఇచ్చుకుంటాడు. దీంతో అతను తెలంగాణలో వదిలేసిన బీ–కేటగిరీ సీటు ఎన్నారై సీటుగా మారిపోతుంది. ఇలా రాష్ట్రంలో దాదాపు 100 ఎంబీబీఎస్‌ సీట్లల్లో దందా జరిగినట్లు అంచనా వేస్తున్నారు. ఉన్నతస్థాయి వర్గాల సమాచారం మేరకు ఈ దందాలో అనేక కాలేజీలు పాలుపంచుకున్నాయి.

ఇక ఎన్నారై సీటును ఎంతకు అమ్ముకున్నా అడిగే నాథుడే లేడు. డిమాండ్‌ను బట్టి రూ.కోటి నుంచి రూ.కోటిన్నర వరకు కూడా వసూలు చేస్తున్నారు. ఒక యూపీ విద్యార్థి అక్కడ ప్రైవేటు మెడికల్‌ కాలేజీలో కన్వీనర్‌ కోటాలో చేరాడు. అతను దళారుల ద్వారా తెలంగాణలో బీ–కేటగిరీ సీటులో చేరాడు. చివరకు శుక్రవారం ఆ సీటును వదులుకున్నందుకు అతనికి రూ.5లక్షలు ముట్టచెప్పారు. దళారులకు రూ.10లక్షల నుంచి రూ.15లక్షలు కూడా ఇచ్చారు. ఇలా కర్ణాటకలో జరిగిన ఎంబీబీఎస్‌ సీట్ల కుంభకోణంలో కాలేజీల చైర్మన్లు, వైద్యాధికారులు కూడా ఉన్నట్లు పెద్ద ఎత్తున ఆరోపణలున్నాయి. కానీ మన రాష్ట్రంలో ఇదంతా గుట్టుగా జరుగుతోంది. నెల రోజులుగా జరుగుతున్న తంతు శుక్రవారం రాత్రి సీట్ల రద్దుతో ముగిసింది. దీంతో ఈ సీట్లన్నీ ఎన్నారై కోటాగా మారిపోయాయి. శనివారం ఒక్కరోజే ఈ సీట్లలో చేరేందుకు గడువుంది. దీంతో ఒక్క రోజులోనే కోట్లు చేతులు మారనున్నాయి. ఒక అంచనా ప్రకారం ప్రైవేటు కాలేజీలు, దళారులు, విద్యార్థుల మధ్య మొత్తంగా రూ.100 కోట్లు అక్రమంగా చేతులు మారినట్లు అంచనా. 
 
ఇక్కడి వారక్కడ.. అక్కడి వారిక్కడ! 
ఇదిలావుంటే మన రాష్ట్రంలో ఉన్న విద్యార్థులు ఇక్కడికక్కడే సీట్లు మార్చుకునేందుకు వీలుండదు. మన రాష్ట్ర విద్యార్థులను దళారులు ఇతర రాష్ట్రాల్లో ఇలా అక్రమాలు చేయడానికి వినియోగించుకున్నారు. మన రాష్ట్రంలో చేయాలంటే నిబంధనలు ఒప్పుకోవు. ఎందుకంటే ఇక్కడ ఏ కాలేజీలో సీటొచ్చినా.. మరోచోట కలర్‌ జిరాక్స్‌ లేదా ఒరిజినల్‌తోనైనా రెండోచోట చేరడానికి వీలుండదు. ఒకసారి చేరాక మరోసారి కౌన్సిలింగ్‌లో పాల్గొనాలంటే తన మొదటి సీటును వదులుకోవాల్సిఉంటుంది. అంటే ఒకేసారి రెండుచోట్ల చేరే అవకాశం సొంత రాష్ట్రాల విద్యార్థులకు ఉండదని వైద్య విద్యనిపుణులు చెబుతున్నారు. ఇంత జరుగుతున్నా వైద్య ఆరోగ్యశాఖ కూడా ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తుందన్న విమర్శలున్నాయి. కొందరు అధికారుల హస్తం కూడా ఇందులో ఉన్నట్లు చర్చ జరుగుతోంది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement