అయ్యబాబోయ్..ఇంత స్కామా?
► హాస్టల్ బ్యాంక్ ఖాతా నుంచి రూ.64 లక్షలు మింగేశారు
► పాలకొండ హాస్టల్ ఖాతానుంచి మరో రూ.14 లక్షలు
► సీతంపేట ఖాతా తెరిస్తే ఇంకెంతో?
► 2010లోనే స్కాంకు బీజం
శ్రీకాకుళం టౌన్: పేద విద్యార్థులకు చెందాల్సిన లక్షలాది రూపాయలు రాబంధుల పాలైంది. శనివారం సాయంత్రానికి శ్రీకాకుళం పోస్టుమెట్రిక్ హాస్టల్ ఖాతా నంబరు 11152305021లో రూ.64 లక్షలు (2014-2015 , 2015-16 విద్యా సంవత్సరంలో) అక్రమార్కులు కొల్లగొట్టేసినట్టు వెలుగు చూసింది. 2010 నుంచి చిన్న మొత్తంతో ఆరంభమైన ఈ వ్యవహారం 2014 నాటికి రూ.లక్షలకు చేరువైంది. ఇక్కడ ఏటీడబ్ల్యూవోగా వ్యవహరించిన ఎర్రన్నాయుడు సంతకాలతోనే చెక్కులు జారీ అవడంతో ఇందులో ఆయ న్నీ సూత్రధారిగా భావిస్తున్నారు. అలాగే పాలకొండ ట్రైబల్ పోస్టుమెట్రిక్ హాస్టల్‌లో వార్డెన్ ఖాతా నుంచి రూ.14 లక్షలు 2015 జూలై నెలలో విత్‌డ్రా చేశారు. ఇప్పటివరకు గుర్తించిన ప్రకారం రూ.78 లక్షలు ప్రభుత్వ నిధులు కాజేసి వాటాలుగా పంచుకున్నారు. ఇంకా సీతంపేట తోపాటు మరో 15 పోస్టుమెట్రిక్ హాస్టళ్ల ఖాతాల నుం చి జరిపిన లావాదేవీల్లో ఇంకా లెక్కతేలాల్సిఉంది.
అవినీతికి బీజం ఇలా..
శ్రీకాకుళంలోని గిరిజన సంక్షేమ శాఖ వసతిగృహంలో 1, 2 హాస్టళ్లు ఒకే వార్డెన్ పర్యవేక్షణలో సాగుతున్నాయి. సుమారు 600 మంది విద్యార్థినులకు లెక్కచూపించి వందల్లో విద్యార్థులు గైర్హాజరైనా పూర్తి హాజరు చూపించే ప్రక్రియ సాగేది. ఇందులోనూ రూ.లక్షలు చేతులు మారినప్పటి కీ అధికారులు నోరు మెదపలేక పోయారు. ఇదే అదునుగా చూసుకుని లేని పిల్లలకు హాజరు వేసే అలవాటు ఉండడంతో అదేపనిగా ఉపకార వేతనాలు కాజేందుకు రూపకల్పన చేశారు. ఇందులో తనవంతు పాత్రపోషించిన వార్డెన్ ఝాన్సీరాణిని సస్పెండ్ చేసిన అధికారులు ఆమె నుంచి పూర్తి బాధ్యతలను బదాలాయించారు. శనివారం డీడీ నాయక్‌తో, ఏటీడబ్ల్యూవో బల్ల అప్పారావుతోపాటు సాంఘిక సంక్షేమ శాఖాధికారిణి హాజరై లావాదేవీలన్నింటినీ పరిశీలించారు. మరోవైపు పాలకొండ వసతిగృహంలో కూడా వార్డెన్‌గా ఉన్న వెంకటనాయుడు నుంచి బాధ్యతలను బదలాయించారు.
అ(ఉ)పకారం పై ఏసీబీ నివేదిక సిద్ధం
శ్రీకాకుళం: ఉపకార వేతనాల స్కాం రోజుకో మలుపు తిరుగుతోంది. ఈస్కాం బయటపడ్డ నాటినుంచి అవినీతి నిరోధక శాఖ అడుగడుగున క్షుణ్ణంగా పరిశీలన జరిపి నిజాలను నిగ్గు తేల్చేపనిలో పడింది. పాలకొండ కేంద్రంగానే ఈస్కాం మూలాలు బయటపడ్డాయి. పాలకొండలోనే పకడ్బందీ వ్యూహంతో కొందరు గిరిజన సంక్షేమ శాఖ అధిరులు స్కార్‌షిప్పుల కోసం పెట్టుకున్న విద్యార్థుల దరఖాస్తులను హాస్టల్ విద్యార్థులుగా రూపు మార్చారు. అజయ్‌కుమార్ అనే కంప్యూటర్ ఆపరేటర్ దీన్ని ఆసరాగా చేసుకుని బీసీ సంక్షేమ శాఖ అధికారులను నేరుగా కలుసుకుని వ్యూహాన్ని వివరించారు.
ఈ వ్యూహంలో నేరుగా బీసీ సంక్షేమ శాఖను సంప్రదించింది అజయ్ కుమార్ మాత్రమేనని తేల్చారు. అయితే అజయ్‌కుమార్‌ను గిరిజన సంక్షేమ శాఖలో ఎవరెవరు కలిశారు.. ఎక్కడ కలిశారు.. విద్యార్థుల దరఖాస్తులు ఎక్కడినుంచి వచ్చాయి. సీతంపేట, పాలకొండ, శ్రీకాకుళం పోస్టు మెట్రిక్ హాస్టళ్లలోనే బిసి విద్యార్థులు ఉన్నట్టు ఎలా చూపించారన్న సందేహాలపై ఏసీబీ శోధించింది. ఇందులో బీసీ సంక్షేమ శాఖ ఖాతాలకు ఈదరఖాస్తులు వచ్చినపుడు గుమస్తా బాలరాజు ఏంచేస్తున్నారనేది ఆ శాఖ అధికారులు ప్రశ్నించారు. బాధ్యులను విచారించి తుది నివేదికలు సిద్ధం చేసిన ఆశాఖ డిఎస్పీ రంగరాజు శనివారం కలెక్టరును కలసి వివరించారు.
ట్రెజరీలో సోదాలుః
ఉపకార వేతనాల స్కాంలో ఖజానా శాఖ పాత్రను ఇప్పటికే గుర్తించిన అవినీతి నిరోధక శాఖ అధికారులు శనివారం ఆఫైల్‌ను పరిశీలించిన ఉద్యోగులను ప్రశ్నించారు. ఐటీడీఏ పరిధిలో డెప్యూటీ డెరైక్టరుగా ఇన్‌చార్జి బాధ్యతల్లో ఉన్న నాయక్ , ఏటీడబ్ల్యుఓ బల్ల అప్పారావులను విచారించారు. వారి వాంగ్మూలాన్ని సేకరించి నివేదికలను సిద్ధం చేశారు. ఇన్‌చార్జి బిసి సంక్షేమ శాఖాధికారిగా వ్యవహరిస్తున్న ధనుంజయరావు బాధ్యులపై క్రిమినల్ చర్యలు చేపట్టేందుకు కలెక్టరు అనుమతికోరారు. గిరిజన సంక్షేమ శాఖ అధికారులు కూడా కలెక్టరు అనుమతి కోరుతూ లేఖ రాశారు. ఆ లేఖను పరిశీలించిన తర్వాత చర్చించేందుకు కలెక్టరేటులో హాజరుకావాలని కలెక్టరు సంభందితశాఖల అథికారులను శనివారం ఆదేశించారు. ఈ ఆదేశాలప్రకారం ఆదివారం రెండుశాఖల నుంచి అధికారులు కలెక్టరేటులో హాజరైన తర్వాత తుదినిర్ణయం తీసుకునే అవకాశం ఉంది..
రాజకీయ ఒత్తిళ్లు:
ఉపకార వేతనాలను అడ్డదారిలో ఖాతాలకు మళ్లించుకున్న వ్యవహారంలో బాధ్యులుగా ఉన్న వారు రాజకీయ పైరవీలకు సిద్దపడ్డారు. అజయ్ మినహా మిగిలిన వారంతా అధికార పార్టీ పెద్దలపై ఒత్తిడి పెంచి కేసునుంచి బయటపడేందుకు ముమ్మర ప్రయత్నాలు సాగిస్తున్నారు.