చిత్తూరు / భాకరాపేట: చిన్నగొట్టిగల్లు మండలం చిట్టేచెర్ల పంచాయతీ అయ్యప్పనాయినిచెరువులో సంతోషంగా బోట్ షికారుకు వెళ్లిన ఇద్దరు విద్యార్థులు నీటిలో మునిగి మృతిచెందారు. చిన్నగొట్టిగల్లు మండలం కొత్తపల్లెకు చెందిన దిలీప్(25), మురళీకృష్ణ(22), హరీష్, ముని స్నేహితులు. అందరూ ఆదివారం సంతోషంగా గడపాలని అయ్యప్పనాయినిచెరువు వద్దకు చేరుకున్నారు. అక్కడ ఉన్న చేపలు పట్టే బోట్‌లో సరదాగా తిరిగి రావాలని అనుకున్నారు. దిలీప్, మురళీకృష్ణ, ముని కలిసి బోటు ఎక్కారు. చెరువులో దాదాపు 20 నుంచి 40 అడుగులు లోతు నీరు ఉంది. చెరువు మధ్యలోకి వెళ్లిన సమయంలో బోటు తల్లకిందులైంది.
ఈత రాకపోవడంతో దిలీప్, మురళీకృష్ణ నీట మునిగిపోయారు. ముని ఒడ్డుకు చేరుకున్నాడు. చెరువు కట్టపై ఉన్న హరీష్ కేకలు వేస్తూ గ్రామానికి వెళ్లి గ్రామస్తులకు విషయం చెప్పాడు. గ్రామ ప్రజలు అక్కడికి చేరుకుని గాలించారు. సమాచారం అందుకున్న భాకరాపేట ఎస్‌ఐ శ్రీనివాసులు, తహసీల్దార్ ఎం.ఆర్.భాగ్యలక్ష్మి చెరువు వద్దకు చేరుకున్నారు. పరిస్థితిని సమీక్షించారు. పీలేరు అగ్నిమాపక సిబ్బందిని, గజ ఈతగాళ్లను పిలిపించి గాలింపు చర్యలు చేపట్టారు. మధ్యాహ్నం నుంచి గాలింపు చర్యలు చేపట్టి సాయంత్రం 5 గంటలకు మృతదేహాలను వెలికితీశారు.
శోకసముద్రంలో కొత్తపల్లె
ఇద్దరు యువకులు మృతి చెందడంతో కొత్తపల్లెలో విషాదఛాయలు అలుముకున్నాయి. మునిరాజ, ప్రభావతి దంపతులు ఉన్న కొద్దిపాటి పొలాన్ని సాగు చేసుకోవడంతోపాటు కూలి పనులు చేస్తూ కొడుకు దిలీప్‌ను ఎంటెక్ వరకు చదివిం చారు. అలాగే రాజన్న, రాణెమ్మ దంపతులు వ్యవసాయ పనులు చేసుకుంటూ తమ కొడుకు మురళీకృష్ణను ఎంసీఏ చదివించారు. వారు చెరువులో మునిగి మృతిచెందారని తెలియడంతో గుండెలవిసేలా రోదించారు. ముసలితనంలో ఉద్దరిస్తారనుకుంటే అప్పుడే నూరేళ్లూ నిండిపోయా నాయనా.. అంటూ వారు రోదించడాన్ని చూసి స్థానికులు కంటతడి పెట్టారు. మృతుల కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పరామర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment