AP Govt Decides to Regularization of Contract Employees - Sakshi
Sakshi News home page

ఏపీలో కాంట్రాక్ట్‌ ఉద్యోగులకు శుభవార్త

Published Tue, Jun 6 2023 3:57 AM | Last Updated on Tue, Jun 6 2023 8:36 AM

AP Govt announced Regularization of contract employees - Sakshi

సాక్షి, అమరావతి: కాంట్రాక్టు ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తున్నట్లు ప్రకటించింది. 2014 జూన్‌ 2వ తేదీ నాటికి ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని వెల్లడించింది. జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌లో సభ్యత్వం కలిగిన ఉద్యోగ సంఘాల నాయకులతో సోమవారం సచివాలయంలో నిర్వహించిన సమావేశంలో మంత్రివర్గ ఉపసంఘం సభ్యులు బొత్స సత్యనారా­యణ, ఆదిమూలపు సురేష్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్‌ జవహర్‌రెడ్డి ఉద్యోగులకు అనుకూలంగా పలు నిర్ణయాలు తీసుకున్నారు.

మంత్రి బొత్స సత్యనారాయణ ఆ వివరాలను మీడియాకు వివరించారు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణపై త్వరలో ఉత్తర్వులు వెలువడతాయని తెలిపారు. పీఆర్సీ, డీఏ బకాయిలు రెండింటినీ కలిపి ఒకటిగా చేసి చెల్లించాలని ఉద్యోగ సంఘాలు కోరాయని, ప్రభుత్వం అందుకు అంగీకరించినట్లు చెప్పారు. మూడు నెలలకు ఒక విడత చొప్పున, సంవత్సరానికి నాలుగు విడతలు, నాలుగేళ్లలో 16 విడతల్లో ఈ బకాయిలను ఉద్యోగులకు ఇస్తామని వివరించారు.

మొదటి సంవత్సరం పది శాతం, రెండో సంవత్సరం 20 శాతం, మూడో సంవత్సరం 30 శాతం, నాలుగో సంవత్సరం 40 శాతం చొప్పున ఇస్తామన్నారు. ఏటా పది శాతం చొప్పున పెంచుకుంటూ నాలుగు సంవత్సరాల్లో మొత్తం బకాయిలను ఇస్తామన్నారు. దీనికి ఉద్యోగ సంఘాలు అంగీకరించాయన్నారు. 

సీపీఎస్‌ కంటే మెరుగ్గా
ఉద్యోగులకు సీపీఎస్‌ కంటే మెరుగైన విధానాన్ని అమలు చేస్తామని మంత్రి బొత్స తెలిపారు. వైద్య విధాన పరిషత్‌ ఉద్యోగులకు ఇకపై 010 పద్దు ప్రకారం జీతాలు చెల్లిస్తామన్నారు. త్వరలో కొత్త పీఆర్సీ కమిటీని నియమిస్తామని వెల్లడించారు. ఉద్యోగుల స్పెషల్‌ పే ఇవ్వాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఈ అంశాలన్నింటికీ మంత్రివర్గ సమావేశంలో ఆమోదం తెలిపిన అనంతరం శాఖల వారీగా ఉత్తర్వులిస్తామన్నారు. 

ఆలస్యమైనా.. అనుకూలంగానే
ఇది ఉద్యోగులకు అనుకూలమైన ప్రభుత్వమని, ఉద్యోగులంతా తమ సోదరులేనని మంత్రి బొత్స పేర్కొన్నారు. తమ కుటుంబాల్లోనూ ఉద్యోగులున్నారని తెలిపారు. ఆర్థిక పరిస్థితుల వల్ల వారికి ఇవ్వాల్సిన వాటి విషయంలో కొంత ఆలస్యం జరిగిందే కానీ, ఉద్యోగుల పట్ల సీఎం జగన్‌ చిత్తశుద్ధితో ఉన్నారని చెప్పారు. ఉద్యోగులకు సంబంధించి మొదటిరోజు చెప్పిన మాటకే సీఎం కట్టుబడి ఉన్నారని, దాని ప్రకారమే వారికి అనుకూలంగా నిర్ణయాలు తీసుకున్నామని తెలిపారు.

ఓపిగ్గా సంప్రదింపులు జరిపిన ఉద్యోగ సంఘాలకు బొత్స అభినందనలు తెలిపారు. ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారు (ఉద్యోగుల సంక్షేమం) చంద్రశేఖర్‌రెడ్డి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి (హెచ్‌ఆర్‌యం) చిరంజీవి చౌదురి, ఆర్థిక శాఖ కార్యదర్శి డాక్టర్‌ కేవీవీ సత్యనారాయణ (సర్వీసెస్, హెచ్‌ఆర్‌), కార్యదర్శి పి.భాస్కర్, ఎస్‌టీయూ అధ్యక్షుడు సాయి శ్రీనివాస్, పీఆర్‌టీయు అధ్యక్షుడు కృష్ణయ్య, యూటీఎఫ్‌ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, ఎపీటీఎఫ్‌ అధ్యక్షుడు హృదయరాజు, ఏపీజీఈఏ కార్యదర్శి ఆస్కార్‌రావు, నాల్గవ తరగతి ఉద్యోగుల సంఘం అధ్యక్షులు గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

71 డిమాండ్లు నెరవేరాయి: బండి శ్రీనివాసరావు, ఏపీ ఎన్జీవోస్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు
ఉద్యోగులకు సంబంధించి ప్రభుత్వం ఎదుట ఉంచిన 71 డిమాండ్లలో దాదాపు అన్నీ పరిష్కారమయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు. ఇచ్చిన హామీ ప్రకారం కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరణ చేస్తున్నట్లు చెప్పారు. అందుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియచేస్తున్నాం. ఐదేళ్లకోసారి పీఆర్సీ డిమాండ్‌ను పోరాడి సాధించుకున్నాం.

ఆ డిమాండ్‌ ప్రకారం 7వ తేదీన జరిగే కేబినెట్‌ భేటీలో పీఆర్సీ కమిషన్‌ను నియమిస్తామన్నారు. స్పెషల్‌ పే ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కొత్తగా ఏర్పడిన 8 జిల్లాలకు హెచ్‌ఆర్‌ఏను 16 శాతం పెంచడం మంచి విషయం. ఇన్నాళ్లూ వైద్య శాఖలో ఏబీవీపీని ఓ ప్రైవేట్‌ కంపెనీలా చూసేవారు. వారికి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపు దక్కినందుకు అభినందిస్తున్నాం. సీపీఎస్‌ ఉద్యోగుల విషయాన్ని కేబినెట్‌లో ప్రస్తావిస్తామని చెప్పారు.

అన్నీ పాజిటివ్‌ అంశాలే : వెంకట్రామిరెడ్డి, అధ్యక్షుడు, సచివాలయ ఉద్యోగుల సంఘం
మంత్రివర్గ ఉపసంఘంతో జరిగిన సమావేశంలో అన్ని అంశాలు ఉద్యోగులకు పాజిటివ్‌గా ఉన్నాయి. కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని చెప్పారు. సీఎం గతంలో చెప్పినట్లుగా పీఆర్సీ కమిషన్‌ను నియమిస్తామన్నారు. సీపీఎస్‌ ఉద్యోగులకు మేలు చేసేలా నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. వారికి పెన్షన్‌ భద్రత కల్పించేలా చూస్తామన్నారు. స్పెషల్‌ పే ఇవ్వడానికి అంగీకరించారు. డీఏ, పీఆర్సీ బకాయిలను నాలుగేళ్లలో విడతలవారీగా ఇస్తామన్నారు. 

పలు సానుకూల నిర్ణయాలు: బొప్పరాజు వెంకటేశ్వర్లు, రెవెన్యూ సర్వీసెస్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు 
రాష్ట్ర ప్రభుత్వం మా డిమాండ్లను చాలా వరకు నెరవేర్చింది. ఉద్యోగులకు అనుకూలంగా చాలా సానుకూల నిర్ణయాలు తీసుకుంది. ఇందుకు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు. పీఆర్సీ, డీఏ బకాయిలు మొత్తం రూ.7 వేల కోట్లు ఉంటాయి. వాటిని నాలుగేళ్లలో విడతలవారీగా చెల్లించేందుకు అంగీకరించారు. విభజన నాటికి ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న సుమారు 7, 8 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించేందుకు అంగీకరించారు. అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల జీతాల పెంపుపైనా సానుకూలంగా స్పందించారు. వైద్య విధాన పరిషత్‌ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ వచ్చే కేబినెట్‌లో తీర్మానం చేస్తామన్నారు.   

ఇది కాంట్రాక్టు ఉద్యోగులకు శుభవార్త
కాంట్రాక్టు ఉద్యోగులను ప్రభుత్వోద్యోగులుగా క్రమబద్ధీకరిస్తామని ఎన్ని­కల సమయంలో ఇచ్చిన హామీని నెరవేరుస్తూ సీఎం జగన్‌ తీసుకున్న నిర్ణ­యంపై వైఎస్సార్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు కె.మురళీరెడ్డి హర్షం వ్యక్తంచేశారు. 2014కు ముందు ఐదేళ్లు సర్వీసు పూర్తిచే­సుకున్న కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరి­స్తామంటూ నిర్ణయం తీసుకోవడం వారికి శుభ­వార్త అంటూ ఈ నిర్ణయాన్ని ఆయన స్వాగతించారు. సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రతీ ఉద్యోగి సీఎంకు అండగా నిలుస్తారన్నారు. 

22 ఏళ్ల సుదీర్ఘ కల నెరవేరుతోంది..
సీఎంకు ఏపీ స్టేట్‌ కాంట్రాక్టు ఫార్మసిస్ట్స్‌ అండ్‌ ల్యాబ్‌ టెక్నీషియన్స్‌ అసోసియేషన్‌ కృతజ్ఞతలు
ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించినట్లుగానే కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాన్ని ఏపీ స్టేట్‌ కాంట్రాక్టు ఫార్మాసిస్ట్స్‌ అండ్‌ ల్యాబ్‌ టెక్నీషియన్స్‌ అసోసియేషన్‌ స్వాగతించింది. 22 ఏళ్ల తమ సుదీర్ఘ కలను నెరవేరుస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి వారు ధన్యవాదాలు తెలిపారు.

చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో 2001 నుంచి శాశ్వత ఉద్యోగ నియామకాలకు స్వస్తి పలికి కాంట్రాక్టు ఉద్యోగులను తీసుకుంటూ వచ్చారని.. ఇప్పుడు 2–06–2014కు ఐదేళ్ల సర్వీసు పూర్తిచేసుకున్న వారిని ముఖ్యమంత్రి జగన్‌ రెగ్యులరైజ్‌ చేస్తూ తీసుకున్న నిర్ణయంపై అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ కె.రత్నాకర్‌బాబు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement