నం.1గా వెలుగొందాలి - దాసరి
‘‘మన ఫిలిం ఫెడరేషన్‌కి సొంత భవనం ఏర్పాటు అనేది కొన్నేళ్ల కల. అది ఇప్పటికి నెరవేరినందుకు చాలా ఆనందంగా ఉంది. క్రమశిక్షణ కలిగిన మన ఫెడరేషన్ ఇకపై కూడా నంబర్‌వన్ ఫెడరేషన్‌గా వెలుగొందాలి’’ అని దాసరి నారాయణరావు అన్నారు. ‘ఎన్టీఆర్ సినీ కార్మిక భవనం’ పేరుతో ఏ.పి.ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ నూతన భవన ప్రారంభోత్సవం బుధవారం హైదరాబాద్‌లో దాసరి, బాలకృష్ణ చేతులమీదుగా జరిగింది. నాన్నగారి పేరు పెట్టినందుకు తనకు చాలా ఆనందంగా ఉందని బాలకృష్ణ చెప్పారు. భవన అవసరాల నిమిత్తం నటి జమున 50 వేల రూపాయల చెక్ అందజేశారు. నిర్మాతలు డి.రామానాయుడు, శ్యాంప్రసాద్‌రెడ్డి కూడా చెరొక లక్ష రూపాయలు అందిస్తామని ప్రకటించారు. ఇంకా ఫెడరేషన్ అధ్యక్షులు కొమర వెంకటేష్, ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్‌రెడ్డి, బూరుగుపల్లి శివరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.