
విజయవాడ: ఏపీలో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడటంతో ఉద్యోగ సంఘాలు, రాష్ట్ర ఎన్నికల కమీషన్ మధ్య రగడ మొదలైంది. వ్యాక్సినేషన్ పూర్తి కాకుండా ఎన్నికలు వద్దని, ప్రాణాలు పణంగా పెట్టి తాము ఎన్నికల విధులు నిర్వహించలేమని తాను చేసిన వ్యాఖ్యలను ప్రతిపక్ష పార్టీకి చెందిన నేతలు వక్రీకరిస్తున్నారని ప్రభుత్వోద్యోగుల సమాఖ్య ఛైర్మన్ కాకర్ల వెంకట్రామిరెడ్డి ఆరోపించారు. ప్రాణాలను రక్షించుకునే హక్కు రాజ్యాంగం తమకు కల్పించిందని, మా ప్రాణాలకు రాజ్యాంగం ఏం విలువ ఇచ్చిందని మాత్రమే తాను ప్రశ్నించానని ఆయన అన్నారు. రాజ్యాంగంలో ఉన్న అంశాలను కాదనడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు.
కొందరు టీడీపీ నేతలు తనను వాడూ వీడూ అని సంబోధిస్తూ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారంటూ ఆయన వాపోయారు. తనను విమర్శించే నేతలను తాను కూడా అరేయ్ ఒరేయ్ అనగలనని, అలా మాట్లాడి తన స్థాయి దిగజార్చుకోలేనని అన్నారు. అసలు రాష్ట్రంలో ఎన్నికలు జరిగే వాతవరణమే లేదని, ఈ విషయం నిమ్మగడ్డకు కూడా తెలుసునని పేర్కొన్నారు. సుప్రీం కోర్టు ఎన్నికలు జరపమని తీర్పు ఇచ్చినా, నామినేషన్లు దాఖలయ్యే పరిస్థితే కూడా లేదని వివరించారు. ఎన్నికల నిర్వహణలో ఎస్ఈసీ చిత్తశుద్ధితో వ్యవహరించడం లేదని ఆయన ఆరోపించారు. ఎన్నికల విధులు నిర్వహించేందుకు సిద్దంగా ఉన్న ఉద్యోగులతో ఎన్నికలు జరుపుకుంటే తమకు ఏమాత్రం అభ్యంతరం లేదని ఆయన పేర్కొన్నారు.
ఉద్యోగులను రాజకీయ అనసరాల కోసం వాడుకుంది టీడీపీనేనని, ప్రస్తుత ప్రభుత్వం అందుకు భిన్నం అని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం టీడీపీలో ఉన్న ఓ మాజీ ఉద్యోగ సంఘ నేత వల్లే ఉద్యోగులకు రాజకీయాలతో ముడి పెట్టడం మొదలైందని అన్నారు. అతనితోనే ఆ రాజకీయం ఆగిపోవాలని సీఎం జగన్‌మోహన్‌రెడ్డి కోరుకుంటున్నారని, అందుకే ఆయన ఉద్యోగులను రాజకీయాలకు దూరంగా ఉంచుతున్నారన్నారు. తనపై దాడికి టీడీపీ నేతలు కుట్రలు పన్నుతున్నారని, ఈ విషయంపై రేపు డీజీపీని కలిసి వినతి పత్రాన్ని సమర్పిస్తానని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏపీజీఈఎఫ్ జనరల్ సెక్రటరీ అరవపాల్ పాల్గొన్నారు.