సమైక్యాంధ్ర పరిరక్షణ ఉద్యమం పతాక స్థాయికి చేరింది. గత 13 రోజులుగా ఆందోళనలతో అట్టుడుకుతున్న జిల్లాలో మంగళవారం నుంచి ఏపీ ఎన్జీవోలు తలపెట్టిన సమ్మెతో సకలం బంద్ అయ్యింది. బస్సూ లేదు.. స్కూలూ లేదు..
ప్రభుత్వాఫీసూ లేదు.. పెట్రోల్ బంకూ లేదు.. అన్నీ పూర్తిగా మూతపడ్డాయి. జనజీవితం పూర్తిగా స్తంభించింది. అయినా జనం ఎవరూ ఇళ్లకు పరిమితం కాలేదు. విద్యార్థులు, ఉద్యోగులు, కార్మికులు, వాకర్లు, మహిళలు ఇలా అన్ని వర్గాల వారూ వయస్సుతో సంబంధం లేకుండా రోడ్డెక్కారు. సమైక్య నినాదంతో గర్జించారు.
సాక్షి, విజయవాడ : సమైక్యాంధ్ర పరిరక్షణే ధ్యేయంగా జిల్లాలో ఏపీ ఎన్జీవోలు చేపట్టిన సమ్మె విజయవంతమైంది. వంద శాతం ప్రభుత్వ ఉద్యోగులు సమ్మెలో పాల్గొన్నారు. ప్రభుత్వ కార్యాలయాలకు తాళాలు వేశారు. దీంతో ప్రభుత్వ సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. ప్రతి ఒక్కరూ రోడ్డెక్కి సమైక్యాంధ్రను కొనసాగించాలని నినాదాలు చేశారు. జిల్లాలో అన్ని రాష్ట్ర ప్రభుత్వ విభాగాలకు చెందిన 55 వేల మంది ఉద్యోగులు సమ్మెలో పాల్గొన్నారు. అత్యవసర సేవలు అందించే మెడికల్ అండ్ హెల్త్, ఫైర్, గ్రామీణ నీటిసరఫరా, ఇరిగేషన్ సిబ్బందిని సమ్మె నుంచి మినహాయించారు. ఏపీ ఎన్జీవోలకు మద్దతుగా మున్సిపల్ కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు. మంగళవారం తెల్లవారుజాము నుంచి జిల్లాలోని మొత్తం 1,200 బస్సు సర్వీసులు నిలిచిపోయాయి. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ అయినప్పటికీ శుభకార్యాలకు వెళ్లేవారు కూడా తప్పనిసరి పరిస్థితుల్లో వాటిని వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. బంద్ ప్రభావం తీవ్రంగా ఉండటంతో రైళ్లలో ప్రయాణానికి కూడా ప్రజలు ఆసక్తి చూపలేదు.
స్వచ్ఛందంగా ఆందోళన..
విజయవాడ, మచిలీపట్నం, గుడివాడ, నూజివీడుతో పాటు పలు ప్రాంతాల్లో ప్రజలు స్వచ్ఛందంగా బంద్ పాటించారు. మచిలీపట్నం కోనేరుసెంటరులో మాజీ ఎమ్మెల్యే పేర్ని నాని ఆధ్వర్యంలో వేలాదిమందితో వంటావార్పు నిర్వహించి నిరసన తెలిపారు. చారిత్రక కోనేరుసెంటరుకు చేరుకున్న సమైక్యవాదులు రాష్ట్ర విభజనను నిరసిస్తూ చేసిన నినాదాలతో ఆ ప్రాంతం మార్మోగింది. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న బెల్ కంపెనీ, పోస్టాఫీసులకు మంగళవారం సెలవు ప్రకటించారు. గుడివాడ పట్టణంతో పాటు గుడ్లవల్లేరు, నందివాడ మండలాల్లో కూడా బంద్ విజయవంతంగా నిర్వహించారు. జేఏసీ నాయకులు గుడివాడలో పెద్ద ఎత్తున ర్యాలీ చేశారు. ట్యాక్సీ వర్కర్స్ ఆధ్వర్యంలో బస్టాండ్ వద్ద మానవహారం నిర్మించి నిరసన తెలిపారు. గుడివాడ పాత బైపాస్ రోడ్డులో వైఎస్సార్ సీపీ నేత మండలి హనుమంతరావు సమక్షంలో పాములపాడు కాలనీ ప్రజలు వంటావార్పు నిర్వహించారు. ఆర్టీసీ కార్మికులు డిపోలో కబడ్డీ ఆడి నిరసన తెలిపారు. 48 గంటల బంద్‌ను పురస్కరించుకుని సినిమా హాళ్లకు తాళాలు వేసి ఉద్యమంలో పాల్గొన్నారు. వత్సవాయి మండలంలోని కన్నెవీడు గ్రామంలో పాఠశాల విద్యార్థులు, గ్రామస్తులు కలిసి సోనియాగాంధీ దిష్టిబొమ్మతో శవయాత్ర నిర్వహించి అంత్యక్రియలు జరిపారు.
మండవల్లి మండలం పెరికేగూడెం వద్ద ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణ రోడ్డుపై సమైక్యాంధ్రకు మద్దతుగా ఆందోళన చేపట్టారు. కలిదిండి మండలం గుర్వాయిపాలెం వద్ద గ్రామస్తులు రోడ్డుపై ఆందోళన చేశారు. మద్వానిగూడెం వద్ద కేసీఆర్, సోనియా దిష్టిబొమ్మలను దహనం చేశారు. మైలవరం నుంచి 15 మంది సమైక్యవాదులు పాదయాత్రతో విజయవాడకు బయలుదేరి వెళ్లారు. జి.కొండూరు మండలం కట్టుబడిపాలెం జాతీయ రహదారిపై సమైక్యాంధ్రకు మద్దతుగా గ్రామస్తులు రాస్తారోకో చేశారు. జగ్గయ్యపేట మండలం అనుమంచిపల్లి మండలపరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు గ్రామంలోని 65వ నంబర్ జాతీయ రహదారిపై కొద్దిసేపు ఆందోళన నిర్వహించారు. షేర్‌మహ్మద్‌పేటలో కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. విజయవాడ రూరల్ మండల కార్యాలయాల కాంప్లెక్స్ వద్ద ఉద్యోగులు ‘జై సమైక్యాంధ్ర’, ‘తెలంగాణా వద్దు సమైక్యాంధ్ర ముద్దు’ అంటూ నినాదాలతో హోరెత్తించారు.
ఎనికేపాడులో తీయరహదారిపై కేసీఆర్ దిష్టిబొమ్మను చెప్పులతో కొట్టి దహనం చేశారు. గన్నవరం గాంధీబొమ్మ సెంటర్‌లో మానవహారం నిర్వహించారు. చల్లపల్లి, అవనిగడ్డలో పలు సంఘాల ఆధ్వర్యంలో భారీ మోటార్‌సైకిల్ ర్యాలీ జరిగింది. నాయీబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో చల్లపల్లి ప్రధాన సెంటర్‌లో 216 జాతీయ రహదారిపై పలువురికి గడ్డాలు, క్రాఫ్ చేసి వినూత్న నిరసన చేపట్టారు. చల్లపల్లి జేఏసీ ఆధ్వర్యంలో కేసీఆర్ , దిగ్విజయ్‌సింగ్‌ల దిష్టిబొమ్మలకు నాయకులు పెళ్లి చేశారు. అవనిగడ్డలో వైద్య, ఆరోగ్య శాఖ ఉద్యోగులు నిర్వహించిన ర్యాలీలో వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త సింహాద్రి రమేష్‌బాబు పాల్గొన్నారు. అవనిగడ్డలో రెండోరోజు దీక్షను వైఎస్సార్‌సీపీ నాయకులు గుడివాడ శివరావ్, యాసం చిట్టిబాబు ప్రారంభించారు. పామర్రులో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో రిలే దీక్షలు కొనసాగాయి. వైఎస్సార్ సీపీ పాలక మండలి సభ్యులు కె.నాగేశ్వరరావు, ఉప్పులేటి కల్పన ప్రారంభించగా, సాయంత్రం పార్టీ జిల్లా ప్రచార కమిటీ కన్వీనర్ సానికొమ్ము వెంకటేశ్వరరెడ్డి నిమ్మరసం ఇచ్చి విరమింపచేశారు. కైకలూరు వైఎస్సార్ సీపీ కార్యాలయం వద్ద పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త దూలం నాగేశ్వరరావు ఆధ్వర్యంలో రోడ్డుపై రాస్తారోకో చేపట్టారు.
పోరంకి గ్రామంలో వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త పడమట సురేష్‌బాబు ఆధ్వర్యంలో తూముల సెంటర్‌లో యువత రిలేదీక్షలు జరిపారు. పెడన ప్రెస్‌క్లబ్ ఆధ్వర్యంలో ఒకరోజు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈ దీక్షలకు పెడన నియోజకవర్గ సమన్వయకర్త ఉప్పాల రాంప్రసాద్ మద్దతు ప్రకటించారు. పలు పాఠశాలలకు చెందిన ఐదువేల మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు బంటుమిల్లి మెయిన్ రోడ్డు నుంచి పెడన బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. నూజివీడులో రాజకీయేతర జేఏసీ ఇచ్చిన పిలుపుమేరకు ఐదు రోజుల బంద్‌లో భాగంగా తొలిరోజు నిరవధిక బంద్ విజయవంతమైంది. నందిగామ గాంధీ సెంటర్‌లో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు ఎనిమిదో రోజుకు చేరుకున్నాయి. వీరులపాడు మండలం దొడ్డదేవరపాడులో అంతర్గత రహదారిపై వంటా వార్పు కార్యక్రమాన్ని నిర్వహించారు
సమ్మె సక్సెస్
Published Wed, Aug 14 2013 4:06 AM | Last Updated on Fri, Sep 1 2017 9:49 PM
Advertisement
Advertisement