సాక్షి, అమరావతి: ఇంట్లో కూర్చొని ఆన్‌లైన్‌లో సినిమా, బస్, రైలు టిక్కెట్లు బుక్ చేసుకున్నట్టే.. గ్రామ, వార్డు సచివాలయాల సేవలు కూడా ఆన్‌లైన్ ద్వారా అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం ప్రజలు ఇంటి వద్దనే ఉండి దరఖాస్తు చేసుకునేలా గ్రామ, వార్డు సచివాలయాల వెబ్‌సైట్‌ను తీర్చిదిద్దుతోంది. దీని ద్వారా ప్రభుత్వం సచివాలయాల్లో అందజేస్తున్న 545 రకాల ప్రభుత్వ సేవలు ప్రజల ముంగిటకే వస్తాయి. ఇంట్లో ఇంటర్‌నెట్‌తో కూడిన స్మార్ట్‌ఫోన్/ల్యాప్‌టాప్/డెస్క్‌టాప్ ఉంటే చాలు.. ఎవరైనా తమ వ్యక్తిగత మెయిల్ ఐడీల ద్వారా 545 రకాల ప్రభుత్వ సేవలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఇంటి వద్దే ధ్రువీకరణ పత్రాలు పొందే వీలు..
రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చాక పాలనలో విప్లవాత్మక సంస్కరణలు ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చింది. దీంతో ప్రజలు తమ సొంత గ్రామం దాటి వేరే ఊరు వెళ్లాల్సిన అవసరం లేకుండానే సొంత ఊరిలోనే 545 రకాల ప్రభుత్వ సేవలను పొందుతున్నారు. ప్రతి నెలా పంపిణీ చేసే పింఛన్లు, రేషన్ వంటివాటిని ఇప్పటికే వలంటీర్ల ద్వారా లబ్ధిదారుల వద్దకే ప్రభుత్వం చేరవేస్తున్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో ప్రజలు ప్రభుత్వ సేవలు పొందడానికి సచివాలయానికి కూడా వెళ్లాల్సిన అవసరం కూడా లేకుండా ఇళ్ల వద్దకే ప్రభుత్వ సేవలను తీసుకువెళ్లనుంది. ఈ క్రమంలో ఎవరైనా ఇంటి వద్ద నుంచే ఆన్‌లైన్ ద్వారా సచివాలయాల సేవలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆ దరఖాస్తులు నేరుగా ఆయా శాఖల సిబ్బందికి చేరతాయి. వాటి ఆమోదం అనంతరం తిరిగి మెయిల్ ఐడీ ద్వారా ఆ సేవలకు సంబంధించిన సర్టిఫికెట్లను ఇంటి వద్దనే పొందే వీలుంటుందని అధికారులు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment