సాక్షి, అమరావతి: పరిపాలనలో పారదర్శకతకు పెద్దపీట వేస్తూ ప్రభుత్వం ప్రారంభించిన గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ప్రజల ఇంటి ముంగిటే పలు సేవలు అందించేందుకు కౌంట్‌డౌన్ మొదలైంది. జనవరి 1వ తేదీ నుంచి గ్రామ, వార్డు సచివాలయాల్లో ఆన్‌లైన్‌లోనే సేవలను నిర్ణీత గడువులోగా అందించనున్నారు. ఇందుకు అవసరమైన ఫర్నిచర్, కంప్యూటర్లు, ఇంటర్నెట్, విద్యుత్ సౌకర్యంతోపాటు స్మార్ట్ ఫోన్లు, ల్యామినేషన్ యంత్రాలు, సిమ్ కార్డులు, ఫింగర్ ప్రింటింగ్ స్కానర్లు, ప్రింటర్లను ప్రభుత్వం సమకూర్చింది. ఇప్పటికే 80 శాతానికి పైగా గ్రామ, వార్డు సచివాలయాల్లో విద్యుదీకరణ పనులు పూర్తయ్యాయి.
50 శాతానికిపైగా కార్యాలయాల్లో ఇంటర్నెట్ సదుపాయం కల్పించారు. డిసెంబర్ 27వ తేదీ నాటికి అన్ని ఏర్పాట్లు పూర్తిచేసి, అదే రోజు నుంచి ప్రయోగాత్మకంగా ఆన్‌లైన్ ద్వారా కార్యకలాపాలు సాగించేందుకు అధికార యంత్రాంగం సన్నద్ధమవుతోంది. జనవరి 1వ తేదీ నుంచి గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా పూర్తి స్థాయిలో పాలనా వ్యవహారాలు కొనసాగించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు అన్ని చర్యలు చేపట్టినట్లు అధికార వర్గాలు తెలిపాయి. జనవరి 1వ తేదీ నుంచి గ్రామ, వార్డు సచివాలయాల్లో ఆన్‌లైన్ ద్వారా పాలనా వ్యహారాలను కొనసాగించనున్నట్లు వెల్లడించాయి.
వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ
వైఎస్సార్ నవశకం పేరుతో నవరత్నాల పథకాలు, ఇతర సంక్షేమ కార్యక్రమాల లబ్ధిదారులను ఇంటింటి సర్వే ద్వారా గ్రామ, వార్డు వలంటీర్లు ఎంపిక చేశారు. వైఎస్సార్ ఆర్యోగశ్రీ పథకం లబ్ధిదారులను ఇప్పటికే పూర్తిస్థాయిలో గుర్తించారు. సామాజిక తనిఖీ నిమిత్తం లబ్ధిదారుల జాబితాలను గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రదర్శించారు. గురువారం వరకు అభ్యంతరాలను స్వీకరిస్తారు. శుక్రవారం లబ్ధిదారుల తుది జాబితాలను గ్రామ, వార్డు సభల్లో ఆమోదిస్తారు. ఇప్పటివరకు దాదాపు 1,43,04,823 కుటుంబాలు వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం కింద లబ్ధి పొందడానికి అర్హత కలిగి ఉన్నట్లు తేల్చారు. లబ్ధిదారులకు జనవరి 1వ తేదీ నుంచి గ్రామ, వార్డు సచివాలయాల్లో వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కార్డులను పంపిణీ చేస్తారు.
అందుబాటులోకి 500కు పైగా సేవలు..
గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా అందించే సేవలను మూడు రకాలుగా వర్గీకరించారు. కొన్ని సేవలను దరఖాస్తు చేయగానే అక్కడికక్కడే అందిస్తారు. ఇంకొన్ని సేవలను 72 గంటల్లోగా, మరికొన్ని సేవలను 72 గంటలు దాటిన తరువాత అందిస్తారు. ఉదాహరణకు.. రైతు తన పొలానికి సంబంధించి అడంగల్ కోసం గ్రామ సచివాలయానికి వస్తే అక్కడికక్కడే ప్రింట్ తీసి ఇచ్చేస్తారు. ఇదంతా పావు గంటలోనే పూర్తవుతుంది. ఇప్పటివరకు వివిధ శాఖలకు చెందిన 47 రకాల సేవలను అప్పటికప్పుడే పావు గంటలో అందించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
మొత్తం 500కు పైగా సేవలను గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. 72 గంటల్లోగా 148 రకాల సేవలను, 72 గంటల తర్వాత 311 రకాల సేవలను అందించవచ్చని గుర్తించారు. ఈ 311 రకాల సేవలను 72 గంటల కంటే ఇంకా తక్కువ వ్యవధిలోనే అందించేందుకు గల అవకాశాలపై అధ్యయనం చేస్తున్నారు. గ్రామ, వార్డు సచివాయాల కోసం ప్రత్యేక పోర్టల్ రూపొందిస్తున్నారు. ఈ పోర్టల్‌ను ముఖ్యమంత్రి డ్యాష్‌బోర్డుతో పాటు సంబంధిత శాఖలతో అనుసంధానిస్తారు. ప్రజలకు అందించాల్సిన సేవలపై గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు శిక్షణ ఇచ్చారు. అలాగే గ్రామ, వార్డు సచివాలయాల్లో ఇకపై నిత్యం స్పందన కార్యక్రమం నిర్వహించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment