ఊరించిన సేవలు ఇక ఊర్లోనే  | Provision of public services in village and ward secretariats | Sakshi
Sakshi News home page

ఊరించిన సేవలు ఇక ఊర్లోనే 

Published Sun, Jan 26 2020 3:45 AM | Last Updated on Sun, Jan 26 2020 9:55 AM

Provision of public services in village and ward secretariats - Sakshi

సాక్షి, అమరావతి: విశాఖ జిల్లా కొర్రాయి గ్రామ ప్రజలు ఇప్పటివరకు ఏ చిన్న పని కావాలన్నా 20 కి.మీ. దూరంలో ఉండే మండల కేంద్రానికి వెళ్లాలి. వెళ్లి వచ్చేందుకు రవాణా సదుపాయాలు లేక గ్రామస్తులు అవస్థలు పడుతుంటారు. ఆ ఊరికీ ఓ పంచాయితీ కార్యదర్శి, వీఆర్వో ఉన్నా నెలకోసారి పింఛన్లు పంపిణీ చేసేటప్పుడో మరేదైనా ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే వచ్చి పోతుంటారన్నది గ్రామస్తులు చెప్పే మాట. అలాంటి మారుమూల ప్రాంతంలో సైతం ఆదివారం నుంచి 536 రకాల సేవలు గ్రామ సచివాలయంలోనే అందజేసే ప్రక్రియ మొదలు కానుంది. కొర్రాయి ఒక్క చోటే కాదు రాష్ట్రంలోని కుగ్రామాలు, తండాలతో సహా మొత్తం 15,002 గ్రామ, వార్డు సచివాలయాల్లో వందల సంఖ్యలో సేవలను స్థానికంగానే అందించనున్నారు.

అందుబాటులోకి వచ్చే ప్రధాన సేవలు..
ఇప్పుటిదాకా వివిధ పనుల కోసం ప్రభుత్వ కార్యాలయాలు, మీసేవా కేంద్రాల చుట్టూ తిరగాల్సి వస్తోంది. పొలం పాస్‌బుక్‌లో భూముల వివరాలు నమోదు, ఈసీల జారీ, కుల ధృవీకరణ పత్రాలు, రేషన్‌కార్డులో మార్పుచేర్పులు, దివ్యాంగులకు సదరం సర్టిఫికెట్ల రిజిస్ట్రేషన్‌ లాంటి సేవలన్నీ ఇక గ్రామ, వార్డు సచివాలయాల్లోనే అందుబాటులోకి వస్తాయి. 

పావుగంటలో పలు సేవలు...
15 నిమిషాల వ్యవధిలోనే 1 బి, అడంగల్, ఆధార్, రేషన్‌కార్డు ప్రింట్, టైటిల్‌డీడ్, రిజిస్ట్రేషన్‌ డాక్యుమెంట్‌ సరిఫికెట్‌ కాపీ, విద్యుత్‌ కనెక్షన్‌ కేటగిరి మార్పు లాంటి సేవలు పొందవచ్చు. అప్పటికప్పుడు మొత్తం 47 రకాల సేవలను అందిస్తుండగా మరో 148 రకాల సేవలను కేవలం మూడు రోజుల వ్యవధిలోనే పరిష్కరిస్తారు. మిగిలిన వాటిని కూడా మూడు రోజుల అనంతరం ఒక్కో సేవను నిర్ణీత వ్యవధిలోగా పరిష్కరించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ సేవలన్నింటినీ అందించేందుకు గ్రామ, వార్డు సచివాలయాల కోసం ప్రత్యేక పోర్టల్‌ రూపొందించారు. ముఖ్యమంత్రి డ్యాష్‌ బోర్డుతో పాటు సంబంధిత శాఖలతో దీన్ని అనుసంధానించారు. దీనికి తోడు గ్రామ, వార్డు సచివాలయాల్లో నిత్యం ‘స్పందన’ కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నారు. 



కంప్యూటర్లు, ప్రింటర్, నెట్‌ సదుపాయం
సచివాలయాల్లో వందల సంఖ్యలో సేవలను అందుబాటులోకి తెస్తుండటంతో ప్రతి చోట కంప్యూటర్లు, ప్రింటర్లు ఏర్పాటు చేయడంతో పాటు ఇంటర్నెట్‌ సదుపాయం కల్పించారు. ప్రింట్‌ తీసిన అనంతరం దరఖాస్తుదారులకు లామినేషన్‌ చేసిన కార్డులను అందచేస్తారు. వివిధ సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు ఇంటి వద్దే అందచేసేందుకు ప్రభుత్వం నియమించిన 2.81 లక్షల మంది వలంటీర్లకు మొబైల్‌ ఫోన్లు, సిమ్‌కార్డులను ఇప్పటికే పంపిణీ చేశారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement