వైద్య సేవలందకే 16 మంది మృతి
చాపరాయి ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు
సాక్షి, అమరావతి: సకాలంలో ప్రభుత్వ సేవలు అందకపోవడం వల్లే చాపరాయిలో 16 మంది మృతి చెందారని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. ఏజెన్సీ ప్రాంతంలోని వారి మృతికి ఇదే కారణమవడం బాధాకరమన్నారు. శుక్రవారం ఉండవల్లిలోని తన నివాసం నుంచి వివిధ శాఖల అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. సమాచారలోపం వల్లే చాపరాయి వంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయని తెలిపారు. ఏమూల ఏం జరిగినా సత్వరం సమాచారం అందేలా యంత్రాంగం దృష్టి పెట్టాలన్నారు.
చాపరాయి లాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలన్నారు. ప్రజల అమాయకత్వం కూడా ఇలాంటి ఘటనలకు కారణాలవుతున్నాయన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ప్రతినెలా హెల్త్ బులెటిన్లు విడుదల చేయాలని ఆదేశించారు.