
సాక్షి,సిటీబ్యూరో: ఆపదలో ఉన్నప్పుడు.. అత్యవసర సమయాల్లోను వివిధ ప్రభుత్వ శాఖల సహాయం అవసరమవుతుంది. అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ఆ శాఖతోను, రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు వైద్య శాఖతోను, వరదలు వంటి సమయాల్లో మరోశాఖ సేవలు ప్రజలకు అవసరం. అయితే, అలాంటప్పుడు ఆయా శాఖలకు చెందిన అత్యవసర నంబర్లకు ఫోన్ చేయాలి. ఒకవేళ ఆ నంబర్ పనిచేయక పోయినా.. బిజీగా ఉన్నా మన అత్యవసరం ఏంటో అవతలి వాళ్లకు తెలియదు. ఈ సమస్య లేకుండా వివిధ మార్గాల ద్వారా సాయం పొందే అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం పౌరులకు కల్పించింది. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌కు కొన్ని రోజుల ముందు దేశ వ్యాప్తంగా ‘112’ నంబర్‌ను అందుబాటులోకి తెచ్చింది.
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ సేవలను అందిస్తున్నారు. మొన్నటి వరకూ పోలీసు శాఖ సేవల కోసం 100, అగ్నిమాపక శాఖ సేవలకు 101, ప్రమాదాలు జరిగినప్పుడు వైద్యం కోసం 108, చిన్నారుల రక్షణకు 1090 నంబర్‌కు కాల్ చేయాల్సి వచ్చేది. అవి బిజీగా ఉంటే చాలాసేపు నిరీక్షించాల్సిన పరిస్థితి. ఇకపై ఆ సమస్య లేకుండా ‘సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్’(సీడీఏసీ) ద్వారా ‘ఎమర్జింగ్ రెస్పాన్స్ సపోర్ట్ సిస్టం’ (ఈఆర్‌ఎస్‌ఎస్)ను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇది 24 గంటల పాటు సేవలందిస్తుంది. అన్ని రాష్ట్రాలకు చెందిన ప్రభుత్వ శాఖల సమన్వయంతో పనిచేసే ఈ వ్యవస్థ ద్వారా క్షణాల్లో అత్యవసర సేవలను అందిస్తారు. ఈ 112 నంబర్‌పై అవగాహన లేక చాలా మంది ఈ సేవలకు దూరంగా ఉంటున్నారు.
సేవలు పొందడం ఇలా..
♦ ఫోన్ ఏదైనా (స్మార్ట్/ఫీచర్/ల్యాండ్)సరే ‘112’ నంబర్ నుంచి సేవలు పొందవచ్చు. వివిధ మార్గాల ద్వారా అత్యవసర వైద్యం, భద్రతా పరమైన సహాయం కోరవచ్చు.
♦ సంక్లిప్త సందేశం(ఎస్‌ఎంఎస్), వాయిస్ కాల్, ఈ–మొయిల్, ఈఆర్‌ఎస్‌ఎస్ వెబ్‌సైట్ ద్వారా ఫిర్యాదులు స్వీకరించి వెంటనే సేవలందించేందుకు చర్యలు తీసుకుంటారు.
♦ ప్రత్యేక యాప్ రూపంలో కూడా సేవలు అందుబాటులో ఉన్నాయి. స్మార్ట్‌ఫోన్లలో యాప్‌ను నిక్లిప్తం చేసుకోవచ్చు.
♦ సాధారణ ఫోన్‌లో 5 లేదా 9 నంబర్లను ఎక్కువసేపు ప్రెస్‌చేసి ఉంచడం ద్వారా కూడా ‘112’ అత్యవసర సేవల విభాగం సిబ్బంది లైన్‌లోకి వస్తారు. జీపీఎస్ పరిజ్ఞానం ద్వారా సమస్యను గుర్తించి వివిధ ప్రభుత్వశాఖలను అప్రమత్తం చేసి సేవలందిస్తారు.