రూ.10 లక్షలు దాటితే రివర్స్‌ టెండరింగ్‌ | YS Jagan Says Reverse Tendering from above Rs 10 Lakhs | Sakshi
Sakshi News home page

రూ.10 లక్షలు దాటితే రివర్స్‌ టెండరింగ్‌

Published Thu, Oct 10 2019 3:20 AM | Last Updated on Thu, Oct 10 2019 4:52 AM

YS Jagan Says Reverse Tendering from above Rs 10 Lakhs - Sakshi

అధికారులతో సమీక్షిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

సాక్షి, అమరావతి: పారదర్శకతకు మరింత పెద్దపీట వేసేలా రూ.10 లక్షలు.. ఆ పైబడి విలువైన పనులు, సర్వీసులు, కొనుగోళ్ల కోసం బిడ్డింగ్, రివర్స్‌ టెండరింగ్‌ విధానాన్ని మరింత పటిష్టంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఉన్నతాధికారులను ఆదేశించారు. ఈ కొత్త విధానం జనవరి 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చేలా విధివిధానాలు రూపొందించాలని చెప్పారు. ఈలోగా ప్రస్తుతం ఉన్న ఇ–ప్రొక్యూర్‌మెంట్‌ ప్లాట్‌ఫాం మీదే సాధ్యమైనంత మేర పారదర్శకత ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ కాంట్రాక్టులు, సర్వీసులు, కొనుగోళ్లలో పారదర్శకత, ప్రజాధనం ఆదా కోసం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ బుధవారం తన క్యాంపు కార్యాలయంలో వివిధ శాఖల ఉన్నతాధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రూ.100 కోట్లు పైబడిన కాంట్రాక్టులను ముందస్తు న్యాయ సమీక్ష ప్రక్రియకు నివేదించడం ద్వారా విప్లవాత్మక సంస్కరణలు తీసుకు వచ్చామని చెప్పారు. ఈ విధానాన్ని మరింత కట్టుదిట్టంగా అమలు చేయడంలో భాగంగా కనీసం ఐదుగురు లేదా బిడ్డింగ్‌లో పాల్గొన్న మొదటి 60 శాతం మంది మాత్రమే (బిడ్డింగ్‌లో 10 మంది పాల్గొంటే అందులో ఎల్‌ 1 నుంచి ఎల్‌ 6 వరకు) రివర్స్‌ టెండరింగ్‌కు అర్హులయ్యేలా చూడాలన్నారు. దీనివల్ల బిడ్డింగ్‌ ప్రక్రియలో కోట్‌ చేసేటప్పుడు వాస్తవికత ఉంటుందని, రివర్స్‌ టెండరింగ్‌లో మరింత పోటీకి దారితీస్తుందని చెప్పారు. 

టెండర్లలో ఎక్కువ మంది పాల్గొనేలా చూడాలి 
రూ.10 లక్షలు పైబడి, రూ.100 కోట్ల లోపు ప్రభుత్వ సర్వీసులు, పనులు, కొనుగోళ్ల విషయంలో కూడా ఇలాంటి నిబంధనలను అమలు చేయాలని సీఎం సూచించారు. ప్రభుత్వ పనులు, సర్వీసులు, కాంట్రాక్టుల్లో శాశ్వత ప్రాతిపదికన పారదర్శకత తీసుకొచ్చేలా ఒక విధానం ఉండాలని ఆదేశించారు. టెండర్లలో ఎక్కువ మంది పాల్గొనేలా ఈ విధానం ఉండాలన్నారు. టెండర్లలో పాల్గొనాలంటే నిరుత్సాహం కలిగించే పరిస్థితి ఉండకూడదని స్పష్టం చేశారు. టెండర్లలో పేర్కొంటున్న అంశాలు మరింత విశదీకరంగా, అందరికీ అందుబాటులో ఉంచాలన్నారు. తక్కువ ధరకు కోట్‌ చేసిన టెండర్‌ వివరాలను ఇ–ప్రొక్యూర్‌మెంట్‌ సైట్‌లో వారం రోజుల పాటు అందరికీ అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ఆ తర్వాత రివర్స్‌ టెండరింగ్‌కు వెళ్లాలని చెప్పారు. రాష్ట్ర స్థాయిలోనే కాకుండా జిల్లాల వారీగా టెండర్లు పిలవాలని సూచించారు. ఎక్కువ మంది పోటీలో పాల్గొనేలా ప్యాకేజీలు ఉండాలని చెప్పారు.  

పనులు, సర్వీసులు, కొనుగోళ్లపై జాబితా 
ప్రభుత్వ పరంగా సర్వీసులు, పనులు, కొనుగోళ్లలో ఒకే రీతి విధానం లేదని అధికారులు సీఎం దృష్టికి తీసుకువచ్చారు. స్థిరమైన విధానం లేనందున ఒక్కోశాఖ ఒక్కోలా వ్యవహరిస్తోందని వివరించారు. ఇ–ప్రొక్యూర్‌మెంట్‌ కోసం ఉన్న పోర్టల్‌ను పూర్తి స్థాయిలో వినియోగించని వైనాన్ని కూడా సీఎం దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై సీఎం స్పందిస్తూ.. ప్రభుత్వ పరంగా చేస్తున్న రూ.10 లక్షల నుంచి రూ.100 కోట్ల లోపు కొనుగోళ్లు, అప్పగిస్తున్న సర్వీసులు, పనుల విషయంలో ఒక జాబితా తయారు చేయాలని ఆదేశించారు. ఆ తర్వాత వీటి టెండర్ల విషయంలో ఒక విధానాన్ని తీసుకురావాలన్నారు. ఇప్పటికే శాఖల వారీగా వివరాలు సేకరిస్తున్నామని, వీటిని పరిగణనలోకి తీసుకుని ఒక విధానాన్ని తీసుకురావడానికి సంబంధిత కార్యదర్శులతో కమిటీని ఏర్పాటు చేస్తున్నామని వారు సీఎంకు వివరించారు. ఆర్థిక శాఖ మిగతా శాఖలతో సమన్వయం చేసుకుని మాన్యువల్‌ రూపొందిస్తుందని చెప్పారు. కొత్త పాలసీని జనవరి 1 నుంచి అమల్లోకి తీసుకు రావాలని, ఆలోగా ప్రస్తుతం ఉన్న ఇ– ప్రొక్యూర్‌మెంట్‌ పోర్టల్‌ను నవంబర్‌ 1 నుంచి పూర్తి స్థాయిలో వినియోగించాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఈ పద్ధతుల్లో బిడ్‌ దక్కించుకున్న వారికి చెల్లింపులు కూడా వేగంగా జరిగేలా, ఆమేరకు చెల్లింపుల విభాగంతో లింక్‌ ఏర్పాటు చేయాలని సూచించారు.  

సమన్వయం, పర్యవేక్షణకు ఐఏఎస్‌ అధికారి
ప్రభుత్వ సర్వీసులు, పనులు, కొనుగోళ్ల టెండర్లలో ఇ–ప్రొక్యూర్‌మెంట్, జ్యుడిషియల్‌ ప్రివ్యూ, రివర్స్‌ టెండరింగ్‌ పక్రియలు సాఫీగా జరిగేలా సహకారం అందించేందుకు ప్రత్యేకంగా ఒక ఐఏఎస్‌ అధికారిని నియమించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఎప్పటికప్పుడు ప్రభుత్వ సర్వీసులు, పనులు, కొనుగోళ్లను పరిశీలిస్తూ రివర్స్‌ టెండరింగ్‌ ప్రక్రియ సాఫీగా కొనసాగేలా చూడాల్సిన బాధ్యత ఈ అధికారిదేనని సీఎం స్పష్టం చేశారు. ఈ అధికారి జ్యుడిషియల్‌ ప్రివ్యూకు అవసరమైన వివరాలు అందించడంతో పాటు ప్రాధామ్యాలను నిర్దేశిస్తారని చెప్పారు. జ్యుడిషియల్‌ ప్రివ్యూకు టెండర్‌ పంపగానే సంబంధిత శాఖ అధికారి వెళ్లి అక్కడ న్యాయమూర్తికి వివరించాలని కూడా సీఎం ఆదేశించారు. ఈ మేరకు ఆయా శాఖల నుంచి సాంకేతిక సహకారం అందించే వ్యక్తులను వెంటనే సూచించాలన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement